Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:53

[1] అప్పుడు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ కొందరు జెరుసలంనుంచి యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:

[2] “మీ శిష్యులు భోజనం చేయకముందు చేతులు కడుక్కోకుండా పెద్దల సాంప్రదాయాన్ని మీరుతారెందుకు?”

[3] అందుకాయన వారికిలా బదులు చెప్పాడు: “మీరు మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను మీరుతున్నారెందుకు?

[4] దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణశిక్ష విధించి తీరాలి.

[5] మీరైతే ఇలా అంటారు: ఎవడైనా తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా దేవునికి అర్పించబడింది’ అని చెపితే

[6] అలాంటివాడు ఆ విషయంలో తండ్రిని గానీ తల్లిని గానీ గౌరవించనక్కరలేదన్న మాట. ఈ విధంగా మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తున్నారు.

[7] మీరు కపట భక్తులు! మీ విషయం యెషయాప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉంది –

[8] ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి చేరుతున్నారు, తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.

[9] వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పితమైన ఆదేశాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు.”

[10] అప్పుడాయన జన సమూహాన్ని దగ్గరికి పిలిచి వారికిలా చెప్పాడు: “వినండి! గ్రహించండి!

[11] నోట్లోకి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు గాని నోట్లోనుంచి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది.”

[12] అప్పుడు ఆయన శిష్యులు ఆయనదగ్గరికి వచ్చి “ఈ మాట విన్నప్పుడు అది పరిసయ్యులకు అభ్యంతర కారణం అయింది తెలుసా” అన్నారు.

[13] అందుకాయన ఈ సమాధానం చెప్పాడు: “నా పరమ తండ్రి నాటని ప్రతి మొక్కనూ వేళ్ళతో పెరికివేయడం జరుగుతుంది.

[14] వారిని విడిచిపెట్టండి. వారు గుడ్డివారికి దారి చూపే గుడ్డివారు. గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ గుంటలో పడిపోతారు.”

[15] అప్పుడు పేతురు “ఆ ఉదాహరణ మాకు వివరించండి” అని ఆయనకు జవాబిచ్చాడు.

[16] యేసు అన్నాడు, “ఇంకా మీరు కూడా మందబుద్ధులేనా?

[17] నోటిలో వేసుకొనేదంతా కడుపులోకి పోయి విసర్జించ బడుతుంది.

[18] కానీ నోటనుంచి వచ్చేవి హృదయంలోనుంచి వస్తాయి. ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి. మీరింకా ఇది గ్రహించడం లేదా?

[19] హృదయంలో నుంచి చెడ్డ తలంపులు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక అవినీతి, దొంగతనాలు, దొంగ సాక్ష్యాలు, దూషణలు వస్తాయి.

[20] ఇలాంటివే మనిషిని అపవిత్రం చేస్తాయి, గాని చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం మనిషిని అపవిత్రం చేయదు.”

[21] యేసు అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళాడు.

[22] అప్పుడు, ఆ ప్రాంతంలో నివసించే కనాను స్త్రీ ఒకతె వచ్చి ఆయనకు ఇలా బిగ్గరగా చెప్పింది: “స్వామీ! దావీదు కుమారుడా! నామీద దయ చూపండి. నా కూతురును దయ్యం ఘోరంగా పట్టింది.”

[23] అందుకాయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి “ఆమెను పంపివేయండి. మా వెంటబడి కేకలు వేస్తూ ఉంది” అని ఆయనను ప్రాధేయ పడ్డారు.

[24] ఆయన జవాబిచ్చాడు, “ఇస్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డాను.”

[25] అయితే ఆమె వచ్చి ఆయనను ఆరాధించి “స్వామీ! నాకు సహాయం చెయ్యండి!” అంది.

[26] అందుకాయన “పిల్లల భోజనం తీసి కుక్కపిల్లలకు వేయడం తగిన పని కాదు” అని జవాబిచ్చాడు.

[27] ఆమె “నిజమే స్వామీ గాని కుక్కపిల్లలు సహా తమ యజమాని బల్లమీదనుంచి పడే ముక్కలు తింటాయి గదా!” అంది.

[28] అప్పుడు యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరినట్టే నీకు జరుగుతుంది.” ఆ ఘడియలోనే ఆమె కూతురికి పూర్తిగా నయం అయింది.

[29] యేసు అక్కడనుంచి బయలుదేరి గలలీ సరస్సుకు దగ్గరగా చేరి, ఒక కొండెక్కి కూర్చున్నాడు.

[30] గొప్ప జనసమూహాలు వచ్చి కుంటివారినీ గుడ్డివారినీ మూగవారినీ వికలాంగులనూ ఇంకా అనేకులను ఆయన దగ్గరకు తెచ్చి ఆయన పాదాల ముందు ఉంచారు. ఆయన వారిని బాగు చేశాడు.

[31] మూగవారు మాట్లాడ్డం, వికలాంగులకు పూర్తిగా నయం కావడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం చూచి జన సమూహానికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వారు ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి కీర్తించారు.

[32] తన శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని యేసు ఇలా అన్నాడు: “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తూ ఉంది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. వారిని ఆకలితోనే పంపివేయడం నాకిష్టం లేదు. దారిలో వారు శోష పోవచ్చు.”

[33] ఆయన శిష్యులు ఆయనతో అన్నారు, “ఎవరూ కాపురం లేని ఈ స్థలంలో ఇంత పెద్ద గుంపు తృప్తిగా తినడానికి చాలినన్ని రొట్టెలు మనకు ఎక్కడ దొరుకుతాయి!”

[34] యేసు “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారినడిగాడు. వారు “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి” అన్నారు.

[35] జన సమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు.

[36] అప్పుడు ఆ ఏడు రొట్టెలూ ఆ చేపలూ చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి తన శిష్యులకు అందించాడు. శిష్యులు జన సమూహానికి వడ్డించారు.

[37] అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం ఏడు పెద్ద గంపలు నిండాయి.

[38] తిన్న పురుషులు నాలుగు వేలమంది. వారితో పాటు స్త్రీలు, పిల్లలు తిన్నారు.

[39] తరువాత ఆయన జనసమూహాన్ని పంపివేసి పడవ ఎక్కి మగ్దాల ప్రాంతానికి వెళ్ళాడు.

మత్తయి శుభవార్త — Chapters