[1] మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.
[2] ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.
[3] నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.
[4] యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.
[5] హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.
[6] నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.
[7] ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.
[8] అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.
[9] ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
[10] రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు.
[11] న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు.
[12] రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.
[13] సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.
[14] రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు.
[15] రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.
[16] విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
[17] నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.
[18] ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
[19] దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
[20] ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
[21] హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.
[22] తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
[23] జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.
[24] మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
[25] ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.
[26] కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
[27] దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.
[28] మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
[29] దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
[30] కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.
[31] నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.
[32] పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
[33] చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.