Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలారా! నేను మీకు ఉపదేశించే చట్టాలనూ, న్యాయనిర్ణయాలనూ అనుసరించి మెలగండి. అప్పుడు మీరు బ్రతికి, మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొంటారు.

[2] మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలే మీకిస్తున్నాను. మీరు వాటిని పాటించాలి. నేను ఆజ్ఞాపించే మాటలకు ఏ మాటా కలపకూడదు. వాటిలోనుంచి ఏదీ తీసివేయకూడదు.

[3] బేల్‌పెయోరు విషయంలో యెహోవా చేసినది మీరు కన్నులారా చూశారు గదా. బేల్ పెయోరు దేవుణ్ణి అనుసరించిన వారందరినీ మీ మధ్య లేకుండా మీ దేవుడు యెహోవా నాశనం చేశాడు.

[4] అయితే మీ దేవుడు యెహోవాను విడవకుండా ఉన్న మీరందరూ ఈవేళ బతికి ఉన్నారు.

[5] నా దేవుడు యెహోవా నా కాజ్ఞాపించినట్టే చట్టాలనూ న్యాయనిర్ణయాలనూ మీకు ఉపదేశించాను. మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీరు వాటి ప్రకారం ప్రవర్తించాలి.

[6] వాటిని పాటించి ఆచరణలో పెట్టుకోవాలి. ఈ శాసనాలన్నిటిని గురించి వినే జనాలు “ఈ గొప్ప ప్రజ జ్ఞాన వివేకాలు గల జనం. అనుమానం లేదు” అంటారు. ఈ శాసనాలను పాటించడం వారి దృష్టిలో మీకు జ్ఞానం, వివేకం.

[7] మన దేవుడైన యెహోవాకు మొర పెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఈ విధంగా మరి ఏ గొప్ప జనానికీ ఏ దేవుడూ సమీపంగా లేడు గదా.

[8] ఈ వేళ నేను మీకు నేర్పే ఈ సమస్త ఉపదేశంలాంటి నీతిగల చట్టాలూ న్యాయనిర్ణయాలూ ఏ గొప్ప జనానికి ఉన్నాయి?

[9] అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కన్నులారా చూచినవాటిని మరవకుండా, బ్రతికి ఉన్నంతవరకూ అవి మీ హృదయంలోనుంచి తొలగిపోకుండా మీ మనస్సును పదిలంగా కాపాడుతూ ఉండాలి. మీరు చూచినవాటిని మీ కొడుకులకు, మీ కొడుకుల కొడుకులకు తెలియజేయాలి.

[10] మీరు హోరేబు పర్వతం దగ్గర మీ దేవుడు యెహోవా సన్నిధానంలో నిలబడ్డ రోజును గురించి వారికి తెలియజేయాలి. ఆ రోజు యెహోవా నాతో, “నా దగ్గరికి ప్రజలను సమకూర్చు. వారు భూలోకంలో బ్రతికే రోజులన్నీ నాపట్ల భయభక్తులతో ప్రవర్తించడానికి నేర్చుకోవాలి, వారి సంతానానికి నేర్పాలి; గనుక వారికి నా మాటలు వినిపిస్తాను” అన్నాడు.

[11] అప్పుడు మీరు దగ్గరికి వచ్చి ఆ పర్వతం దిగువను నిలిచారు. ఆ పర్వతం మండుతూ ఉంది, మంటలు ఆకాశంవరకు లేచాయి. దానిని చీకటి, మబ్బు, దట్టమైన పొగ మంచు కమ్మాయి.

[12] ఆ మంటల మధ్యలో నుంచి యెహోవా మీతో మాట్లాడాడు. మాట్లాడే స్వరం మీరు విన్నారు గాని ఏ ఆకారాన్నీ చూడలేదు. స్వరం వినిపించింది అంతే.

[13] అప్పుడు పది ఆజ్ఞలు అనే తన ఒడంబడిక యెహోవా మీకు తెలియజేశాడు. వాటి ప్రకారం మీరు ప్రవర్తించాలని ఆజ్ఞాపించాడు. రెండు రాతి పలకలమీద వాటిని రాశాడు.

[14] మీరు నది దాటి స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో ఆచరణలో పెట్టవలసిన చట్టాలు, న్యాయ నిర్ణయాలు మీకు ఉపదేశించాలని యెహోవా నాకాజ్ఞ ఇచ్చాడు.

[15] హోరేబులో మంటల మధ్యనుంచి యెహోవా మీతో మాట్లాడిన రోజు మీరు ఏ రూపాన్నీ చూడలేదు గనుక మీరు భ్రష్టులు కాకుండా మీ కోసం ఏ విగ్రహాన్నీ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి.

[16] మీరు ఏ ఆకారం గల విగ్రహాన్నీ, ఏ మగవాడి, ఏ ఆడదాని విగ్రహాన్నీ చేయకూడదు;

[17] భూమిమీద ఉన్న ఏ జంతువు విగ్రహాన్నీ, గాలిలో ఎగిరే ఏ పక్షి విగ్రహాన్నీ,

[18] నేలమీద ప్రాకే ఏ ప్రాణి విగ్రహాన్నీ, భూమికింద నీళ్ళలో ఉన్న ఏ చేప విగ్రహాన్నీ చేయకూడదు, జాగ్రత్త!

[19] అంతేగాక, ఆకాశంవైపు తలెత్తి, ఆకాశ సమూహం – సూర్య చంద్ర నక్షత్రాలను – చూచి, వాటిని పూజించడానికీ సేవించడానికీ దుష్టప్రేరేపణకు లొంగకుండా జాగ్రత్త! అవి మీ దేవుడు యెహోవా ఆకాశమంతటి కింద ఉన్న అన్ని జనాలకు ఇచ్చినవి గదా.

[20] మీరైతే తనకు స్వకీయ జనంగా ఉండాలని యెహోవా మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి – ఆ ఇనుప కొలిమిలో నుంచి – తీసుకువచ్చాడు. ఈ రోజు మీరు ఆయన స్వజనులే గదా.

[21] యెహోవా మీ మేలు కోరి నామీద కోపంగా ఉండి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ, మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే ఈ మంచి దేశంలో ప్రవేశించకూడదనీ శపథం చేశాడు.

[22] నేను యొర్దాను దాటను. ఈ దేశంలోనే చనిపోతాను. మీరైతే దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు.

[23] మీ దేవుడు యెహోవా మీతో చేసిన ఒడంబడికను మరవకూడదు, జాగ్రత్త!

[24] ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే మంటల్లాంటివాడు, రోషంగల దేవుడు.

[25] మీకు సంతానం కలిగి, ఆ సంతానానికి కూడా సంతానం కలిగి ఆ దేశంలో చాలా కాలం కాపురం ఉన్న తరువాత మీ జీవిత విధానాన్ని పాడు చేసుకొంటే ఏదైనా ఆకారంగల విగ్రహాన్ని చేస్తే, మీ దేవుడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం రేపితే

[26] మీరు ఆ దేశంలో ఉండకుండా త్వరలో అంతు లేకుండాపోతారు. భూమినీ ఆకాశాన్నీ మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను; మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబొయ్యే ఆ దేశంలో ఎక్కువ రోజులు ఉండక పూర్తిగా నాశనమవుతారు.

[27] యెహోవా మిమ్మల్ని వేరు వేరు ప్రజలమధ్యకు చెదరగొట్టివేస్తాడు. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తొలగిస్తాడో అక్కడి జనాలలో మీరు కొద్దిమందే మిగిలి ఉంటారు.

[28] అక్కడ కర్రతో, రాతితో మనుషులు తయారు చేసిన దేవుళ్ళను మీరు కొలుస్తారు. అవి చూడలేవు, వినలేవు, వాసన చూడలేవు.

[29] అక్కడ ఉండి, మీరు మీ దేవుడు యెహోవాను వెదుకుతారు. హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో వెదికితే మీరు ఆయనను కనుగొంటారు.

[30] చివరి రోజుల్లో ఇవన్నీ మీకు సంభవించాక బాధలో మీరు మీ దేవుడు యెహోవావైపు తిరిగి, ఆయన మాట వింటారు.

[31] మీ దేవుడు యెహోవా జాలిగల దేవుడు. మిమ్మల్ని చెయ్యి విడువడు; మిమ్మల్ని నాశనం చెయ్యడు; ఆయన మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ఒడంబడికను మరచిపోడు.

[32] దేవుడు భూమిమీద మానవుణ్ణి సృజించిన రోజు మొదలుకొని, మీకు పూర్వం ఉన్న కాలమంతటిని గురించీ పరిశీలించండి. ఆకాశంలో ఆ దిక్కునుంచి ఈ దిక్కువరకు వెదకండి. ఇంత గొప్ప క్రియ మరొకటి ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి వార్త ఎక్కడైనా వినిపించిందా?

[33] దేవుని స్వరం మంటల మధ్య నుంచి మాట్లాడడం మీరు విన్నట్లు మరే జనమైనా విని బతికిందా?

[34] మీ దేవుడు యెహోవా మీ కళ్ళెదుటే విషమ పరీక్షలతో, అద్భుతమైన సూచనలతో, మహాక్రియలతో, యుద్ధంతో, బలిష్ఠమైన హస్తంతో, చాచిన చేతితో, మహా భయంకరమైన చర్యలతో మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి రప్పించాడు గదా. ఆ విధంగా మరే దేవుడైనా ఒక జనాన్ని మరో జనంలోనుంచి రప్పించడానికి ప్రయత్నం చేశాడా?

[35] యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరో దేవుడు లేడనీ మీరు తెలుసుకొనేలా అవన్నీ మీకు చూపించాడు.

[36] మీకు మీ శిక్షణకోసం ఉపదేశించడానికి ఆయన ఆకాశంలోనుంచి తన స్వరం వినిపించాడు. భూమిమీద తన గొప్ప మంటలు మీకు చూపించాడు. ఆ మంటల మధ్యనుంచి వినిపించిన ఆయన వాక్కులు మీరు విన్నారు.

[37] ఆయన మీ పూర్వీకులను ప్రేమించాడు, వారి తరువాత వారి సంతానాన్ని ఎన్నుకొన్నాడు. మీకు తోడుగా ఉండి, తన మహాబలం చేత మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు.

[38] మీకంటే బలమైన గొప్ప జనాలను మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టి వారి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టి, దాన్ని మీకు వారసత్వంగా ఇవ్వడానికి ఆయన ఉద్దేశించాడు. ఈ రోజు అలా జరుగుతూ ఉంది కూడా.

[39] అందుచేత పైన ఉన్న ఆకాశంలో గానీ, కింద ఉన్న భూమిమీద గానీ, యెహోవాయే దేవుడనీ మరో దేవుడు లేడనీ ఈరోజు తెలుసుకోండి. మీ హృదయాలలో ఈ సంగతి నాటనివ్వండి.

[40] ఈ రోజు నేను మీకిచ్చే ఆయన ఆజ్ఞలనూ శాసనాలనూ మీరు పాటించండి. అప్పుడు మీకూ, మీ తరువాత మీ సంతానానికీ క్షేమం కలుగుతుంది, మీ దేవుడు యెహోవా ఎల్లకాలం ఇచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు.

[41] అప్పుడు మోషే యొర్దాను తూర్పు దిక్కున ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకించాడు.

[42] ఎవరైనా పగ పట్టకుండా, బుద్ధిపూర్వకంగా కాకుండా ఒక మనిషిని చంపితే ఆ వ్యక్తి ఆ పట్టణాలలో ఒక దానికి పారిపోయేలా, పారిపోయి అందులో బ్రతికేలా మోషే వాటిని ప్రత్యేకించాడు.

[43] ఆ పట్టణాలు బేసెరు, రామోతు, గోలాను. బేసెరు రూబేనుగోత్రికులకు అరణ్యంలో ఉన్న ఎత్తైన మైదానాల ప్రాంతంలో ఉంది; రామోతు గాదుగోత్రికులకు గిలాదులో ఉంది; గోలాను మనష్షేగోత్రికులకు బాషానులో ఉంది.

[44] మోషే ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన ఉపదేశం ఇది.

[45] ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌నుంచి వచ్చిన తరువాత, యొర్దాను తూర్పున బేత్‌పెయోరు ఎదుటి లోయలో, హెష్బోనులో ఉండే అమోరీవాళ్ళ రాజు సీహోను దేశంలో ఉన్నప్పుడు, మోషే వారికి ఇచ్చిన విధులూ, చట్టాలూ న్యాయ నిర్ణయాలూ ఇవి.

[46] మోషే, ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌నుంచి వచ్చి ఆ సీహోన్ను హతం చేశారు;

[47] అతడి దేశాన్ని, బాషాను రాజు ఓగు దేశాన్ని కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఇద్దరు రాజులు యొర్దాను అవతల, తూర్పుదిక్కున ఉన్న అమోరీవాళ్ళ రాజులు.

[48] ఇస్రాయేల్‌ప్రజలు స్వాధీనం చేసుకొన్న ప్రాంతం అర్నోను లోయ అంచున ఉన్న అరోయేర్‌నుంచి సీయోను పర్వతం అనే హెర్మోను వరకు,

[49] యొర్దాను అవతల తూర్పున ఉన్న అరాబా లోయ అంతా పిస్గా పర్వతం చరియల దిగువగా అరాబా సరస్సు వరకు ఉంది.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters