[1] దేవుని మనిషి మోషే చనిపోయేముందు ఇస్రాయేల్ ప్రజలను గురించి ఆశీర్వచనాలు పలికాడు. ఆ ఆశీర్వచనాలు ఇవే.
[2] “యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు. శేయీర్‌కొండ నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు. వేలాది వేల పవిత్ర సమూహాల మధ్య నుంచి ఆయన వచ్చాడు. ఆయన కుడిప్రక్కన మంటలు మండుతున్నాయి.
[3] ఈ ప్రజలంటే నీకు ప్రేమ – అందులో అనుమానం లేదు. పవిత్రులందరూ నీ చేతిలో ఉన్నారు. వారంతా నీ పాదాల దగ్గర కూర్చుని నీ ఉపదేశం పొందుతారు.
[4] మోషే మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది యాకోబు సమాజంవారి పిత్రార్జితం.
[5] ప్రజల నాయకులూ, ఇస్రాయేల్ గోత్రాలూ సమకూడినప్పుడు యెషూరూన్ జనం మధ్య యెహోవా రాజుగా ఉన్నాడు.
[6] “రూబేను గోత్రికులు తక్కువ కావడంవల్ల ఆ గోత్రం అంతరించి పోకుండా, జీవిస్తుంది గాక.”
[7] యూదా విషయం ఇలా పలికాడు: “యెహోవా! యూదా గోత్రికుల మనవి విని, వారిని వారి ప్రజల దగ్గరికి చేర్చు. ఆ గోత్రానికి గొప్ప యుద్ధ బలాన్ని ప్రసాదించు. వారి పగవారికి విరోధంగా నీవు వారికి సహాయం చేస్తావు గాక.”
[8] లేవీ విషయం ఇలా అన్నాడు: “నీ తుమ్మీం, ఊరీం నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నీవు ఆ గోత్రాన్ని పరీక్షించావు.
[9] వారు తమ తల్లిదండ్రులను గురించి వారిని ఎరగనన్నారు. తమ సొంత ప్రజలను లక్ష్యపెట్టలేదు, తమ సంతానంతో సంబంధం ఎంచలేదు. వారు నీ మాట ప్రకారం ప్రవర్తించారు, నీ ఒడంబడికను పాటించారు.
[10] వారు యాకోబు ప్రజలకు నీ న్యాయ నిర్ణయాలను, ఇస్రాయేల్ జనానికి నీ ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు. నీ సన్నిధానంలో ధూపం వేస్తారు, నీ బలిపీఠం మీద హోమ బలులు అర్పిస్తారు.
[11] యెహోవా! వారి బలసామర్థ్యాలను దీవించు. వారి కార్యకలాపాలను స్వీకరించు. వారిపైబడేవాళ్ళూ, వారిని ద్వేషించేవాళ్ళూ లేవకుండా వాళ్ళ నడుములు విరగగొట్టు.”
[12] బెన్యామీను విషయం ఇలా అన్నాడు: “యెహోవాకు ప్రియమైనవారు ఆయన దగ్గర సురక్షితంగా నివసిస్తారు. ఎప్పుడూ ఆయన వారికి అండగా ఉంటాడు, ఆయన వారిమధ్య నివాసం చేస్తాడు.”
[13] యోసేపు విషయం ఇలా అన్నాడు: “యెహోవా వారి భూభాగాన్ని దీవిస్తాడు గాక! ఆకాశంనుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచువల్ల, కింద ఉన్న జలాగాధంవల్ల,
[14] ఎండచేత కలిగే శ్రేష్ఠ ఫలాల వల్ల, నెల నెల పండే మేలిరకమైన పంటల వల్ల,
[15] పురాతన పర్వతాల శిఖరాల వాటివల్ల, ఎల్లకాలం ఉండే కొండల మేలైనవాటివల్ల,
[16] భూమి ప్రశస్తమైన వాటివల్ల, దాని సమృద్ధివల్ల, యెహోవా ఈ గోత్రాన్ని దీవిస్తాడు గాక! పొదలో ఉన్నవాని దయ యోసేపు మీద ఉంటుంది గాక! తన అన్నదమ్ములలో ప్రఖ్యాతి చెందినవాని గోత్రం మీద అది ఉంటుంది గాక!
[17] మొదట పుట్టిన వృషభంలాగా ఈ గోత్రం ఘనత వహించింది. దాని కొమ్ములు గురుపోతు కొమ్ముల్లాంటివి. ఆ కొమ్ములతో జనాలను – భూమి కొనలలో ఉండే జనాలను కూడా అది పొడుస్తుంది. ఎఫ్రాయింకు చెందిన వేలాది వేలమంది, మనష్షేకు చెందిన వేలమంది అలాగే అంటారు.”
[18] జెబూలూను విషయం ఇలా అన్నాడు: “జెబూలూనూ! నీవు బయలుదేరేటప్పుడు సంతోషించు! ఇశ్శాకారు! నీ గుడారాలలో సంతోషించు!
[19] వారు జనాలను తమ పర్వతానికి పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధిని, ఇసుకలో గుప్తమైన నిధులను బయటికి తీస్తారు.”
[20] గాదు విషయం ఇలా అన్నాడు: “గాదు ప్రాంతాన్ని విశాలపరచినవానికి స్తుతి కలుగుతుంది గాక! ఈ గోత్రం ఆడు సింహంలాగా పొంచివుంటుంది. హస్తాన్ని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
[21] అది తనకోసం మొదటి భాగం చూచుకొంది. అక్కడ నాయకుడి భాగం దానికోసం ప్రత్యేకించి ఉంచబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు యెహోవా తీర్చిన న్యాయాన్ని జరిగించినది ఆ గోత్రం. ఇస్రాయేల్ ప్రజల విషయం యెహోవా న్యాయ నిర్ణయాల ప్రకారం చేసింది.”
[22] దాను విషయం ఇలా అన్నాడు: “దాను సింహం పిల్లలాంటిది. అది బాషానునుంచి దూకుతుంది.”
[23] నఫ్తాలి విషయం ఇలా అన్నాడు: “అనుగ్రహం చేత సంతుష్టి చెందిన నఫ్తాలీ! యెహోవా ఆశీస్సులచేత నిండిపోయిన నఫ్తాలీ! సరస్సునూ దక్షిణ భూభాగాన్నీ స్వాధీనం చేసుకో!”
[24] ఆషేరు విషయం ఇలా అన్నాడు: “ఆషేరు పొందిన ఆశీస్సులు కొడుకులకంటే ఉత్తమం. సాటి గోత్రాలు దాన్ని మెచ్చుకుంటాయి గాక! దాని పాదాలు నూనెలో ముంచుకొంటుంది.
[25] నీ కమ్ములు ఇనుపవి, కంచువి. నీవు బ్రతికినన్నాళ్ళు నీకు బలం ఉంటుంది గాక!
[26] “యెషూరూన్ యొక్క దేవుణ్ణి పోలిన వాడెవ్వడూ లేడు. నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా వస్తాడు! తన తేజస్సుతో మేఘవాహనుడై వస్తాడు!
[27] శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఎప్పటికీ ఉండే హస్తాలు నీక్రింద ఉంటాయి. ఆయన నీ ఎదుటనుంచి శత్రువులను పారదోలి, ‘నాశనం చెయ్యి!’ అంటాడు.”
[28] “ఇస్రాయేల్ ప్రజలు నిర్భయంగా కాపురముంటున్నారు. యాకోబు యొక్క ఊట ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రజలు ధాన్య ద్రాక్షరసాలు ఉన్న దేశంలో ఉంటారు. అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.
[29] ఇస్రాయేల్ ప్రజలారా! ఎంత ధన్యులు మీరు! యెహోవా రక్షించిన ప్రజలు మీరు! మిమ్మల్ని పోలిన వారెవ్వరు? ఆయన మిమ్మల్ని కాపాడే డాలులాంటివాడు. ఆయన మీకు ఘనమైన ఖడ్గంవంటివాడు. మీ శత్రువులు మీ ఎదుట ముడుచుకుపోతారు. మీరు వాళ్ళ ఎత్తయిన స్థలాలను తొక్కుతారు.”