Skip to content
Opens in a new window

[1] రేపటి గురించి గొప్పలు చెప్పుకోవద్దు. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు.

[2] నిన్ను నీవే పొగడుకోవద్దు. ఆ పని ఇతరులు చెయ్యాలి. నీ గురించి నీ పెదవులు స్తుతిపాఠం చెప్పకూడదు. ఆ పని మరెవరైనా చెయ్యాలి.

[3] రాయి బరువైనది. ఇసుక కూడా భారమైనదే. మూర్ఖుడు కలిగించిన విసుగు వీటికంటే బరువైనది.

[4] ఆగ్రహం క్రూరమైనది. కోపం వరదలాంటిది. అయితే అసూయ ఎదుట నిలబడగలవాడెవడు?

[5] తెలియజేయని ప్రేమకంటే బహిరంగంగా మందలించడం మేలు.

[6] నీ మేలే ఉద్దేశించి స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు. పగవాడు పదే పదే ముద్దు పెట్టుకుంటాడు.

[7] కడుపు నిండితే తేనె తెట్టెను కూడా కాలరాచివేస్తారు. ఆకలైన కడుపుకు చేదు పదార్థం కూడా తీపిగానే ఉంటుంది.

[8] ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడిచి తిరిగేపక్షిలాంటివాడు.

[9] అత్తరు, పరిమళ ద్రవ్యాలు హృదయానికి ఉల్లాసం కలిగిస్తాయి. అలాగే స్నేహితులు హృదయంలో నుంచి వచ్చే సలహా మనోహరంగా ఉంటుంది.

[10] నీ స్నేహితుణ్ణి గానీ, నీ తండ్రి స్నేహితుణ్ణి గానీ విసర్జించకు. నీకు ఆపద సంభవిస్తే, నీ సోదరుడి ఇంటికి వెళ్ళవద్దు. దూరాన ఉన్న సోదరుడి కంటే దగ్గరే ఉన్న నీ పొరుగువాడు మేలు.

[11] నా కుమారా! జ్ఞానం సంపాయించుకొని, నా హృదయానికి సంతోషం చేకూర్చు. అప్పుడు నన్ను చిన్నబుచ్చే వారితో ధైర్యంగా మాట్లాడగలుగుతాను.

[12] బుద్ధిమంతులు కీడు రావడం చూచి దాగుకుంటారు. తెలివితక్కువవారు ముందుకు సాగిపోయి బాధల పాలవుతారు.

[13] పరాయివాడికి జామీను ఉండేవాడి వస్త్రం తీసుకో. పరాయివాళ్ళకు అతణ్ణి జామీను ఉండనియ్యి.

[14] పొద్దున్నే లేచి పొరుగువారికి పెద్ద కంఠంతో ఆశీర్వచనం పలికితే దానిని శాపంగా ఎంచడం జరుగుతుంది.

[15] ముసురు పట్టి ఏక ధారగా వాన కురవడం ఎలా ఉంటుందో, గయ్యాళి పెళ్ళాంతో కాపురం అలాంటిదే.

[16] ఆమెను అదుపులో పెట్టడం గాలిని ఆపడంలాంటిపనే. నూనెను చేతితో పట్టుకొని ఉండే ప్రయత్నంలాంటిదే.

[17] ఇనుము ఇనుమువల్ల పదును అవుతుంది. అలాగే మనిషి సాటి మనిషి వల్ల చురుకైనవాడు అవుతాడు.

[18] అంజూరచెట్టు పెంచేవాడు దాని పండు తింటాడు. తన యజమాని విషయాలను చూచుకొనేవానికి ఘనత చేకూరుతుంది.

[19] ఎవడు నీళ్ళలోకి చూస్తే, అతడి ముఖ ప్రతిబింబం కనిపిస్తుంది. ఏ మనిషి మనసులో ప్రతిబింబించేది ఆ మనిషే.

[20] మృత్యులోకానికి, నాశనమైన అగాధానికి తృప్తి ఎప్పటికీ ఉండదు. అలాగే మనుషుల కంటిచూపుకు తృప్తి అంటూ ఉండదు.

[21] వెండిని పరీక్షించేందుకు మూస ఉంది. బంగారంకోసం కొలిమి ఉంది. మనిషి తాను పొందిన కీర్తి ప్రతిష్ఠల మూలంగా పరీక్షకు గురి అవుతాడు.

[22] మూర్ఖుణ్ణి గోధుమల్లాగా రోట్లో వేసి, రోకటితో దంచినా అతడి మూర్ఖత్వం పోదు.

[23] నీ గొడ్డూ గోదా వ్యవహారాలు తెలుసుకో. నీ పశువుల మందలను జాగ్రత్తగా చూచుకో.

[24] ఎందుకంటే, ధనధాన్యాలు శాశ్వతమైనవి కావు. రాజ కిరీటం తరతరాలకు నిలిచి ఉండకపోవచ్చు.

[25] ఎండిన గడ్డి వామి వేసినతరువాత, పచ్చిక బయళ్ళు కనబడ్డప్పుడు, కొండమీది గడ్డి కోసుకొన్న తరువాత

[26] నీ గొర్రెపిల్లల ఉన్ని చాలినంతగా నీ కట్టుబట్టలకు లభిస్తుంది. పొలం కొనుక్కోవాలంటే మేకపోతులను అమ్మవచ్చు.

[27] నీకూ నీ ఇంటివారికీ నీ పనికత్తెల పోషణకూ ఆహారంగా మేక పాలు సమృద్ధిగా లభిస్తాయి.

సామెతలు — Chapters