[1] మీ దేవుడు యెహోవా మీ స్వాధీనం చేసే దేశంలో ఒకవేళ ఎవరైన ఒకరు హతమై పొలంలో పడివుండడం కనిపిస్తే,
[2] మీ పెద్దలు, న్యాయాధిపతులు అక్కడికి రావాలి, వారు హతమైన వ్యక్తికి చుట్టూరా ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి.
[3] హతమైన వ్యక్తికి ఏ గ్రామం దగ్గరగా ఉందో ఆ గ్రామం పెద్దలు ఇలా చేయాలి– ఏ పనికీ ఉపయోగించకుండా కాడి కట్టని పెయ్యను ఎన్నుకోవాలి.
[4] వాగు ఉన్న లోయలోకి, సాగు చేయని బీడుభూమి దగ్గరికి ఆ పెయ్యను తోలుకుపోవాలి. ఆ లోయలో పెయ్య మెడ విరుగతియ్యాలి.
[5] అప్పుడు వారు లేవీ సంతానమైన యాజుల దగ్గరికి రావాలి. మీ దేవుడు యెహోవా తనకు సేవ చేయడానికీ తన పేర దీవించడానికీ వారిని ఎన్నుకున్నాడు గనుక వారి నోటి మాటప్రకారమే ప్రతి వివాదమూ దౌర్జన్యకాండా పరిష్కారం అవుతుంది.
[6] అప్పుడు హతమైన ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ లోయలో మెడను విరుగతీసిన ఆ పెయ్యమీద తమ చేతులు కడుక్కోవాలి.
[7] “మా చేతులు ఈ రక్తపాతం చేయలేదు, మా కండ్లు ఇది చూడలేదు.
[8] యెహోవా, నీవు విడుదల చేసిన నీ ఇస్రాయేల్ ప్రజను క్షమించు. నీ ఇస్రాయేల్ ప్రజల మీద నిరపరాధి ప్రాణం తీసి అపరాధం మోపవద్దు” అని వారు చెప్పాలి.
[9] ఈ విధంగా యెహోవా దృష్టిలో ఏది సరిగా ఉందో అది చేయడంవల్ల మీ మధ్యనుంచి నిరపరాధి హత్య విషయమైన అపరాధం తొలగించాలి.
[10] మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ చేతికప్పగించాక మీరు వాళ్లను బందీలుగా తీసుకువస్తారు.
[11] చెరపట్టినవాళ్ళలో రూపవతిని చూచి ఆశించి, ఆమెను పెండ్లి చేసుకోవాలనుకొంటే,
[12] మీ ఇంటికి ఆమెను తీసుకురావచ్చు. అక్కడ ఆమె తల క్షౌరం చేయించుకొని, గోళ్ళను తీయించుకోవాలి,
[13] తన చెరబట్టలు తీసివేయాలి. మీ ఇంట ఉండిపోతూ నెల రోజులు తన తల్లిదండ్రులను గురించి విలపించాలి. ఆ తరువాత ఆమె దగ్గరికి పోవచ్చు. మీరిద్దరు భార్యభర్తలవుతారు.
[14] ఆమె మీకు నచ్చకపోతే, ఆమె మనస్సు నచ్చిన చోటికి ఆమెను వెళ్ళనివ్వండి. మీవల్ల ఆమెకు అవమానం కలిగింది గనుక ఆమెను ఏమాత్రమూ డబ్బుకు అమ్మకూడదు, దాసిలాగా చూడకూడదు.
[15] ఒకతనికి ఇద్దరు భార్యలున్నారనుకోండి. ఒకామెను ప్రేమిస్తాడు, మరో ఆమెను ద్వేషిస్తాడు. అతడివల్ల ఇద్దరికీ పిల్లలు కలుగుతారు.
[16] అతడు ద్వేషించే భార్య కొడుకు జ్యేష్ఠుడైతే అతడికి బదులుగా ప్రేమించే భార్య కొడుకును జ్యేష్ఠుడుగా చేయకూడదు.
[17] ద్వేషించిన భార్య కొడుకే జ్యేష్ఠుడని ఎంచి, తన ఆస్తి అంతట్లో రెండంతలు అతడికివ్వాలి. ఇతడు అతడి బలారంభం. జ్యేష్ఠుడి హక్కు ఇతడిదే.
[18] ఒక మనిషికి మొండికెత్తిన కొడుకు ఉన్నాడనుకోండి, ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూవుంటాడు. తండ్రి మాట గానీ, తల్లి మాట గానీ వినడు. వారు అతణ్ణి శిక్షించినా వారి మాట వినడు.
[19] అలాంటప్పుడు అతడి తల్లిదండ్రులు అతణ్ణి పట్టుకొని ఊరి ద్వారం దగ్గర కూర్చుని ఉన్న ఊరి పెద్దల దగ్గరికి తేవాలి.
[20] అప్పుడు వారు ఊరి పెద్దలతో “వీడు మా కొడుకు. వీడు మొండివాడు, ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూవుంటాడు, మా మాట వినడు. వీడు తిండిబోతుగా తాగుబోతుగా తయారయ్యాడు” అని చెప్పాలి.
[21] అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్ళు రువ్వి అతణ్ణి చంపాలి. ఇలా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి తొలగించాలి. అది విని ఇస్రాయేల్ ప్రజలందరికీ భయం ఉంటుంది.
[22] మరణశిక్షకు తగిన పాపం ఎవడైనా చేస్తాడనుకోండి. అతణ్ణి చంపి మ్రానుమీద వ్రేలాడదీస్తే,
[23] అతడి శవం రాత్రివేళ ఆ మ్రానుమీద ఉండిపోకూడదు. అతణ్ణి చంపిన రోజే అతణ్ణి పాతిపెట్టితీరాలి. ఎందుకంటే మ్రానుమీద వ్రేలాడేవాడు దేవునిచేత శాపగ్రస్తుడు. మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే దేశాన్ని మీరు అశుద్ధం చేయకూడదు.