Skip to content
Opens in a new window

[1] నా కుమారా, నా ఉపదేశం మరచిపోకు. నా ఆజ్ఞలను నీ హృదయంలో పదిలం చేసుకో.

[2] నా ఆజ్ఞలు నీ ఆయుష్షుకు అనేక సంవత్సరాలనూ, శాంతినీ చేకూరుస్తాయి.

[3] కరుణ, సత్యం నిన్ను విడవకుండా చూచుకో. వాటిని కంఠాభరణాలుగా వేసుకో. నీ హృదయ ఫలకంమీద వాటిని రాసిపెట్టుకో.

[4] అప్పుడు దేవుడూ, మనుషులూ నిన్ను దయ చూస్తారు. నీకున్న మంచి వివేకాన్ని మెచ్చుకుంటారు.

[5] హృదయపూర్వకంగా యెహోవాను నమ్ముకో. నీ స్వంత తెలివితేటలను ఆనుకోవద్దు.

[6] నీ విధానాలన్నిటిలో ఆయనవైపు చూస్తూ ఉండు. అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్ననివిగా చేస్తాడు.

[7] నీకు నీవే జ్ఞానివనుకోవద్దు. యెహోవాపట్ల భయభక్తులు అలవరచుకో. దుర్మార్గాన్ని విసర్జించు.

[8] నీవిలా చేయడం నీ శరీరారోగ్యానికి మంచిది, నీ ఎముకలకు పుష్టి కూడా.

[9] నీ పంటలన్నిటిలో ప్రథమ ఫలం, నీకు కలిగేదానిలో ఒక భాగం సమర్పించి యెహోవాను గౌరవించు.

[10] అలా చేస్తే, నీ గిడ్డంగులు ధాన్యంతో నిండి ఉంటాయి. నీ గానుగలలోనుంచి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారుతుంది.

[11] నా కుమారా, యెహోవా ఇచ్చే శిక్షను తృణీకరించకు. ఆయన మందలింపుకు విసుగబోకు.

[12] తండ్రి తన ప్రియమైన కొడుకును శిక్షిస్తాడు. అలాగే తాను ప్రేమించే వ్యక్తులను యెహోవా శిక్షిస్తాడు.

[13] జ్ఞానం సంపాదించిన మనిషి, వివేకం గడిచిన మనిషి ధన్యజీవి.

[14] వెండివల్ల కలిగే లాభంకంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఎక్కువ. మేలిమి బంగారంకంటే జ్ఞానం కలిగించే ప్రయోజనం అధికం.

[15] జ్ఞానం రత్నాలకంటే విలువైనది. నీవు కావాలనుకొనే వస్తువులేవీ దీనికి సాటి రావు.

[16] దాని కుడిచేతిలో దీర్ఘాయుష్షు ఉంది. ఎడమ చేతిలో గౌరవమూ, సంపదా ఉన్నాయి.

[17] దాని పోకడలు హాయిని చేకూరుస్తాయి. దాని విధానాలన్నీ శాంతిమయం.

[18] దానిని చేజిక్కించుకొన్న వారికి అది జీవవృక్షం. దానిని సంపాదించిన వారందరూ ధన్యజీవులు.

[19] జ్ఞానంతో యెహోవా భూతలాన్ని నెలకొల్పాడు. వివేకంతో ఆయన ఆకాశాలను సుస్థిరం చేశాడు.

[20] ఆయన తెలివివల్ల జలాగాధాలు బ్రద్దలు అయ్యాయి, మేఘాలు మంచు బిందువులను కురిపిస్తాయి.

[21] నా కుమారా, లోతైన జ్ఞానం, వివేకం, ఈ రెంటిని పదిలంగా కాపాడుకో. వీటిని నీ దృక్పథం నుంచి తొలగిపోనివ్వకు.

[22] అవి నీకు జీవంగా ఉంటాయి. అవి నీకు కంఠాభరణాలుగా ఉంటాయి.

[23] అప్పుడు నీ దారిన నీవు సురక్షితంగా నడుస్తావు. నీ కాలు ఎప్పుడూ జారదు.

[24] నీవు పడుకొంటే, భయం ఉండదు. పడుకొన్నప్పుడు హాయిగా నిద్రపోతావు.

[25] హఠాత్తుగా భయ కారణం కలిగితే, నీవేమీ బెదిరిపోకు. దుర్మార్గుల మీదికి నాశనం ముంచుకు వస్తే భయపడకు.

[26] యెహోవా నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఉచ్చులో చిక్కుకోకుండా ఆయన కాపాడుతాడు.

[27] మేలు చేసే అవకాశం నీ చేతిలో ఉంటే, యోగ్యులైన వారికి మేలు చేయడానికి వెనుకాడవద్దు.

[28] నీ పొరుగువాడు అడిగినది నీ దగ్గరుంటే, “పోయిరా, రేపు ఇస్తా లే!” అనకు.

[29] నీ పొరుగువాడు నీ దగ్గర నిశ్చితంగా ఉంటే అతడికి కీడు తలపెట్టకు.

[30] నీకేమీ హాని చేయని వ్యక్తితో నిష్కారణంగా పోట్లాడకు.

[31] దౌర్జన్యపరుణ్ణి చూచి అసూయపడకు. అతడి విధానాలలో దేనినీ అనుసరించకు.

[32] వక్ర బుద్ధి గలవారంటే యెహోవాకు చెడ్డ అసహ్యం! నిజాయితీపరులకు ఆయన సన్నిహితుడు.

[33] దుర్మార్గుల ఇంటిమీదికి యెహోవా శాపం వస్తుంది. సన్మార్గుల నివాసాన్ని ఆయన దీవిస్తాడు.

[34] వేళాకోళం చేసేవాళ్ళను ఆయన వేళాకోళం చేస్తాడు. వినయం గలవారికి కృప చూపుతాడు.

[35] జ్ఞానులు ఘనతకు వారసులవుతారు. మూర్ఖులు అవమానం పెంచుకుంటారు.

సామెతలు — Chapters