Skip to content
Opens in a new window

[1] మీరు స్వాధీనం చేసుకోవడానికి నది దాటి వెళ్ళే దేశంలో మీరు ఆచరణలో పెట్టవలసిన ఆజ్ఞలు, చట్టాలు, న్యాయ నిర్ణయాలు ఇవి; మీ దేవుడు యెహోవా మీకు వీటిని ఉపదేశించాలని నాకు ఆజ్ఞాపించాడు.

[2] మీరు, మీ కొడుకులు, మీ కొడుకుల సంతానం బ్రతికి ఉన్నంతవరకూ మీ దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి, నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన చట్టాలన్నీ ఆజ్ఞలన్నీ పాటిస్తూ దీర్ఘకాలం బ్రతకాలని ఆయన ఉద్దేశం.

[3] అందుచేత ఇస్రాయేల్ ప్రజలారా! పాలు తేనెలు నదులై పారుతున్న దేశంలో మీరు క్షేమంగా ఉండి, అధికంగా అభివృద్ధి అనుభవించేలా ఈ మాటలు విని విధేయులుగా ఉండండి. మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీతో అలా ప్రమాణం చేశాడు గదా!

[4] ఇస్రాయేల్ ప్రజలారా, వినండి, యెహోవా మన దేవుడు, యెహోవా మాత్రమే.

[5] హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, శక్తి అంతటితో మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ ఉండాలి.

[6] ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి.

[7] వాటిని మీ సంతానానికి నేర్పాలి. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు, దారి వెంబడి నడుస్తూ ఉన్నప్పుడూ, పడుకొనేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి.

[8] సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. అవి మీ నొసట జ్ఞాపకార్థమైన వ్రాతలాగా ఉండాలి.

[9] మీ ఇంటి ద్వారబంధాలమీద, మీ తలుపులమీద వాటిని వ్రాయాలి.

[10] మీకిస్తానని మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశపెడతాడు. మీరు కట్టని శ్రేష్ఠమైన అందమైన పట్టణాలనూ,

[11] మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇండ్లనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్ష తోటలనూ ఆలీవ్ చెట్ల తోటలనూ ఆయన మీకిస్తాడు. మీరు తిని తృప్తిగా ఉంటారు.

[12] అప్పుడు ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహంలోనుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి.

[13] మీ దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. ఆయన పేర ప్రమాణం చేయాలి.

[14] మీ చుట్టూరా ఉండే జనాల దేవుళ్ళలో ఏ దేవుణ్ణీ మీరు అనుసరించి సేవించకూడదు.

[15] మీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన రోషం గల దేవుడు. మీరు ఇతర దేవుళ్ళను అనుసరించి సేవిస్తే మీ దేవుడు యెహోవా కోపాగ్ని మీమీద రగులుకొని దేశంలో లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తుంది, జాగ్రత్త!

[16] మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్టు ఆయనను పరీక్షించకూడదు.

[17] మీ దేవుడు యెహోవా మీకు నియమించిన ఆజ్ఞలనూ, శాసనాలనూ, చట్టాలనూ జాగ్రత్తగా ఆచరించాలి.

[18] యెహోవా దృష్టిలో ఏది న్యాయమో, ఏది మంచిదో అదే చేయాలి. దాని ఫలితంగా మీరు క్షేమంగా ఉండి, యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకొంటారు.

[19] యెహోవా చెప్పినట్టు మీ శత్రువులందరినీ మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టివేస్తారు.

[20] రాబోయే కాలంలో మీ కొడుకులు “మన దేవుడు యెహోవా మీకు ఈ శాసనాల్ని, చట్టాల్ని, న్యాయనిర్ణయాల్ని నియమించాడు. వాటి భావమేమిటి?” అని మిమ్మల్ని అడిగితే, మీ కొడుకులతో ఇలా అనాలి:

[21] “మేము ఈజిప్ట్‌లో చక్రవర్తి దాసులం. గానీ తన బలిష్ఠమైన చేతితో యెహోవా మమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చాడు.

[22] అంతేగాక, యెహోవా ఈజిప్ట్‌మీదా, చక్రవర్తిమీదా, అతడి ఇంటివారందరిమీదా బాధకరమైన గొప్ప అద్భుతాలనూ, సూచనలనూ కనుపరచాడు. మా కళ్ళెదుటే వాటిని జరిగించాడు.

[23] తాను మన పూర్వీకులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో ప్రవేశపెట్టి దీనిని మనకివ్వడానికి యెహోవా మమ్మల్ని అక్కడనుంచి తీసుకువచ్చాడు.

[24] మనం మన దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఈ శాసనాలు శిరసావహించాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. మనం బ్రతికి ఉండాలనీ బ్రతికి ఉన్నంతవరకూ క్షేమంగా ఉండాలనీ ఆయన ఉద్దేశం.

[25] మన దేవుడు యెహోవా మనకాజ్ఞాపించినట్టే ఆయన సన్నిధానంలో ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, అది మనకు నిర్దోషత్వంగా ఉంటుంది.”

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters