[1] యెహోవా హోరేబులో ఇస్రాయేల్ ప్రజలతో చేసిన ఒడంబడిక గాక, ఆయన మోయాబుదేశంలో వారితో చేయాలని మోషేకాజ్ఞాపించిన ఒడంబడిక వాక్కులు ఇవే.
[2] మోషే ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు: యెహోవా ఈజిప్ట్‌దేశంలో మీ కళ్ళెదుటే ఫరోకూ అతని పరివారానికీ అతడి దేశమంతటికీ చేసినదంతా మీరు చూశారు.
[3] ఆ గొప్ప విషమ పరీక్షలూ, అద్భుతమైన సూచనలూ, మహాక్రియలు మీకు కనిపించాయి.
[4] అయినప్పటికీ గ్రహించే మనస్సును, చూచే కండ్లను వినే చెవులను యెహోవా నేటివరకూ మీకివ్వలేదు.
[5] “నేను మీ దేవుడు యెహోవానని మీరు తెలుసుకోవాలని నలభై సంవత్సరాలు ఎడారిలో వెళ్ళవలసిన దారి మీకు చూపుతూ వచ్చాను. మీ ఒంటిమీద బట్టలూ, కాళ్ళ చెప్పులు పాతపడలేదు.
[6] మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షరసం గానీ, మద్యం గానీ త్రాగలేదు” అని యెహోవా చెపుతున్నాడు.
[7] మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు యుద్ధానికి మనమీదికి వచ్చారు గాని
[8] మనం వాళ్ళను రూపుమాపి, వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని, రూబేను గోత్రికులకూ గాదు గోత్రికులకూ మనష్షే అర్ధ గోత్రంవారికీ దానిని వారసత్వంగా ఇచ్చాం.
[9] గనుక మీరు చేసే ప్రతి పనిలో వర్ధిల్లేలా ఈ ఒడంబడిక వాక్కులను పాటించి వాటిప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి.
[10] ఈరోజు మీరంతా మీ దేవుడు యెహోవా సన్నిధానంలో నిలుచున్నారు. మీ నాయకులూ, గోత్రాలవారూ, పెద్దలూ, అధిపతులూ – ఇస్రాయేల్ ప్రజలంతా –
[11] మీ చిన్నవారూ, భార్యలూ, మీ శిబిరంలోని విదేశీయులూ (మీకు కట్టెలు నరికేవారు మొదలుకొని మీకు నీళ్ళు తోడేవారి వరకు) – అందరూ ఇక్కడ నిలుచున్నారు.
[12] ఈవేళ మిమ్మల్ని తనకు స్వప్రజగా సుస్థిరం చేసుకొని తానే మీకు దేవుడై ఉండాలని మీ దేవుడు యెహోవా సంకల్పించాడు. ఇది తాను మీతో చెప్పినట్టే, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన ప్రకారంగానే.
[13] మీ దేవుడు యెహోవా ఈవేళ మీతో చేస్తున్న ఒడంబడిక మీరు అంగీకరించి, ఆయన వాగ్దానం చేసినదానిలో పాల్గొనడానికి మీరంతా ఇక్కడ నిలుచున్నారు.
[14] నేను ఈ ఒడంబడిక, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు.
[15] ఇక్కడ మనతో కూడా మన దేవుడు యెహోవా సన్నిధానంలో నిలబడివున్నవారితోనూ, ఈవేళ ఇక్కడ మనతోకూడా ఉండని వారితోనూ చేస్తున్నాను.
[16] మనం ఈజిప్ట్‌దేశంలో నివసించిన సంగతి మీకు తెలుసు. ప్రయాణమై వచ్చి, వేరు వేరు జనాల మధ్యనుంచి మనం దాటివచ్చిన సంగతి కూడా తెలుసు.
[17] వాళ్ళ అసహ్య విగ్రహాలు, దేవుళ్ళ ప్రతిమలు – కొయ్య, రాతి, వెండి, బంగారు విగ్రహాలు – మీకు కనిపించాయి.
[18] ఆ జనాల దేవుళ్లను కొలవడానికి మన దేవుడు యెహోవా నుంచి తొలగే హృదయం మీలో ఏ పురుషుడికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు.
[19] అలాంటి మనసు గలవాడు ఈ శాపవాక్కులు విన్నప్పుడు లోలోపల తనను పొగడుకొంటూ “నా మొండి హృదయాన్ని అనుసరించి ప్రవర్తించినా నాకు క్షేమమే కలుగుతుంది” అనుకొంటాడు. అయితే దానివల్ల ఆరిన ప్రాంతంతో కూడా నీళ్ళున్న ప్రాంతం పాడైపోతుంది.
[20] యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం వాడిమీద రగులుకొంటాయి. ఈ గ్రంథంలో రాసివున్న శాపాలన్నీ వాడికి తగులుతాయి. వాడి పేరు ఆకాశంక్రింద ఉండకుండా యెహోవా తుడిచివేస్తాడు.
[21] ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న ఒడంబడిక శాపాలన్నిటి ప్రకారం వాడికి కీడు చేయడానికి యెహోవా ఇస్రాయేల్ ప్రజల గోత్రాలన్నిట్లోనుంచి వాణ్ణి వేరుపరుస్తాడు.
[22] రాబోయే తరంవారు – మీ తరువాత జన్మించే మీ సంతతివారు – దూర దేశం నుంచి వచ్చే విదేశీయులు మీ దేశానికి యెహోవా చేసినది చూస్తారు.
[23] దానిలో వచ్చిన తెగుళ్ళూ రోగాలూ చూస్తారు. దేశమంతా గంధకంచేత, ఉప్పుచేత చెడిపోయి, ఎండిపోయి ఉండడం చూచి, అది ఫలించని, ఏ మొక్క మొలవని బీడు భూమిగా ఉండడం చూచి, యెహోవా తన కోపోద్రేకంచేత నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీంలాగా అది ఉండడం చూచి అన్ని దేశాల వాళ్ళు ఇలా అంటారు:
[24] “యెహోవా ఈ దేశాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఈ మహా తీవ్ర కోపానికి కారణమేమిటి?”
[25] అందుకు జవాబిస్తూ కొందరు ఇలా చెపుతారు. “ఎందుకని? వారి పూర్వీకుల దేవుడు యెహోవా వారిని ఈజిప్ట్‌దేశం నుంచి తీసుకువచ్చాక, ఆయన వారితో చేసిన ఒడంబడికను వారు నిరాకరించారు.
[26] తమకు తెలియని దేవుళ్ళను, పూజించకూడదని యెహోవా చెప్పిన దేవుళ్ళను, కొలిచి పూజించారు.
[27] అందుకనే ఈ దేశంమీద యెహోవా కోపాగ్ని రగులుకొంది; ఈ గ్రంథంలో రాసివున్న శాపాలన్నిటినీ ఈ దేశంమీదికి తెప్పించాడు.
[28] యెహోవా తన కోపం, ఆగ్రహం, మహా ఉగ్రతలచేత వారిని వారి దేశంలో లేకుండా నిర్మూలించి, వేరే దేశానికి వెళ్ళగొట్టాడు. ఈ రోజువరకు వారక్కడే ఉన్నారు.”
[29] రహస్య సంగతులు మన దేవుడు యెహోవాకు చెందుతాయి. ఆయన వెల్లడి చేసినవి మనకూ మన సంతానానికీ సదాకాలం చెందుతాయి. ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నిటి ప్రకారమూ మనం ప్రవర్తించాలని ఇందులో ఉన్న ఉద్దేశం.