[1] ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
[2] రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు.
[3] గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.
[4] మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.
[5] వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.
[6] మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.
[7] అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.
[8] బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం.
[9] మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
[10] బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం.
[11] తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం.
[12] తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.
[13] సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.
[14] బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.
[15] కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.
[16] సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.
[17] తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.
[18] తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.
[20] కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.
[21] నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.
[22] కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.
[23] చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.
[24] పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.
[25] వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.
[26] వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.
[27] గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.
[28] అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.