Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:05

[1] ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.

[2] దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.

[3] పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.

[4] ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.

[5] దుష్టులు న్యాయమేదో గ్రహించరు. యెహోవాను ఆశ్రయించే వారికి అన్నీ తెలుసు.

[6] వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు.

[7] ఉపదేశం అంగీకరించే తనయుడు బుద్ధిమంతుడు. తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.

[8] డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.

[9] ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.

[10] యథార్థవంతులను దుర్మార్గంలో పడవేసే వాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు. నిష్కళంకులకు మంచి వారసత్వం దొరుకుతుంది.

[11] ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల పేదవాడు వాడి అసలు రంగు బయట పెడతాడు.

[12] నీతిపరులకు జయం కలగడం మహాఘనతకు కారణం. దుష్టులు అధికారానికి వచ్చేటప్పుడు ప్రజలు దాగిఉంటారు.

[13] అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

[14] ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.

[15] పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.

[16] వివేకం లేకుండా ప్రజానీకాన్ని పీడించే అధికారి క్రూరుడు. దగాకోరుతనాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడౌతాడు.

[17] వేరొకడి రక్తం చిందించిన వాడు దోషం మూటగట్టుకొన్నవాడు. వాడు మరణ దినం దాకా పారిపోతూనే ఉంటాడు.

[18] యథార్థంగా ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు. మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు.

[19] తన పొలం సేద్యం చేసుకునే వాడికి కడుపునిండా అన్నం దొరకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవారికి కలిగే పేదరికం అంతా ఇంతా కాదు.

[20] నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.

[21] పక్షపాతం చూపడం మంచిది కాదు. కేవలం ఒక్క రొట్టెముక్క కోసం కొందరు తప్పు చేస్తారు.

[22] చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.

[23] ముఖ స్తుతి మాటలు పలికే వాడికంటే మనుషులకు బుద్ధి చెప్పేవాడు తుదకు ఎక్కువ మెప్పు పొందుతాడు.

[24] తన తలిదండ్రుల సొమ్ము దోచుకుని “అది ద్రోహం కాదు” అనుకొనేవాడు నాశనం చేసే వాడికి జతకాడు.

[25] దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.

[26] తన మనస్సులోని ఆలోచనలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు.

[27] పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

[28] దుష్టులు అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజలు దాక్కుంటారు. దుర్మార్గులు నశించేటప్పుడు నీతిమంతులు వృద్ధి చెందుతారు.

సామెతలు — Chapters