[1] చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.
[2] మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.
[3] జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.
[4] న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.
[5] తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు.
[6] దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.
[7] మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.
[8] అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.
[9] జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.
[10] రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.
[11] బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.
[12] రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.
[13] పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.
[14] ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.
[15] బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.
[16] దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు.
[17] నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.
[18] ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.
[19] సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.
[20] తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.
[21] ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి.
[22] కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.
[23] ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
[24] దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.
[25] భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
[26] పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే.
[27] మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.