Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:14

[1] జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.

[2] యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.

[3] మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.

[4] ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.

[5] నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

[6] బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

[7] బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

[8] వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

[9] మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.

[10] ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.

[11] దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.

[12] ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

[13] ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.

[14] భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.

[15] తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.

[16] జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.

[17] తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.

[18] బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.

[19] చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.

[20] దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.

[21] పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

[22] కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.

[23] కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

[24] ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

[25] నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

[26] యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.

[27] యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

[28] జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.

[29] వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.

[30] సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.

[31] దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.

[32] కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

[33] తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

[34] ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

[35] తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.

సామెతలు — Chapters