[1] స్వదేశస్తుడి ఎద్దు గానీ, గొర్రె గానీ త్రోవతప్పిపోవడం మీరు చూస్తే, చూడనట్లు దాటిపోకూడదు. తప్పనిసరిగా దానిని అతడి దగ్గరకు తోలుకుపోవాలి.
[2] ఒకవేళ అతడు మీకు దగ్గరగా లేకపోతే, అతడెవరో మీకు తెలియకుండా ఉంటే ఆ జంతువును మీరు ఇంటికి తోలుకురావాలి. అతడు దానికోసం వచ్చేవరకు అది మీదగ్గరే ఉండిపోవాలి. అప్పుడు దాన్ని అతడికి అప్పగించాలి.
[3] స్వదేశస్తుడు పోగొట్టుకొన్న గాడిద గానీ, వస్త్రం గానీ మరేదైనా మీకు కనిపిస్తే అలాగే చేయాలి. చూడనట్లు దాటిపోకూడదు.
[4] అతడి గాడిద గానీ, ఎద్దు గానీ తోవలో పడి ఉండడం చూస్తే, చూడనట్లు దాటిపోకుండా దానిని లేవనెత్తడానికి సహాయం చేసితీరాలి.
[5] స్త్రీ పురుషుడి బట్టలు వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ బట్టలు వేసుకోకూడదు. అలా చేసేవారెవరైనా సరే మీ దేవుడు యెహోవాకు అసహ్యులు.
[6] పక్షి గూడు చెట్టు మీద గానీ, నేలమీద గానీ త్రోవలో కనిపిస్తుందనుకోండి. దానిలో ఉన్న పిల్లలమీద గానీ, గుడ్లమీద గానీ తల్లి పొదిగివుంటే పిల్లలతోపాటు తల్లిని తీసుకోకూడదు.
[7] పిల్లలను తీసుకోవచ్చు గాని తల్లిని విడచిపెట్టితీరాలి. మీరు క్షేమంగా ఉండి చాలాకాలం బ్రతకాలని ఇందులో గల ఉద్దేశం.
[8] క్రొత్త ఇల్లు కట్టినప్పుడు దాని పైకప్పుకు చుట్టూ పిట్టగోడ కట్టాలి. లేకపోతే పైకప్పుమీదనుంచి ఎవడైనా పడిపోవడంవల్ల మీ ఇంటిమీదికి హత్యాదోషం వస్తుందేమో.
[9] మీ ద్రాక్షతోటలలో రెండు రకాల విత్తనాలు వేయకూడదు. వేస్తే ఆ విత్తనాల పైరు, ద్రాక్షతోట రాబడి అపవిత్రంగా ఉంటాయి.
[10] ఎద్దును, గాడిదను జత చేసి భూమి దున్నకూడదు.
[11] ఉన్ని, జనుపనార కలిపి నేసిన బట్ట వేసుకోకూడదు.
[12] మీలో ఎవరూ కప్పుకొనే తమ బట్ట నాలుగు చెంగులకు కుచ్చులు వేసుకోకూడదు.
[13] ఎవడైనా పెండ్లి చేసుకొని భార్యతో శయనించిన తరువాత ఆమెను ద్వేషిస్తాడనుకోండి.
[14] ఆమెమీద నేరం మోపి, ఆమె చెడ్డదంటూ “ఈ అమ్మాయిని నేను పెండ్లి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఈమెలో కన్యరికం కనిపించలేదు” అని చెపుతాడనుకోండి.
[15] అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ద్వారందగ్గర కూర్చుని ఉన్న ఊరి పెద్దల దగ్గరికి ఆ అమ్మాయి కన్యరికం రుజువులు తీసుకురావాలి.
[16] ఆ అమ్మాయి తండ్రి ఆ పెద్దలతో ఇలా అనాలి: “మా అమ్మాయిని ఈ మనిషికి పెండ్లి చేశాను, ఇతడు ఆమెను ద్వేషించి,
[17] ‘మీ కూతురిలో కన్యరికం నాకు కనిపించలేదు’ అంటూ ఈమెమీద నేరం మోపాడు. అయితే మా అమ్మాయి కన్యరికానికి రుజువులివే.” అప్పుడు వారు ఊరి పెద్దలముందు ఆ బట్టను పరచాలి.
[18] అందుకు ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించాలి.
[19] నూరు వెండి నాణేలు జుల్మానాగా వాడి దగ్గర తీసుకొని, ఆ అమ్మాయి తండ్రికివ్వాలి. ఎందుకంటే ఆ మనిషి ఇస్రాయేల్ దేశస్తురాలైన కన్యను నిందించాడు. ఆమె అతడికి భార్యగా ఉంటుంది. తాను బ్రతికిన రోజులన్నిటిలో అతడు ఆమెను విడవకూడదు.
[20] ఒకవేళ అతడి మాటే నిజమైతే – ఆ అమ్మాయికి కన్య గురుతులు లేకపోతే –
[21] ఆ ఊరిపెద్దలు ఆ అమ్మాయిని ఆమె తండ్రి ఇంటి వాకిలిదగ్గరికి తీసుకురావాలి. ఆమె ఊరివారు రాళ్ళు రువ్వి ఆమెను చంపాలి. ఎందుకంటే, ఆమె తన తండ్రి ఇంట వ్యభిచారం చేసి ఇస్రాయేల్‌దేశంలో చెడు కార్యం చేసింది. ఈ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు తొలగించాలి.
[22] ఎవడైనా మరో అతడి భార్యతో శయనించగా పట్టుబడితే, ఆ స్త్రీతో శయనించిన పురుషుడు, ఆ స్త్రీ ఇద్దరూ చావాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇస్రాయేల్‌ప్రజలలో నుంచి తొలగించాలి.
[23] ఒక అమ్మాయికి – కన్యకు – ఒకడితో పెళ్ళి సంబంధం నిశ్చయమైతే ఎవడో ఒక మనిషి ఊరిలో ఆమెను చూచి ఆమెతో శయనిస్తే,
[24] వారిద్దరిని ఊరి ద్వారం దగ్గరికి తీసుకువచ్చి, రాళ్ళు రువ్వి చంపాలి. ఆ అమ్మాయి ఊరిలో ఉండీ కేకలు పెట్టలేదు గనుక ఆమెను చంపాలి. ఆ మనిషి తన పొరుగువాడి భార్యను అవమానించాడు గనుక అతణ్ణి చంపాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.
[25] కానీ పెళ్ళి సంబంధం నిశ్చయమైన ఆ అమ్మాయిని ఊరి బయట ఆ మనిషి చూచి బలత్కారంగా ఆమెతో శయనిస్తే ఆమెతో శయనించినవాడు మాత్రమే చావాలి.
[26] ఆ అమ్మాయిని ఏమీ చేయకూడదు. ఆమె చావతగ్గ పాపమేమీ చేయలేదు. ఎవడైనా తన పొరుగువాడి మీదికి లేచి ప్రాణనష్టం చేసినట్టే ఇది జరిగింది.
[27] అతడు ఆమెను ఊరి బయట కలుసుకున్నాడు. పెళ్ళి సంబంధం నిశ్చయమైన ఆ అమ్మాయి కేకలు పెట్టినా ఆమెను రక్షించేవాడు లేకపోయాడు.
[28] పెళ్ళి సంబంధం నిశ్చయం కాని కన్యను ఓ మనిషి పట్టుకొని ఆమెతో శయనించగా వారు పట్టుపడితే,
[29] ఆమెతో శయనించినవాడు ఆ అమ్మాయి తండ్రికి యాభై వెండి నాణాలు ఇచ్చి ఆమెను వివాహమాడాలి. అతడు ఆమెను అవమానించాడు గనుక అతడు బ్రతికినన్నాళ్ళు ఆమెను విడిచి పెట్టకూడదు.
[30] ఎవడూ తన తండ్రి భార్యను తీసుకోకూడదు; అలా తన తండ్రికి అప్రతిష్ఠ కలిగించకూడదు.