Skip to content
Opens in a new window

[1] జ్ఞానం కేకలు పెట్టడం లేదా? వివేకం స్వరమెత్తి పలకడం లేదా?

[2] దారి ప్రక్కన, ఎత్తుగా ఉన్న స్థలంలో, బాటలు కలిసే కూడలిలో జ్ఞానం నిలిచి ఉన్నది.

[3] నగర ద్వారం దగ్గర, ప్రవేశంలోనే, తలుపు దగ్గరే నిలిచి, అది ఎలుగెత్తి ఇలా చాటుతూ ఉంది:

[4] “మనుషులారా! నేను చెప్పేది మీకే. నేను పిలిచేది మానవకోటినంతటినీ.

[5] తెలివితక్కువవారలారా! వివేకమంటే ఏమిటో తెలుసుకోండి. మందమతులారా! బుద్ధిని గుర్తించండి.

[6] నేను చెప్పే విషయాలు శ్రేష్ఠమైనవి – వినండి. నేను పెదవులు కదిలించానంటే యథార్థమైన విషయాలు పలుకుతాను.

[7] నా నోరు సత్యమే చెపుతుంది. దుర్మార్గాలు నా పెదవులకు గిట్టవు.

[8] నా నోటి మాటలన్నిట్లో న్యాయం ఉట్టిపడుతుంది. వాటిలో వక్రమైనది లేనే లేదు. కుటిలం అందులో లేనే లేదు.

[9] అవన్నీ వివేకికి యథార్థం! తెలివి లభించినవానికి అవి లోపం లేనివి.

[10] నా ఉపదేశం కోరుకోండి గాని, వెండి కాదు. మేలిమి బంగారం కంటే తెలివిని ఎక్కువగా ఆశించండి!

[11] జ్ఞానం రత్నాలకంటే మంచిది. విలువైనదేదీ దానికి సాటి రాదు.

[12] నేను జ్ఞానాన్ని. వివేకంతో నివాసమున్నాను. తెలివి, ఆలోచన నాకు పరిచితమే.

[13] యెహోవా అంటే భయభక్తులతో ఉండడం దుర్మార్గాన్ని ఏవగించుకోవడమే. గర్వం, అహంకారం, చెడు ప్రవర్తన, కుటిల మాటలు నాకు అసహ్యం.

[14] ఆలోచన, జ్ఞాన సమృద్ధి నావి. వివేకం నాకు ఉంది. బల ప్రభావాలు కూడా ఉన్నాయి.

[15] నా మూలంగా రాజులు పరిపాలిస్తారు, అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.

[16] నా మూలంగా నాయకులు ఏలుతారు, లోకంలో న్యాయవంతులైన అధిపతులంతా ప్రభుత్వం చేస్తారు.

[17] నన్ను ప్రేమించేవారిని నేనూ ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెదికేవారికి నేను దొరుకుతాను.

[18] ఐశ్వర్యం, గౌరవం, ఎడతెగని సంపద, నిర్దోషత్వం నా దగ్గర ఉన్నాయి.

[19] నా వల్ల కలిగే ఫలం బంగారంకంటే – మేలిమి బంగారంకంటే – మంచిది. నాణ్యమైన వెండికంటే నా వల్ల కలిగే అభివృద్ధి గొప్పది.

[20] ధర్మపథం, న్యాయసమ్మతమైన బాటలో నేను నడుస్తాను.

[21] నన్ను ప్రేమించేవారు కలిమికి వారసులు అవుతారు. వారి ధనాగారాన్ని నేను నింపుతాను.

[22] యెహోవా తన పురాతన క్రియలకు ముందే, తాను సృజించడం ఆరంభించినప్పుడు నేను ఆయన స్వాధీనంలో ఉన్నాను.

[23] అనాది కాలంలోనే, మొదటి నుంచీ, భూమి ఉనికిలోకి రాకముందే నన్ను ఆయన నియమించాడు.

[24] జలాగాధం లేనప్పుడు, జలభరితమైన నీటి ఊటలు లేనప్పుడు నేను రూపొందాను.

[25] పర్వతాలకు నిలకడ లేనప్పుడు, కొండలు ఉనికిలోకి రానప్పుడు నేను రూపొందాను.

[26] ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేసేముందే, భూతలం మీద అసలు మన్ను అనేదాన్ని ఆయన చేసేముందే నేను రూపొందాను.

[27] ఆయన ఆకాశాలను నెలకొలిపినప్పుడు, జలాగాధానికి పరిధిని ఏర్పరచినప్పుడు నేనున్నాను.

[28] పైన ఆకాశాన్ని ఆయన సుస్థిరం చేసినప్పుడు, జలధారలను ఆయన నిర్ణయం చేసినప్పుడు,

[29] నీరు దాని పొలిమేరలు దాటకుండేలా ఆయన సముద్రానికి సరిహద్దులేర్పరచినప్పుడు, భూమికి పునాదులు నియమించినప్పుడు,

[30] నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నేను ఆయనకు ప్రధాన శిల్పిని. ఎప్పుడూ ఆయన నామూలంగా ఎంతో ఆనందించాడు. ఆయన సముఖంలో నాకు ఎప్పటికీ సంతోషం.

[31] ఆయన సృజించిన లోకాన్ని, భూమిని బట్టి ఆనందించాను. మానవకోటిని బట్టి ఎంతో సంతోషించాను.

[32] నా కుమారులారా, నా మాట వినండి. నా విధానాల ప్రకారం ప్రవర్తించేవారు ధన్యులు!

[33] నా ఉపదేశం త్రోసిపుచ్చకండి. దాన్ని అవలంబించి జ్ఞానులు కండి.

[34] నేను చెప్పేది చెవిని బెట్టేవారు ధన్యులు. నా గడపదగ్గర కనిపెట్టుకొని ఉండి, నా గుమ్మందగ్గర ఎదురుచూచేవారు ధన్యులు.

[35] నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. యెహోవా అనుగ్రహాన్ని అతడు చూరగొంటాడు.

[36] నన్ను తప్పించుకొని తిరిగేవాడు హానికి గురి అవుతాడు. నన్ను ద్వేషించేవాళ్ళు మరణాన్ని ప్రేమించినవారై ఉన్నట్టే.”

సామెతలు — Chapters