[1] పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది.
[2] జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది.
[3] మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు.
[4] యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది.
[5] రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను.
[6] ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం.
[7] సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది.
[8] గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.
[9] రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.
[10] ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది.
[11] పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.
[12] జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.
[13] వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, వెర్రితనంతో ముగుస్తాయి.
[14] ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?
[15] మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు.
[16] ఒక దేశానికి బాలుడు రాజుగా ఉండడం, ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం.
[17] అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం.
[18] సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది.
[19] విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది.
[20] నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.