Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:06

[1] ఇది యేసు క్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు అబ్రాహాము కుమారుడు.

[2] అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుమారులు యూదా, అతడి అన్నదమ్ములు.

[3] యూదా కుమారులు పెరెసు, జెరహు. వారి తల్లి తామారు. పెరెసు కుమారుడు ఎస్రోన్. ఎస్రోన్ కుమారుడు ఆరామ్.

[4] ఆరామ్ కుమారు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.

[5] శల్మాను కుమారుడు బోయజు. బోయజు తల్లి రాహాబు. బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు. ఓబేదు కుమారుడు యెష్షయి.

[6] యెష్షయి కుమారుడు దావీదురాజు. దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య.

[7] సొలొమోను కుమారుడు రెహబాం. రెహబాం కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.

[8] ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం. యెహోరాం కుమారుడు ఉజ్జీయా.

[9] ఉజ్జీయా కుమారుడు యోతాం. యోతాం కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.

[10] హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

[11] యోషీయా కుమారులు యెకొన్యా, అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది.

[12] యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు: యెకొన్యా కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్.

[13] జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీం. ఎల్యాకీం కుమారుడు అజోరు.

[14] అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అకీం. అకీం కుమారుడు ఏలీహూదు.

[15] ఏలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.

[16] యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం “క్రీస్తు”.

[17] ఈ విధంగా అబ్రాహామునుంచి దావీదువరకు పధ్నాలుగు తరాలు; దావీదు కాలంనుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్ళిన కాలంవరకు పధ్నాలుగు తరాలు; బబులోనుకు తీసుకువెళ్ళిన కాలంనుంచి క్రీస్తువరకు పధ్నాలుగు తరాలు.

[18] ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ: ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది.

[19] ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు, గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకొన్నాడు.

[20] అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే, ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు: “యోసేపు! దావీదు కుమారా! మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది.

[21] ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాలనుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి.”

[22] ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది:

[23] “ఇదిగో వినండి, ఒక కన్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ‘ఇమ్మానుయేల్’ అని నామకరణం చేస్తారు.” ఇమ్మానుయేల్‌ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.

[24] యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు.

[25] అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు.

మత్తయి శుభవార్త — Chapters