[1] ఆకాశాల్లారా! నేను చెప్పేది వినండి! భూగోళమా! నానోటి మాటలు ఆలకించు!
[2] నా ఉపదేశం వానలాగా కురుస్తుంది. నా వాక్కులు మంచు బొట్లలాగా లేత గడ్డిమీద పడే చినుకులలాగా మొక్కలమీద కురిసే జల్లులాగా ఉంటాయి.
[3] నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మీరు మన దేవునికి మహత్తును ఆరోపించండి.
[4] ఆయన ఆధారశిలగా ఉన్నాడు. ఆయన చేసేది లోపం లేనిది. ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు, పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
[5] వారైతే చెడిపోయినవారు; ఆయన పిల్లలు కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం వారు.
[6] బుద్ధీ భక్తీ లేనివారలారా! తెలివితక్కువ ప్రజలారా! ఈ విధంగా యెహోవాకు ప్రతిక్రియ చేస్తారా? ఆయన మిమ్మల్ని సంపాదించుకొన్న తండ్రి కాడా? ఆయన మిమ్మల్ని సృజించి, స్థాపించలేదా?
[7] గతించిన రోజులు జ్ఞప్తికి తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల గురించి తలపోయండి. మీ తండ్రిని అడగండి, అతడు మీకు తెలుపుతాడు. మీ పెద్దలను అడగండి, వారు మీతో చెపుతారు.
[8] సర్వాతీతుడు జనాలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరుపరచినప్పుడు ఇస్రాయేల్ ప్రజల సంఖ్య ప్రకారం జనాలకు సరిహద్దులు నిర్ణయించాడు.
[9] యెహోవా వంతు ఆయన జనమే. ఆయనకు వచ్చే వారసత్వం యాకోబు ప్రజలే.
[10] ఆయన ఈ జనాన్ని ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీకరమైన శబ్దాలు ఉన్న, ఎండిపోయిన ప్రాంతాలలో ఆ జనం దొరికింది. ఆ జనాన్ని ఆవరించి పోషించాడు, తన కనుపాపలాగా కాపాడాడు.
[11] గరుడపక్షి తన గూడు రేపి, తన పిల్లలపైన ఎగురుతూ, రెక్కలు చాపుకొని ఆ పిల్లలను తీసుకుని రెక్కలమీద మోసేలాగా యెహోవా చేశాడు.
[12] యెహోవా ఒక్కడే ఆ జనానికి దారిచూపుతూ ఉన్నాడు. అన్యుల దేవుళ్ళలో ఏ దేవుడూ ఆయనతోకూడా లేకపోయాడు.
[13] లోకంలో ఎత్తయిన స్థలాలమీద ఆ జనాన్ని ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండ బండనుంచి తేనెతో, చెకుముకి రాతి నేల నుంచి నూనెతో వారిని తృప్తిపరచాడు.
[14] ఆవు మజ్జిగనూ, గొర్రెమేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్ళనూ, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోధుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్ష రసాయనం మీరు తాగారు.
[15] యెషూరూన్ కొవ్వినవాడై కాలు తన్నాడు, (అవును, మీరు కొవ్వి మొద్దయి బలిశారు) యెషూరూన్ తనను పుట్టించిన దేవుణ్ణి విడిచాడు. తన రక్షణను, ఆధారశిలను తృణీకరించాడు.
[16] వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం రేపారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకొని ఆయనకు కోపం రెచ్చగొట్టారు.
[17] దేవత్వం లేని దయ్యాలకు వారు బలులు అర్పించారు. తమకు తెలియని దేవతలకూ కొత్తగా కల్పించిన దేవుళ్ళకూ మీ పూర్వీకులు భయపడని వేల్పులకూ మ్రొక్కారు.
[18] మిమ్మల్ని పుట్టించిన ఆధారశిలలాంటివాణ్ణి మీరు నిర్లక్ష్యం చేశారు. మిమ్మల్ని కన్న దేవుణ్ణి మరచిపోయారు.
[19] యెహోవా అది చూశాడు, వారిని నిరాకరించాడు. తన కొడుకులవల్ల కూతుళ్ళవల్ల తనకు కలిగిన కోపం కారణంగా వారిని నిరాకరించాడు.
[20] ఆయన అన్నాడు: “వారి నుంచి నా ముఖం అటువైపు త్రిప్పుతాను. వారి చివరి స్థితి ఏమవుతుందో చూస్తాను. వారు మొండి ప్రజలు, విశ్వసనీయత లేని పిల్లలు.
[21] వారు దేవత్వం లేని దేవుళ్ళవల్ల నాకు కోపం రేపారు. గనుక ప్రజ కానివారివల్ల వారికి రోషం పుట్టిస్తాను. బుద్ధీ భక్తీలేని జనం వల్ల వారికి కోపం రేపుతాను.
[22] నా కోపాగ్ని రగులుకొని ఉంది. మృత్యులోకం లోతైన స్థలాలవరకు అది మండుతుంది. అది భూమిని, దాని పంటను కాల్చివేస్తుంది, పర్వతాల పునాదులను రగులబెడుతుంది.
[23] వారిమీదికి ఆపదల సమూహాన్ని తెప్పిస్తాను. వారిమీద నా బాణాలు వేస్తాను.
[24] వారు కరవు చేత క్షీణించిపోతారు. తీవ్రమైన జ్వరంచేత, కఠిన రోగాలచేత క్షీణించిపోతారు. దుమ్ములో ప్రాకేవాటి విషాన్ని, మృగాల కోరలను వారిమీదికి రప్పిస్తాను.
[25] బయట ఖడ్గం చంపుతుంది. లోపల భయం పీడిస్తుంది. యువకులూ కన్యలూ శిశువులూ నెరసిన వెండ్రుకలు గలవారూ నాశనం అవుతారు.
[26] వారిని తుత్తునియలుగా చేస్తాననీ వారిని గురించిన జ్ఞాపకం కూడా మనుషులలో లేకుండా చేస్తాననీ అనుకొని ఉండేవాణ్ణి,
[27] గానీ ఎందుకు అలా చేయలేదంటే వారి శత్రువులు రెచ్చిపోతారేమో, ఆ శత్రువులు అపార్థం చేసుకొని ‘పైచేయి మనదే! ఇదంతా చేసినది యెహోవా కాదు’ అంటారేమో అని.”
[28] ఈ ప్రజకు ఆలోచన బొత్తిగా లేదు. వారిలో తెలివి ఏమీ లేదు.
[29] వారు జ్ఞానం తెచ్చుకొని, ఈ మాటలు గ్రహిస్తే, వారి చివరి స్థితిని తలపోస్తే ఎంత బావుండు!
[30] వారి ఆధారశిల వారిని తమ శత్రువుల వశం చేశాడు. యెహోవా వారిని వాళ్ళకప్పగించాడు. లేకపోతే ఒక్కడు వేయిమందిని ఎలా తరుముతాడు? ఇద్దరు పదివేల మందిని పారదోలడం ఎలాగా?
[31] వాళ్ళ ఆధారశిల మన ఆధారశిల వంటివాడు కాడు గదా. ఈ సంగతి మన శత్రువులే వివేచించగలరు.
[32] “వాళ్ళ ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాలలో పుట్టింది. వాళ్ళ ద్రాక్షపండ్లు విషం. వాళ్ళ గెలలు చేదు.
[33] వాళ్ళ ద్రాక్షరసం సర్పాల విషం. అది నాగుపాముల క్రూర విషం.
[34] వాళ్ళ క్రియల లెక్క నా దగ్గర ఉంది గదా. అది నా ఖజానాలలో మూసివేయబడి ఉంది.
[35] పగ తీర్చే పని నాదే. నేనే ప్రతిక్రియ చేస్తాను. వాళ్ళ కాలు జారిపోయే సమయం వస్తుంది. వాళ్ళ ఆపద్దినం ఆసన్నమైంది. వాళ్ళ గతి త్వరలో వాళ్ళకు దాపురిస్తుంది.”
[36] తన ప్రజ బలం ఉడిగిపోవడం, చెరలో ఉన్నవారూ దిక్కులేనివారూ తప్ప మరెవ్వరూ లేకపోవడం యెహోవా చూచినప్పుడు ఆయనకు తన సేవకుల మీద జాలి వేస్తుంది. ఆయన తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు.
[37] ఆయన ఇలా అంటాడు: “వాళ్ళ దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నమ్ముకొన్న ఆధారశిల ఏమయింది?
[38] వాళ్ళ బలుల క్రొవ్వును తిని, వాళ్ళు పానార్పణగా తెచ్చే ద్రాక్షరసం త్రాగిన దేవుళ్ళు ఏమయ్యారు? అలాంటి దేవుళ్ళు లేచి మీకు సాయం చేయగలరా? మీకు ఆశ్రయం ఇవ్వగలరా?
[39] ఇదిగో, వినండి. నేను, నేను మాత్రమే దేవుణ్ణి. మరో దేవుడు లేనే లేడు. మరణానికి గురి చేసే వాణ్ణి నేనే, బ్రతికించేవాణ్ణి నేనే. గాయపరచేవాణ్ణి, బాగుచేసేవాణ్ణి నేనే. నా చేతిలో నుంచి విడిపించగలవాడు ఎవ్వడూ ఉండడు.
[40] నిగనిగలాడే నా ఖడ్గం నూరి, న్యాయం జరిగించడానికి నా చెయ్యి చాపినప్పుడు నా పగవారికి ప్రతిక్రియ చేస్తాననీ, నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాననీ,
[41] ఆకాశంవైపు నా చెయ్యి ఎత్తి, నా శాశ్వత జీవంతోడని శపథం చేస్తున్నాను.
[42] రక్తంచేత నా బాణాలు మత్తిల్లేలా చేస్తాను! హతమైన వారి రక్తం, బందీల రక్తం శత్రువులలో నాయకుల తలలతోపాటు నా ఖడ్గం మాంసం తినివేస్తుంది!
[43] ఇతర జనాల్లారా! ఆయన ప్రజతో కూడా సంతోషించండి! వధ అయిన తన సేవకుల రక్తం విషయం ఆయన ప్రతిక్రియ చేస్తాడు. తన పగవారికి ప్రతీకారం చేస్తాడు. తన దేశం, తన ప్రజల పాపాలను కప్పివేస్తాడు.
[44] మోషే, నూను కొడుకైన యెహోషువ ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించారు.
[45] మోషే ఈ మాటలన్నీ ఇస్రాయేల్ ప్రజలందరితో చెప్పడం ముగించాక అతడు వారితో ఇంకా అన్నాడు,
[46] “ఈ రోజు నేను మిమ్మల్ని హెచ్చరించే ఈ మాటలన్నీ మనసులో ఉంచుకోవాలి; మీ సంతానం ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ పాటించి, వాటిప్రకారం ప్రవర్తించాలని వారికాజ్ఞాపించాలి.
[47] ఈ ఉపదేశం వట్టిది కాదు. ఇది మీకు జీవమే. మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటిపోయే దేశంలో దీనివల్లే చాలా కాలం నివసిస్తారు.
[48] ఆ రోజే యెహోవా మోషేతో అన్నాడు,
[49] “యెరికో ఎదుట, మోయాబు దేశంలో ఉన్న ఈ అబారీం పర్వతపంక్తి, నెబోపర్వత శిఖరమెక్కు, నేను ఇస్రాయేల్ ప్రజలకు స్వదేశంగా ఇచ్చే కనాను దేశాన్ని అక్కడనుంచి చూడు.
[50] నీ అన్న అహరోను హోర్ పర్వతంమీద చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరినట్టు నీవు కూడా ఎక్కబోయే పర్వతంమీద చనిపోయి నీ ప్రజలదగ్గరికి చేరుతావు.
[51] ఎందుకంటే, మీరిద్దరూ సీన్ ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ళదగ్గర ఇస్రాయేల్ ప్రజల మధ్య విశ్వసనీయులుగా లేరు; ఇస్రాయేల్ ప్రజల మధ్య నా పవిత్రతను ఘనపరచలేదు.
[52] దూరంగా ఉండి ఆ దేశాన్ని చూస్తావు గాని, నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే ఆ దేశంలో అడుగు పెట్టవు.”