Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:12

[1] యెరూషలేమును పరిపాలించే రాజు, దావీదు కొడుకూ అయిన ప్రసంగి మాటలు.

[2] పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.

[3] సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం?

[4] ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తూ ఉంది. భూమి మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంది.

[5] సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మళ్ళీ ఉదయించాల్సిన స్థలం చేరడానికి త్వరపడతాడు.

[6] గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలా తన దారిలో మళ్ళీ మళ్ళీ వీస్తూ తిరిగి వస్తున్నది.

[7] నదులన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయి గానీ అది ఎప్పటికీ నిండడం లేదు. నదుల నీరంతా అవి ఎక్కడనుండి పారుతూ వస్తున్నాయో అక్కడికే వెళ్లి తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాయి.

[8] మధ్యలో విశ్రాంతి లేకుండా అన్నీ అలసటతోనే జరిగిపోతున్నాయి. మానవులు దాన్ని వివరించలేరు. చూసే వాటి విషయంలో కంటికి తృప్తి కలగడం లేదు. వినే వాటి విషయంలో చెవికి తృప్తి కలగడం లేదు.

[9] ఇంతవరకూ ఉన్నదే ముందు కూడా ఉంటుంది. ఇంతవరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఇది కొత్తది అని చెప్పదగినది సూర్యుని కింద ఏదీ లేదు.

[10] ఇది కొత్తది అని దేని గురించైనా ఎవరైనా చెప్పినా అది కూడా చాలా కాలం నుండీ ఉన్నదే.

[11] మన పూర్వికులు మన జ్ఞాపకంలో ఉండరు, ఇప్పుడు ఉన్నవారి జ్ఞాపకం తరవాత వచ్చే వారికి కలగదు.

[12] బోధకుణ్ణి అయిన నేను యెరూషలేములో ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాను.

[13] ఆకాశం కింద జరుగుతున్న దాన్ని తెలివిగా వెతికి గ్రహించడంపై నా మనస్సు నిలిపాను. మానవులు నేర్చుకోవడం కోసం దేవుడు వారికి ఏర్పాటు చేసిన పని చాలా కష్టంతో నిండి ఉంది.

[14] సూర్యుని కింద జరుగుతున్న వాటన్నిటినీ నేను చూశాను. ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాస పడినట్టు అవన్నీ ప్రయోజనం లేనివే.

[15] వంకరగా ఉన్నది చక్కబడదు. కనిపించనిది లెక్కలోకి రాదు.

[16] “యెరూషలేములో నాకంటే ముందున్న వారందరి కంటే నేను అధిక జ్ఞానం సంపాదించాను, సంపూర్ణమైన జ్ఞానాన్నీ విద్యనీ నేను నేర్చుకున్నాను” అని నా మనస్సులో అనుకున్నాను.

[17] కాబట్టి జ్ఞానం, వెర్రితనం, బుద్ధిహీనత, వీటిని గ్రహించడానికి కష్టపడ్డాను. కానీ ఇది కూడా ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.

[18] విస్తారమైన జ్ఞానార్జనలో విస్తారమైన దుఃఖం ఉంది. ఎక్కువ తెలివి సంపాదించిన వారికి ఎక్కువ బాధ కలుగుతుంది.

ప్రసంగి — Chapters