[1] కుమారా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. నా ఆజ్ఞలు నీ దగ్గర పదిలంగా దాచుకో.
[2] నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది.
[3] నీ చేతి వేళ్లకు వాటిని కట్టుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసి ఉంచుకో.
[4] జ్ఞానంతో “నీవు నా సోదరివి” అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు.
[5] అలా చేస్తే నువ్వు వ్యభిచారి దగ్గరికి వెళ్ళకుండా, సరసాలాడే స్త్రీ వలలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు.
[6] నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను.
[7] జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు.
[8] సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు.
[9] ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు.
[10] అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది.
[11] ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.
[12] ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది.
[13] ఆమె ఆ యువకుణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిగ్గు, బిడియం లేని ముఖంతో అతనితో ఇలా చెప్పింది,
[14] “నేను శాంతి బలులు చెల్లించవలసి ఉంది. ఇప్పుడే నా మొక్కుబడులు చెల్లించాను.
[15] నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు.
[16] నా మంచంపై రత్న కంబళ్ళు పరిచాను. ఐగుప్తు నుండి తెప్పించిన నైపుణ్యంగా అల్లిన నార దుప్పట్లు వేశాను.
[17] నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.
[18] బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం.
[19] నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు.
[20] అతడు డబ్బు సంచి తనతో తీసుకు వెళ్ళాడు. పున్నమి రోజు వరకూ ఇంటికి తిరిగి రాడు.”
[21] ఆ విధంగా ఆమె తన మృదువైన మాటలు పదే పదే చెబుతూ, లాలిస్తూ అతణ్ణి లోబరచుకుంది. పొగడ్తలతో ముంచెత్తుతూ అతణ్ణి ఈడ్చుకు పోయింది.
[22] వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు.
[23] పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు.
[24] నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి.
[25] నీ మనస్సు వ్యభిచారి నడిచే మార్గాల వైపు మళ్ళనియ్యకు. దారి తప్పి ఆమె నడిచే దారిలోకి పోకు.
[26] ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు.
[27] ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది.