[1] కష్టకాలం రాకముందే, “జీవితం అంటే నాకిష్టం లేదు” అని నువ్వు చెప్పే కాలం రాకముందే,
[2] సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో.
[3] ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. బలంగా ఉండేవారు వంగిపోతారు. తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు.
[4] తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. వీధి తలుపులు మూసేస్తారు. పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి.
[5] ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, సహజమైన కోరికలు అంతరిస్తాయి. అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు.
[6] వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.
[7] మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.
[8] ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.”
[9] ఈ ప్రసంగి తెలివైనవాడు. అతడు ప్రజలకు జ్ఞానం బోధించాడు. అతడు బాగా చదివి, సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు.
[10] ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.
[11] తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి బోధించినట్టుగా ఉన్నాయి.
[12] కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది.
[13] ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే.
[14] ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.