[1] తరువాత యెహోవా నాతో చెప్పినట్టు మనం ఎర్రసముద్రంవైపుకు తిరిగి, ఎడారికి ప్రయాణమయ్యాం. శేయీరు కొండసీమలో తిరుగాడుతూ మనం చాలా రోజులు గడిపాం.
[2] అప్పుడు యెహోవా నాతో
[3] “మీరు ఈ కొండసీమలో తిరిగినకాలం చాలు. ఉత్తర దిక్కుకు తిరగండి” అన్నాడు.
[4] ఆయన నాతో ఇంకా అన్నాడు, “నీవు ప్రజలకు ఈ విధంగా ఆదేశించు – శేయీరులో కాపురమున్న ఏశావు సంతతివారు మీ బంధువులు. మీరు వాళ్ళ సరిహద్దులను దాటి వెళ్ళబోతున్నారు. వారు మీకు భయపడతారు గానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
[5] వారిని రెచ్చగొట్టకూడదు. నేను శేయీరు కొండసీమను ఏశావు స్వాధీనం చేశాను గనుక వారి భూమిలో ఒక్క అడుగైనా మీకివ్వను.
[6] మీరు డబ్బిచ్చి వారిదగ్గర ఆహార పదార్థాలను కొని తినవచ్చు. నీళ్ళకోసం వారికి డబ్బిచ్చి త్రాగవచ్చు.
[7] మీరు చేసిన పనులన్నిట్లో మీ దేవుడు యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదించాడు. ఈ మహా ఎడారిలో మీరు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఈ నలభై సంవత్సరాలలో మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. మీకేమి తక్కువ కాలేదు.”
[8] అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతతివారైన మన బంధువులను విడిచి ఏలతు, ఎసోన్గెబెరు, ఆరాబా మార్గంనుంచి మనం ప్రయాణం చేశాం. మోయాబు ఎడారివైపుకు తిరిగి, ఆ త్రోవలో పయనించాం.
[9] యెహోవా “మోయాబువారిని బాధించకూడదు. వారిని యుద్ధానికి పురికొల్పకూడదు. ఆర్ ప్రదేశాన్ని లోత్ వంశీయుల స్వాధీనం చేశాను. వారి భూమిలో కొంచెమైనా మీ వశం చేయను” అని నాతో అన్నాడు.
[10] (పూర్వకాలంలో ఏమీం అనేవారు ఆర్ ప్రదేశంలో నివసించేవారు. వారు బలంలో, బలగంలో అధికులు. అనాకువారిలాగే పొడగాటి వాళ్ళు.
[11] అనాకువారూ ఏమీంవారూ రెఫాయింవాళ్ళని ప్రజలు అనుకొంటారు అయితే మోయాబు దేశస్థులు వారిని “ఏమీం వాళ్ళు” అంటారు.
[12] పూర్వం హోరివాళ్ళు శేయీరులో నివసించేవాళ్ళు. అయితే ఇస్రాయేల్ప్రజలు యెహోవా తమకిచ్చిన దేశంలో చేసినట్టే ఏశావు సంతతివారు హోరివారిని తమ ఎదుట లేకుండా నాశనం చేశారు. వారి దేశాన్ని స్వాధీనం చేసుకొని వారి స్థానంలో అక్కడ నివసించారు.)
[13] యెహోవా “మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని చెప్పినప్పుడు మనం జెరెదు వాగు దాటిపోయాం.
[14] మనం కాదేష్బర్నేయనుంచి బయలుదేరి జెరెదు వాగు దాటేవరకు ప్రయాణాలు ముప్ఫయి ఎనిమిది ఏళ్ళు పట్టింది. ఆ లోగా యెహోవా ఆ తరంలో ఉన్న సైనికుల గురించి శపథం చేసినట్టే వారంతా శిబిరంలో ఉండకుండా నశించారు.
[15] వారు శిబిరంలో ఉండకుండా పూర్తిగా నశించేవరకూ యెహోవా చెయ్యి వారికి విరోధంగా ఉంది.
[16] ఆ సైనికులంతా ప్రజలలోనుంచి నాశనమైపోయాక,
[17] యెహోవా నాతో అన్నాడు,
[18] “ఈవేళ నీవు ఆర్ అనే మోయాబు దేశం సరిహద్దులను దాటబోతున్నావు.
[19] అమ్మోనువారిని సమీపించినప్పుడు వారిని బాధించకూడదు, యుద్ధానికి వారిని పురికొల్పకూడదు. అమ్మోనువారి దేశాన్ని లోత్ సంతతివారి స్వాధీనం చేశాను. గనుక దానిలో ఏదీ మీ వశం చేయను.”
[20] (ఆ దేశాన్ని కూడా రెఫాయీంవాళ్ళ దేశం అంటారు. పూర్వం రెఫాయీంవాళ్ళు అక్కడ నివసించారు. అమ్మోనువారు వాళ్ళను జంజుమ్మిం వాళ్ళంటారు.
[21] వాళ్ళు బలంలో, బలగంలో అధికులు, అనాకువారిలాగే పొడువైనవాళ్ళు. కాని యెహోవా అమ్మోనువారి ఎదుట లేకుండా వాళ్ళను నాశనం చేశాడు. అమ్మోనువారు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ స్థానే అక్కడ నివాసం ఉన్నారు.
[22] శేయీరులో నివసించే ఏశావు సంతతివారి ఎదుట లేకుండా హోరివాళ్ళను యెహోవా నాశనం చేసినట్టే ఆయన అమ్మోనువారి కోసం చేశాడు. ఏశావు సంతానం హోరివాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పటికీ వాళ్ళ స్థానంలో నివసిస్తున్నారు.
[23] ఆవివాళ్ళ సంగతి కూడా అంతే. పూర్వం వాళ్ళు గాజా దగ్గర ఉన్న గ్రామాలలో నివసించేవాళ్ళు గాని కఫ్తోరివాళ్ళు కఫ్తోరునుంచి వచ్చి వాళ్ళను నాశనం చేసి, వాళ్ళ స్థానంలో అక్కడ కాపురమేర్పరచుకొన్నారు.)
[24] యెహోవా “మీరు లేచి, తరలి వెళ్ళి అర్నోను లోయను దాటండి. ఇదిగో, అమోరీవాడూ హెష్బోను రాజూ అయిన సీహోన్ను, అతడి దేశాన్ని మీ చేతికి అప్పగించాను. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మొదలుపెట్టండి, అతణ్ణి యుద్ధానికి పురికొల్పండి.
[25] ఈ వేళే మిమ్ములను గురించిన భయాందోళన ఆకాశం కింద ఉన్న అన్ని జాతులవారికి పుట్టించడం ఆరంభిస్తున్నాను. వారు మిమ్ములను గురించిన కబురు విని మీ ఎదుట కంగారుపడతారు, కంపిస్తారు” అన్నాడు.
[26] అప్పుడు నేను కెదేమోతు ఎడారి నుంచి హెష్బోనురాజు సీహోను దగ్గరికి ఈ శాంతి వాక్కులతో వార్తాహరులను పంపించాను:
[27] “నన్ను మీ దేశం మీదుగా దాటిపోనివ్వండి. మేము రహదారినే నడిచిపోతాం. కుడి యెడమలకు తిరగము.
[28] డబ్బుతో మేము తాగే నీళ్ళను, తినే భోజన పదార్థాలను మీదగ్గర కొంటాం.
[29] శేయీరులో నివసించే ఏశావు సంతతివారు, ఆర్లో నివసించే మోయాబువారు తమ దేశాలగుండా మమ్ములను వెళ్ళనిచ్చారు. మా దేవుడు యెహోవా మాకిచ్చే దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటేవరకు మీరు కూడా మమ్ములను కాలినడకన సాగిపోనివ్వండి.”
[30] అయితే హెష్బోను రాజు సీహోను తన దేశం గుండా మనల్ని వెళ్ళనివ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మన చేతికి అతణ్ణి అప్పగించాలని మన దేవుడు యెహోవా అతడి మనస్సు కఠినం చేశాడు, అతడి గుండె బండబారిపోయేలా చేశాడు. ఈవేళ ఆ సంగతి స్పష్టమే గదా.
[31] యెహోవా “ఇదిగో విను. సీహోన్ను, అతడి దేశాన్ని నీకు అప్పగించడం ఆరంభించాను. అతడి దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టు” అన్నాడు నాతో.
[32] సీహోను, అతడి జనమంతా యాహసులో యుద్ధం చేయడానికి మనకు ఎదురుగా వచ్చారు.
[33] మన దేవుడు యెహోవా అతణ్ణి మన వశం చేశాడు గనుక మనం అతణ్ణి, అతడి కొడుకులను అతడి సమస్త జనాన్ని హతం చేశాం.
[34] ఆ కాలంలో అతడి పట్టణాలన్నిటినీ పట్టుకున్నాం. ప్రతి పట్టణాన్నీ, వాటిలో ఉన్న స్త్రీ పురుషులను, పిల్లలను నాశనం చేశాం – ఎవరూ తప్పించుకోకుండా చేశాం.
[35] మనం పట్టుకున్న పట్టణాల సొమ్ముతోపాటు పశువులను దోపిడీగా తీసుకున్నాం.
[36] అర్నోనులోయ అంచున ఉన్న అరోయేర్నుంచి, ఆ లోయలో ఉన్న పట్టణంనుంచి గిలాదు ప్రదేశం వరకు మనం జయించలేని పట్టణం అంటూ ఒకటి కూడా లేకపోయింది. మన దేవుడు యెహోవా వాటన్నిటినీ మన వశం చేశాడు.
[37] అమ్మోనువారి దేశాన్ని మాత్రమే మీరు సమీపించలేదు; యబ్బోకు ఏటిలోయలో ఉన్న ఏ ప్రాంతాన్నీ, అక్కడి కొండసీమ పట్టణాలలో దేనినీ సమీపించలేదు. వెళ్ళకూడదని మన దేవుడు యెహోవా చెప్పిన మరి ఏ స్థలానికీ వెళ్ళలేదు.