Skip to content
Opens in a new window

[1] ఎండకాలంలో చల్లనిమంచు, కోతకాలంలో వానలు ఏ విధంగా సరిపడకుండా ఉంటాయో, అలాగే మూర్ఖుడికి గౌరవం తగినది కాదు.

[2] తగని శాపం, రెక్కలు రెపరెపలాడించే పిచ్చుకలాగా, ఎగిరిపోయే వానకోయిలలాగా ఉంటుంది. అది ఎవరి మీదికీ దిగిరాదు.

[3] గుర్రానికి కొరడా, గాడిదకు కళ్ళెం, మూర్ఖుడి వీపుకు బెత్తం.

[4] మూర్ఖుడికి అతడి మూర్ఖత్వం ప్రకారం జవాబు చెప్పకు. అలా చెపితే, నీవూ వాడిలాంటి మనిషివే అవుతావు.

[5] మూర్ఖుడికి అతడి మూర్ఖత్వం ప్రకారం జవాబు చెప్పు. లేకపోతే, తానే జ్ఞానిననుకొంటాడేమో.

[6] మూర్ఖుడి చేత కబురు పంపాలంటే కాళ్ళు తెగగొట్టుకొని, విషం త్రాగినట్టే!

[7] మూర్ఖుడి నోట సామెత కుంటివాళ్ళ ఊగిసలాడే కాళ్ళలాంటిది.

[8] మూర్ఖుడికి గౌరవం చూపడం వడిసెలలో రాయి కట్టి ఉంచినట్టే.

[9] మద్యంచేత మత్తిల్లినవాడి చేతికి ముల్లు గుచ్చుకొంటే ఎంతో, మూర్ఖుడి నోట సామెత కూడా అంతే.

[10] మూర్ఖుణ్ణి గానీ దారిని వెళ్ళే వాణ్ణి గానీ పనికి పెట్టుకొనేవాడు అందరినీ గాయపరచే విలుకాడులాంటివాడు.

[11] తన తెలివితక్కువ పని తిరిగి చేసే మూర్ఖుడు తన వాంతికి మరలిపోయే కుక్కలాంటివాడు.

[12] తనకు తానే జ్ఞానిననుకొనేవాణ్ణి చూశావా? అలాంటివాణ్ణి బాగు చేయడంకంటే మూర్ఖుణ్ణయినా బాగుచేయడం సులభం.

[13] సోమరిపోతు “దారిలో సింహం ఉంది” అంటాడు. “వీధిలో సింహం తిరుగుతూ ఉంది” అంటాడు.

[14] బందుల మీద తలుపు అటూ ఇటూ తిరుగుతుంది. సోమరిపోతు పడకమీద అటూ ఇటూ పొర్లుతాడు.

[15] సోమరిపోతు కంచంలో చెయ్యి పెడతాడు, కాని చెయ్యి నోటిదాకా ఎత్తడానికి బద్ధకం!

[16] వివేకంగా జవాబు ఇవ్వగల ఏడుగురికంటే సోమరిపోతు తాను గొప్ప జ్ఞాని ననుకుంటాడు.

[17] తనకు సంబంధించని జగడంలో తల దూర్చేవాడు తన దారిన తాను పోయేకుక్క చెవులు పట్టేవాడితో సమానం.

[18] పొరుగువాణ్ణి కావాలని మోసగించి, “సరదాగా తమాషాకు అలా చేశానులే” అనేవాడు

[19] మరణాన్ని, నిప్పుకొరువులను, బాణాలను విసిరివేసే వెర్రివాడితో సమానం.

[20] కట్టెలు లేకపోతే, మంట కాస్తా ఆరిపోతుంది. చాడీలు చెప్పేవారు లేకపోతే కలహం అంతరించిపోతుంది.

[21] మండే బొగ్గులకు ముడిబొగ్గు చేరిస్తే ఎలాగో, మంటలో కట్టెలు వేస్తే ఎలాగో, వివాదానికి జగడగొండ్లు అలాంటివారు.

[22] చాడీలు చెప్పేవారి మాటలు రుచిగల కబళాల లాంటివి. అవి మనిషి అంతరంగంలోకి దిగిపోతాయి.

[23] చెడ్డ హృదయంతోపాటు స్నేహంతో మాట్లాడే పెదవులు గలవారు వెండి పూత పూసిన మట్టి పాత్రతో సమానం.

[24] పగవాడికి భ్రమపరిచే పెదవులు ఉంటాయి. అతడు అంతరంగంలో కపటోపాయం పన్నుతూ ఉంటాడు.

[25] అతడు నీతో దయగా మాట్లాడుతున్నాడని అతణ్ణి నమ్మవద్దు. అతడి హృదయంలో అసహ్యకరమైనవి ఏడు ఉన్నాయి.

[26] అతడు దొంగవేషం వేసి, కపటాన్ని దాచి పెట్టవచ్చు గాని, అతడి దుర్మార్గం సంఘం ఎదుటే బట్టబయలు అవుతుంది.

[27] ఎవడు త్రవ్వుకొన్న గోతిలో వాడే పడుతాడు. రాయి పొర్లించే వాడిమీదికే అది పొర్లివచ్చి పడుతుంది.

[28] అబద్ధాలాడే నాలుక గలవారు తాము అణగద్రొక్కిన వారిని ద్వేషిస్తారు. ముఖస్తుతి పలికే నోరు నాశనం తెస్తుంది.

సామెతలు — Chapters