[1] ఆ తరువాత ఆయన తన పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని మలిన పిశాచాలను వెళ్ళగొట్టడానికీ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేయడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
[2] ఆ పన్నెండుమంది రాయబారుల పేర్లు ఇవి: మొదట, సీమోను (ఇతణ్ణి “పేతురు” అంటారు), అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను,
[3] ఫిలిప్పు, బర్తొలోమయి, తోమా, సుంకంవాడైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అనే ఇంటి పేరున్న లెబ్బయి,
[4] కనానీయుడైన సీమోను, యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
[5] ఈ పన్నెండుమందిని పంపుతూ యేసు ఈ విధంగా వారికి ఆదేశించాడు: “ఇతర జనాల దారిలోకి వెళ్ళకండి. సమరయ దేశస్తుల పట్టణాలలో దేనిలోకీ వెళ్ళకండి.
[6] ఇస్రాయేల్ వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికే వెళ్ళండి.
[7] వెళుతూ, పరలోక రాజ్యం సమీపమైందని ప్రకటించండి.
[8] “రోగులను బాగు చేయండి. చనిపోయినవారిని సజీవంగా లేపండి. కుష్ఠురోగులను శుద్ధంగా చేయండి. దయ్యాలను వెళ్ళగొట్టండి. మీరు పొందినది ఉచితంగా పొందారు. ఉచితంగానే ఇవ్వండి.
[9] జేబుల్లో బంగారం గానీ వెండి గానీ రాగి గానీ పెట్టుకువెళ్ళకండి.
[10] ప్రయాణంకోసం సంచి గానీ రెండో చొక్కా గానీ చెప్పులు గానీ చేతికర్రలు గానీ తీసుకుపోకండి. పని చేసేవాడు ఆహారానికి తగినవాడు.
[11] “మీరు ఏ పట్టణంలో, ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడనుంచి వెళ్ళేవరకు వారి ఇంట్లోనే బస చేయండి.
[12] ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటివారికి శుభమని చెప్పండి.
[13] ఆ ఇంటిలో యోగ్యత ఉంటే మీ శాంతి దానిమీదికి రానివ్వండి. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకే తిరిగి రానివ్వండి.
[14] మిమ్ములను ఎవరైనా స్వీకరించకపోతే, మీ మాటలు పెడచెవిని పెడితే, ఆ ఇల్లు, ఆ గ్రామం విడిచివెళ్ళేటప్పుడు మీ కాళ్ళ దుమ్ము దులిపివేయండి.
[15] నేను ఖచ్చితంగా చెపుతున్నాను, తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సొదొమ, గొమొర్రా పట్టణాలకు పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది!
[16] “ఇదిగో వినండి. తోడేళ్ళ మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతూ ఉన్నాను. కనుక పాముల్లాగా తెలివిగా, పావురాల్లాగా హాని చేయనివారుగా ఉండండి.
[17] మనుషుల విషయం జాగ్రత్త! వారు మిమ్ములను న్యాయసభలకు అప్పగిస్తారు. తమ సమాజ కేంద్రాలలో కొరడాలతో కొడతారు.
[18] నా కారణంగా మిమ్ములను రాష్ట్రాధిపతుల దగ్గరకూ రాజుల దగ్గరకూ తీసుకుపోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు వారి ఎదుట, ఇతర జనాల ఎదుట సాక్ష్యంగా ఉంటారు.
[19] వారు మిమ్ములను అలా వారికి అప్పగించేటప్పుడు మీరు ఏమి చెప్పాలో, ఎలా మాట్లాడాలో అని బెంబేలు పడకండి. ఆ సమయంలో మీరు చెప్పవలసినది మీకు అందించబడుతుంది.
[20] ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గానీ మీ పరమ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
[21] “సోదరుడు తన సొంత సోదరుణ్ణి, తండ్రి తన సొంత కొడుకును మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రులమీద తిరుగబడి వారిని చంపిస్తారు.
[22] నా పేరు కారణంగా మీరు అందరి ద్వేషానికి గురి అవుతారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.
[23] మిమ్ములను ఈ గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మానవపుత్రుడు వచ్చేలోగా మీరు ఇస్రాయేల్ గ్రామాలన్నిటికీ వెళ్ళి ఉండరు.
[24] “గురువుకంటే శిష్యుడు, తన యజమానికంటే దాసుడు గొప్పవాడేమీ కాదు.
[25] శిష్యుడు తన గురువులాగా, దాసుడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయల్‌జెబూల్ అంటే, ఆయన ఇంటివారిని వారు అలా అనడం మరీ నిశ్చయం గదా.
[26] “కనుక వారికి భయపడకండి. కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు.
[27] మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవులకు వినిపించేది ఇంటికప్పుల మీదనుంచి చాటించండి.
[28] ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి. శరీరాన్నీ ఆత్మనూ కూడా నరకంలో నాశనం చేయగలవానికి, ఆయనకే భయపడండి.
[29] “రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు.
[30] మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది.
[31] అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
[32] “నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఒప్పుకొనేవారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట ఎరుగుదునని నేనూ ఒప్పుకొంటాను.
[33] కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట నేనూ ఎరగనంటాను.
[34] “భూలోకంమీదికి శాంతిని తేవడానికి నేను వచ్చాననుకోకండి. ఖడ్గం తేవడానికి వచ్చాను గాని శాంతిని కాదు.
[35] అంటే, ఒక మనిషి తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా అయ్యేలా చేయుదును.
[36] ఒక మనిషి సొంత ఇంటివారే తన శత్రువులుగా తయారవుతారు.
[37] “నామీది ప్రేమకంటే తండ్రిమీద గానీ తల్లిమీద గానీ ఎక్కువ ప్రేమగలవాడు నాకు తగినవాడు కాడు. నామీది ప్రేమకంటే కొడుకుమీద గానీ కూతురుమీద గానీ ఎక్కువ ప్రేమగలవాడు నాకు తగినవాడు కాడు.
[38] తన సిలువను ఎత్తుకొని నావెంట రానివాడు నాకు తగినవాడు కాడు.
[39] “తన కోసం జీవాన్ని దక్కించుకొనేవాడు దానిని పోగొట్టుకొంటాడు. నాకోసం తన జీవాన్ని పోగొట్టుకొనేవాడు దానిని దక్కించుకొంటాడు.
[40] “మిమ్ములను స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపేవాణ్ణే స్వీకరిస్తున్నాడు.
[41] ప్రవక్త అని ప్రవక్తను స్వీకరించేవానికి ప్రవక్తకు తగిన బహుమానం లభిస్తుంది. న్యాయవంతుడని న్యాయవంతుణ్ణి స్వీకరించేవానికి న్యాయవంతులకు తగిన బహుమానం లభిస్తుంది.
[42] ఈ చిన్నవారిలో ఒకరికి శిష్యుడని ఒక గిన్నెడు చన్నీళ్ళయినా ఇచ్చేవానికి తన బహుమానం దొరకకుండా పోదని నేను ఖచ్చితంగా చెపుతున్నాను.”