[1] రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,
[2] కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను?
[3] నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు.
[4] ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.
[5] తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు.
[6] ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి.
[7] వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు.
[8] మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.
[9] నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
[10] సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
[11] ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.
[12] ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.
[13] ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది.
[14] వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.
[15] ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
[16] ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
[17] ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
[18] తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
[19] ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.
[20] దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.
[21] తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.
[22] ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు.
[23] ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.
[24] ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.
[25] బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.
[26] ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.
[27] ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.
[28] ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.
[29] “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.
[30] చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.
[31] ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.