Skip to content
Opens in a new window

[1] ఒక ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ మధ్య బయలుదేరుతాడనుకోండి. మీకు తెలియని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం పదండి” అని చెప్పి ఏదైనా అద్భుతమైన సూచన గానీ, శకునం గానీ చూపుతాడనుకోండి.

[2] ఆ సూచన, ఆ శకునం నెరవేరినా

[3] ఆ ప్రవక్త మాటలు, కలలు కనేవాడి మాటలు మీరు వినకూడదు. మీరు మీ దేవుడు యెహోవాను హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నారో లేదో వెల్లడి చేయడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.

[4] మీరు మీ దేవుడు యెహోవానే అనుసరించి నడుచుకోవాలి. ఆయనపట్లే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు శిరసావహించాలి. ఆయన మాటే వింటూ, ఆయనకే సేవ చేస్తూ, ఆయనను విడువకుండా ఉండాలి.

[5] ఆ ప్రవక్తనూ కలలు కనేవాణ్ణీ చంపాలి. ఎందుకంటే, మిమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్యగృహంలో నుంచి – విడిపించి తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవా మీద వాడు తిరుగుబాటు ప్రకటించాడు. మీరు ఏ మార్గంలో నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించాడో అందులోనుంచి మిమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు. వాణ్ణి చంపి మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని నిర్మూలించాలి.

[6] ఒక వేళ నీ తోబుట్టినవాడు – నీ తల్లి కొడుకు – గానీ, నీ కొడుకు గానీ, నీ కూతురు గానీ, నీ ప్రేమ చూరగొన్న నీ భార్య గానీ, నీ ప్రాణ స్నేహితుడు గానీ నిన్ను రహస్యంగా ప్రేరేపిస్తూ, నీకూ నీ పూర్వీకులకూ తెలియని “ఇతర దేవుళ్ళను పూజిద్దాం, పదండి” అంటాడనుకోండి.

[7] ఆ దేవుళ్ళు మీకు సమీపంగా మీ చుట్టూరా ఉన్న జనాల దేవుళ్ళు కావచ్చు, మీకు దూరంగా, భూమి కొనలవరకు ఉండే ప్రజల దేవుళ్ళు కావచ్చు.

[8] అలాంటి దేవుళ్ళలో ఏ దేవుణ్ణయినా పూజించడానికి మిమ్మల్ని ప్రేరేపించే వాడి మాటకు మీరు లొంగకూడదు, వాడు చెప్పేది వినకూడదు. వాడిమీద దయ చూపకూడదు, జాలిపడకూడదు, వాడి విషయం దాచి పెట్టకూడదు.

[9] వాణ్ణి చంపితీరాలి. వాణ్ణి చంపడానికి మొదట మీ చెయ్యి, తరువాత ప్రజలందరి చేతులు వాడిమీద పడాలి.

[10] రాళ్ళు రువ్వి వాణ్ణి చంపాలి. ఎందుకని? ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్య గృహంలో నుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవా దగ్గరనుంచి వాడు మిమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు.

[11] ఇస్రాయేల్ ప్రజలంతా ఇది విని భయపడుతారు, మీ మధ్య ఇలాంటి దుర్మార్గం అప్పటినుంచి చేయకుండా ఉంటారు.

[12] మీరు నివసించడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే ఊళ్ళలో ఏదో ఒకదానిలో,

[13] పనికిమాలినవాళ్ళు కొంతమంది మీ మధ్య బయలుదేరి, మీకు తెలియని “ఇతర దేవుళ్ళను పూజిద్దాం పదండి” అంటూ తమ ఊరివాళ్ళను ప్రేరేపించారని మీరు వింటారనుకోండి.

[14] అలాంటప్పుడు మీరు ఆ సంగతి బాగా పరిశీలించి, విమర్శించి, విచారించాలి. అది నిజమైతే, అలాంటి అసహ్యమైన కృత్యం మీ మధ్య జరగడం నిశ్చయమైతే,

[15] మీరు ఆ ఊరివాళ్ళను కత్తిపాలు చేసితీరాలి. దానినీ దానిలో ఉన్నదంతా, దాని పశువులనూ కత్తితో పూర్తిగా నాశనం చేయాలి.

[16] దాని వస్తువులన్నీ విశాలవీధిలో చేర్చి, మీ దేవుడు యెహోవా పేర ఆ ఊరినీ దాని వస్తువులన్నిటినీ పూర్తిగా కాల్చివేయాలి. ఆ ఊరు ఎవరినీ మళ్ళీ కట్టనివ్వకూడదు. అది ఎల్లకాలం పాడుదిబ్బగా ఉండాలి. నాశనం చేయవలసిన ఆ వస్తువులలో ఏదీ మీ దగ్గర ఉంచుకోకూడదు.

[17] అప్పుడు యెహోవా తన కోపాగ్ని నుంచి మళ్ళుకొని మిమ్మల్ని కరుణించి కనికరించి, మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ప్రకారం మీరు సంఖ్యలో అధికమయ్యేలా చేస్తాడు.

[18] మీరు మీ దేవుడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తిస్తూ, నేను ఈ రోజు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నీ శిరసావహించడానికి ఆయన మాట వింటూవుంటే ఆయన అలా చేస్తాడు.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters