Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:54

[1] యేసు దేవాలయం విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు దేవాలయం కట్టడాలను ఆయనకు చూపెట్టడానికి వచ్చారు.

[2] అందుకు యేసు “ఇవన్నీ చూస్తున్నారు గదా. మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ రాయిమీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా అన్నిటినీ పడద్రోయడం జరుగుతుంది” అని వారితో చెప్పాడు.

[3] తరువాత ఆయన ఆలీవ్ కొండమీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “అవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, యుగ సమాప్తికి సూచన ఏది? మాతో చెప్పు” అన్నారు.

[4] యేసు వారికిలా జవాబిచ్చాడు: “మిమ్ములను ఎవరైనా మోసగించి తప్పుదారి పట్టించకుండా చూచుకోండి.

[5] అనేకులు నా పేర వచ్చి ‘నేనే క్రీస్తును’ అంటూ చాలామందిని మోసగించి తప్పుదారి పట్టిస్తారు.

[6] “మీరు యుద్ధవార్తలూ యుద్ధ వదంతులూ వింటారు. అప్పుడు కంగారుపడకుండా చూచుకోండి. ఇవన్నీ తప్పక జరగాలి గానీ, అంతం అప్పుడే రాదు.

[7] జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ కరువులూ ఈతిబాధలూ భూకంపాలూ వస్తాయి.

[8] ఇవన్నీ తొలి ప్రసవ వేదనల్లాంటివి మాత్రమే.

[9] “అప్పుడు వారు మిమ్ములను బాధలకు గురి చేస్తారు, మిమ్ములను చంపుతారు. నా పేరు కారణంగా అన్ని దేశాల ప్రజలు మిమ్ములను ద్వేషిస్తారు.

[10] ఆ కాలంలో చాలామంది తొట్రు పడిపోతారు, ఒకరినొకరు శత్రువులకు పట్టి ఇస్తారు, ఒకరినొకరు ద్వేషిస్తారు.

[11] చాలామంది కపట ప్రవక్తలు వచ్చి అనేకులను మోసగించి తప్పుదారి పట్టిస్తారు.

[12] న్యాయరాహిత్యం వృద్ధి అవుతుంది గనుక చాలామందికి ప్రేమ చల్లారిపోతుంది.

[13] అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.

[14] ఈ రాజ్య శుభవార్త లోకమంతటా అన్ని జనాలకు సాక్ష్యంగా ప్రకటించడం జరుగుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

[15] “అందుచేత, దానియేలుప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ‘అసహ్యమైన వినాశకారి’ అతి పవిత్ర స్థలంలో నిలుచుండడం మీరు చూచినప్పుడు (చదివేవారు గ్రహిస్తారు గాక!)

[16] వెంటనే యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.

[17] మిద్దెమీద ఉన్న వ్యక్తి తన ఇంట్లోనుంచి దేన్నయినా తీసుకువెళ్ళడానికి దిగిరాకూడదు.

[18] పొలంలో ఉన్న వ్యక్తి పై వస్త్రం తీసుకు వెళ్ళడానికి వెనక్కు తిరగకూడదు.

[19] అయ్యో! ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది.

[20] అప్పుడు మహా బాధకాలం వస్తుంది. గనుక మీరు పారిపోవడం చలికాలంలో గానీ విశ్రాంతి దినాన గానీ జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.

[21] అలాంటి బాధకాలం లోకారంభంనుంచి ఇప్పటివరకు రాలేదు. ఆ తరువాత మరెన్నటికీ రాదు.

[22] ఆ రోజులను తక్కువ చేయడం జరిగి ఉండకపోతే శరీరం ఉన్న ఎవరూ తప్పించుకొనేవారు కాదు. గానీ దేవుడు ఎన్నుకొన్నవారి కోసం ఆ రోజులను తక్కువ చేయడం జరుగుతుంది.

[23] “ఆ కాలంలో ఎవరైనా మీతో ‘ఇడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా ‘అక్కడ ఉన్నాడు!’ అంటే నమ్మకండి.

[24] కపట క్రీస్తులూ కపట ప్రవక్తలూ వస్తారు. సాధ్యమైతే, దేవుడు ఎన్నుకొన్నవారిని కూడా మోసగించి తప్పుదారి పట్టించడానికి మహా సూచనలూ అద్భుతాలూ ప్రదర్శిస్తారు.

[25] నేను మీతో ముందుగానే చెప్పాను సుమా!

[26] గనుక వారు ‘అడుగో, ఆయన ఎడారిలో ఉన్నాడు’ అంటే అటు వెళ్ళకండి. ‘అడుగో, లోపలి గదుల్లో ఉన్నాడు’ అంటే నమ్మకండి.

[27] ఎందుకంటే, మెరుపు తూర్పున పుట్టి పడమరవరకు ఎలా తళుక్కుమంటుందో అలాగే మానవ పుత్రుని రాక ఉంటుంది.

[28] పీనుగు ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.

[29] “ఆ రోజుల బాధ అయిపోయిన వెంటనే సూర్య మండలాన్ని చీకటి కమ్ముతుంది. చంద్రబింబం కాంతి ఇవ్వదు. ఆకాశంనుంచి చుక్కలు రాలుతాయి. ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి.

[30] అప్పుడు మానవ పుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు భూమిమీద ఉన్న అన్ని జాతులవారు గుండెలు బాదుకొంటారు, మానవ పుత్రుడు ఆకాశ మేఘాలమీద బలప్రభావాలతో, మహా మహిమా ప్రకాశంతో రావడం చూస్తారు.

[31] ఆయన తన దేవదూతలను గొప్ప బూరధ్వనితో పంపుతాడు. వారు ఆయన ఎన్నుకొన్న వారిని నలుదిక్కులనుంచీ ఆకాశం ఆ చివరనుంచి ఈ చివరవరకు సమకూరుస్తారు.

[32] “అంజూరచెట్టు ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పెట్టినప్పుడు వసంతకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది.

[33] అలాగే ఈ సంగతులన్నీ జరగడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే, తలుపుల దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.

[34] మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఎంత మాత్రమూ గతించదు.

[35] ఆకాశం, భూమి గతిస్తాయి గానీ నా మాటలు ఎన్నటికీ గతించవు.

[36] “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు. పరలోక దేవదూతలకూ తెలియదు. నా తండ్రికి మాత్రమే తెలుసు.

[37] మానవపుత్రుని రాకడ నోవహు రోజులలాగే ఉంటుంది.

[38] ఎలా అంటే, జలప్రళయానికి ముందు రోజుల్లో నోవహు ఓడలోకి వెళ్ళే రోజు వరకూ ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు.

[39] జల ప్రళయం వచ్చి వారందరినీ తీసుకుపోయేవరకు వారు గ్రహించలేదు. మానవ పుత్రుని రాకడ అలాగే ఉంటుంది.

[40] అప్పుడు ఇద్దరు పురుషులు పొలంలో ఉంటారు. ఒకణ్ణి తీసుకుపోవడం, మరొకణ్ణి విడిచిపెట్టడం జరుగుతుంది.

[41] ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. ఒకతెను తీసుకుపోవడం, ఒకతెను విడిచిపెట్టడం జరుగుతుంది.

[42] “మీ ప్రభువు ఏ గడియ వస్తాడో మీకు తెలియదు గనుక, మెళుకువగా ఉండండి.

[43] ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడు.

[44] మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.

[45] “యజమాని తన ఇంటి దాసులకు తగిన వేళ ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడెవడు?

[46] యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు.

[47] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తన ఆస్తి అంతటి మీదా నియమిస్తాడు.

[48] గానీ, ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై ఉండి ‘నా యజమాని ఇప్పుడే రాడు లే’ అనుకొని,

[49] సాటి దాసులను కొట్టడం, త్రాగుబోతులతో తిని త్రాగడం ఆరంభిస్తే

[50] ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు.

[51] అతణ్ణి రెండు ముక్కలుగా నరికివేసి కపట భక్తులతోపాటు అతనికి వంతు నియమిస్తాడు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.

మత్తయి శుభవార్త — Chapters