[1] మీరు బ్రతికి, సంఖ్యలో అధికమై, యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశానికి వెళ్ళి దానిని స్వాధీనం చేసుకొనేలా ఈ వేళ నేను మీకిచ్చే అన్ని ఆజ్ఞలప్రకారం ప్రవర్తించాలి.
[2] మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో చూచేందుకు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎడారిలో ఈ మార్గమంతా ఈ నలభై ఏళ్ళు నడిపిస్తూ వచ్చాడు. మిమ్ములను పరీక్షించడానికి, మీ హృదయాల్లో ఉండేది పరీక్షించి చూడడానికి మిమ్మల్ని అణచివేశాడు. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి.
[3] మిమ్మల్ని అణచి, మీకు ఆకలి రానిచ్చాడు; మీకు గానీ మీ పూర్వీకులకు గానీ, తెలియని మన్నాను ఆహారంగా ప్రసాదించాడు. మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ యెహోవా నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడని మీకు తెలియజేయాలని ఆయన ఉద్దేశం.
[4] ఈ నలభై ఏళ్ళు మీరు వేసుకొన్న బట్టలు పాతబడలేదు. మీ కాళ్ళకు వాపు కలగలేదు.
[5] తండ్రి తన కొడుకును శిక్షించినట్టు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని శిక్షించేవాడని మీరు తెలుసుకోవాలి. ఆ సంగతి మీ హృదయంలో నాటాలి.
[6] మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి, ఆయన విధానాలను అనుసరించి నడుచుకోవడానికి ఆయన ఆజ్ఞలను పాటించాలి.
[7] మీ దేవుడు యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకుపోతాడు. ఆ దేశంలో నీటివాగులు ఉన్నాయి. కొండల్లోనుంచీ, లోయలలోనుంచీ పెల్లుబికే ఊటలూ నీటిబుగ్గలు ఉన్నాయి.
[8] ఆ దేశంలో గోధుమలు, యవలు, ద్రాక్షచెట్లు, అంజూర, దానిమ్మచెట్లు పెరుగుతాయి. ఆలీవ్‌నూనె, తేనె ఉన్న దేశం అది.
[9] కొరత లేకుండా మీరు రొట్టెలు తినగల దేశం. అక్కడ మీకు కొదువ అంటూ ఏమీ ఉండదు. అది ఇనుప రాళ్ళు ఉన్న దేశం. ఆ దేశం కొండలలో మీరు రాగి తవ్వి తీయవచ్చు.
[10] మీరు అక్కడ తృప్తిగా భోజనం చేసి, మీ దేవుడు యెహోవా మీకిచ్చిన ఆ మంచి దేశం కోసం ఆయనను కీర్తిస్తారు.
[11] ఈ రోజు నేను మీకు ఆదేశించే ఆయన ఆజ్ఞలను, న్యాయనిర్ణయాలను, చట్టాలను మీరు అనుసరించాలి. మీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి.
[12] మీరు కడుపునిండా తిని, మంచి ఇండ్లు కట్టి, వాటిలో కాపురమున్నప్పుడు,
[13] మీ పశువులూ, మీ గొర్రె మేకలూ, మీ వెండి బంగారాలూ, మీకు కలిగినదంతా వృద్ధి అయినప్పుడు,
[14] మీరు మిడిసిపడుతారేమో జాగ్రత్త! ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్యగృహంలోనుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో జాగ్రత్త!
[15] విషసర్పాలు, తేళ్ళు ఉన్న భయంకరమైన ఆ గొప్ప ఎడారిలో ఆయన మీకు వెళ్ళవలసిన దారి చూపుతూ ఉన్నాడు. నీళ్ళు లేక ఎండిపోయిన ఆ ప్రదేశంలో, గట్టి బండనుంచి మీకు నీళ్ళు రప్పించాడు.
[16] మీ పూర్వీకులకు తెలియని మన్నాను ఆహారంగా ఆ ఎడారిలో మీకు ప్రసాదించాడు. చివరికి మీకు మేలు చేయాలని ఆయన అలా మిమ్మల్ని అణచివేశాడు, పరీక్షించాడు.
[17] మీరు “మా సొంత బలప్రభావాలవల్ల ఇంత భాగ్యం మాకు లభించింది” అనుకుంటారేమో జాగ్రత్త!
[18] ధనం సంపాదించుకొనే సామర్థ్యాన్ని మీకు కలిగించేవాడు మీ దేవుడు యెహోవాయే. తాను మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన తన ఒడంబడికను ఆ విధంగా సుస్థిరం చేస్తాడు. ఈ రోజు కూడా అలా జరుగుతూ ఉంది. ఆయనను జ్ఞాపకం ఉంచుకోండి.
[19] ఒకవేళ మీరు మీ దేవుడు యెహోవాను మరచి, ఇతర దేవుళ్ళను అనుసరించి, సేవించి, పూజిస్తే మీరు తప్పనిసరిగా నాశనం అవుతారని ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
[20] మీ దేవుడు యెహోవా మాట మీరు వినకపొయ్యారా, మీకు ముందుగా యెహోవా నాశనం చేసిన జనాలలాగే మీరు కూడా నాశనం అవుతారు.