Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:12

[1] తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.

[2] మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.

[3] దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.

[4] మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.

[5] దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.

[6] బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.

[7] మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.

[8] కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.

[9] పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.

[10] యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.

[11] ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.

[12] విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.

[13] సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.

[14] వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?

[15] తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.

[16] ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.

[17] వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.

[18] చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.

[19] పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.

[20] ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.

[21] జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.

[22] భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.

[23] నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.

[24] ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

సామెతలు — Chapters