[1] దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.
[2] జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ,
[3] నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి,
[4] ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.
[5] తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.
[6] వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
[7] యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.
[8] కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
[9] అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.
[10] కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
[11] దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం.
[12] ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.
[13] దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి.
[14] నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు.
[15] కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో.
[16] మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
[17] ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.
[18] వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు.
[19] అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది.
[20] జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.
[21] జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది.
[22] “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?
[23] నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను.
[24] నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు.
[25] నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు.
[26] కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను.
[27] తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను.
[28] అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.
[29] జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది.
[30] వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు.
[31] కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.
[32] ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది.
[33] నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”