[1] నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు.
[2] నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో.
[3] అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి.
[4] ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.
[5] డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.
[6] దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.
[7] ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.
[8] నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.
[9] బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.
[10] పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు.
[11] వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు.
[12] ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు.
[13] నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు.
[14] బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు.
[15] కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది.
[16] నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది.
[17] పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు.
[18] నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.
[19] కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో.
[20] ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు.
[21] తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది.
[22] నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు.
[23] సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో.
[24] ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు.
[25] నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి.
[26] కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.
[27] వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట.
[28] దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.
[29] ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు?
[30] ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా.
[31] ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు.
[32] అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది.
[33] నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు.
[34] నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు.
[35] “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.