Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:54

[1] కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

[2] అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

[3] అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

[4] అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

[5] నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

[6] ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

[7] నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

[8] అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

[9] యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

[10] అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

[11] కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

[12] ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.

[13] జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.

[14] వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.

[15] రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.

[16] జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

[17] అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.

[18] దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.

[19] తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.

[20] ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.

[21] కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.

[22] జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.

[23] అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.

[24] పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.

[25] అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.

[26] యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.

[27] అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.

[28] నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.

[29] నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.

[30] నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.

[31] దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.

[32] కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.

[33] దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.

[34] ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.

[35] జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.

సామెతలు — Chapters