[1] ఇవి దావీదు కుమారుడూ, ఇస్రాయేల్ రాజూ అయిన సొలొమోను సామెతలు.
[2] జ్ఞానమూ, ఉపదేశమూ ఏమిటో తెలుసుకోవడానికీ, పరిజ్ఞాన ప్రబోధాలు అర్థం చేసుకోవడానికి ఈ సామెతలు ఉపయోగమైనవి.
[3] నీతి, న్యాయం, నిజాయితీ ఆచరణలో పెట్టడానికి వివేకం నేర్పుతాయి ఈ సామెతలు.
[4] ఇవి తెలివితక్కువ వారికి బుద్ధి కలిగిస్తాయి, యువకులకు తెలివితేటలు, వివేచనాశక్తి చేకూరుస్తాయి.
[5] ఇవి విన్న జ్ఞానికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. వివేకి వింటే ఆలోచన అతడికి కలుగుతుంది.
[6] వీటి మూలంగా సామెతలు, సాదృశ్యాలు, జ్ఞానులు చెప్పే వాక్కులు, వారి పొడుపు కథలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.
[7] యెహోవాయందు భయభక్తులు తెలివికి ఆరంభం. మూర్ఖులు జ్ఞానాన్ని, తర్బీతును నిరాకరిస్తారు.
[8] నా కుమారా! నీ తండ్రి ఉపదేశం విను. నీ తల్లి నేర్పే వాటిని త్రోసిపుచ్చకు.
[9] అవి నీ తలపై అందమైన పూదండలాగా ఉంటాయి. అవి నీకు కంఠహారాలుగా ఉంటాయి.
[10] నా కుమారా! పాపులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
[11] వాళ్ళు నీతో ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చెయ్యి! ఎవరినో చంపడానికి దారిలో పొంచి ఉందాం. అమాయకుణ్ణి ఎవరినైనా పట్టుకుందాం. దారి కాచి ఉందాం, రా.
[12] “మృత్యువులాగా ఆ మనుషులను ప్రాణాలతో మింగేద్దాం. నాశనకరమైన గుండం మనుషులను దిగమింగినట్లు వాళ్ళను పూర్తిగా మింగేద్దాం, రా.
[13] “రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి. మన ఇండ్లను దోపిడీతో నింపుకుందాం.
[14] “నీవు మాతో పొత్తు కలువు. మనం డబ్బు సంచి ఉమ్మడిగా పెట్టుకుందాం.”
[15] కుమారా, వాళ్ళు అలా అంటే వాళ్ళతో వెళ్ళకు. వాళ్ళ దారిన అడుగు పెట్టకుండా నీ పాదం వెనక్కు తీసుకో.
[16] కీడు చేసేందుకు వాళ్ళ పాదాలు పరిగెత్తుతాయి. రక్తపాతం చేసేందుకు వాళ్ళు త్వరపడతారు.
[17] పక్షులన్నీ చూస్తూ ఉంటే, వల ఒడ్డడం వృథా ప్రయాస.
[18] వాళ్ళు పొంచి ఉండడం వాళ్ళ నాశనానికే! వాళ్ళు మాటులో దాక్కొని ఉంటే, వాళ్ళనే పట్టడం జరుగుతుంది!
[19] అక్రమ లాభం సంపాదించేవాళ్ళకు పట్టే గతి అదే. అలాంటి లాభం దొరికినవాడి ప్రాణం అదే తీస్తుంది.
[20] జ్ఞానం వీధిలో కేకలు వేస్తూ ఉంది. సంత వీధుల్లో జ్ఞానం బిగ్గరగా మాట్లాడుతుంది.
[21] చాలా సందడి ఉన్న చోట్ల కూడా చాటుతుంది. పట్టణంలో నగర ముఖద్వారాల దగ్గర జ్ఞానం తన వాక్కులు ఇలా పలుకుతుంది:
[22] “తెలివి తక్కువవారలారా! ఎంతకాలమని తెలివితక్కువ స్థితిలో ఉండడం మీకిష్టం? పరిహాసకుల్లారా! మీరెన్నాళ్ళు వేళాకోళం చేయడం ఇష్టపడుతూ ఉంటారు? మూర్ఖులారా! మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని ఏవగించుకొంటారు?
[23] “నా హెచ్చరిక విని నావైపు తిరగండి. వినండి, నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను. నా ఉపదేశం మీకు వినిపిస్తాను.
[24] “కాని, నేను పిలిచినప్పుడు, మీరు నన్ను తిరస్కరించారు. నేను చెయ్యి చాపినప్పుడు, ఎవరూ లెక్క చేశారు కారు.
[25] “నేను చెప్పే సలహా అంతా మీరు నిర్లక్ష్యం చేశారు. నా మందలింపును పాటించడం మీకు ఇష్టం లేదు.
[26] “అందుచేత మీకు ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయపడ్డప్పుడు నేను వేళాకోళం చేస్తాను.
[27] “తుఫాను లాగా భయం మిమ్ములను ఆవరించినప్పుడు, సుడిగాలిలో మిమ్ములను ప్రమాదం చుట్టి వచ్చినప్పుడు, మీకు కడగండ్లు, దుఃఖం కలిగినప్పుడు, నేను మిమ్ములను చూచి ఎగతాళి చేస్తాను.
[28] “ఆ సమయంలో వాళ్ళు నాకు మొరపెట్టుకుంటారు. గాని, నేను ఏమీ జవాబివ్వను. నన్ను శ్రద్ధగా వెదుకుతారు గాని, నేను వాళ్ళకు దొరకను.
[29] “జ్ఞానం అంటేనే వాళ్ళకు ఏవగింపు. యెహోవామీది భయభక్తులంటే వాళ్ళకు ఇష్టం లేకపోయింది.
[30] “వాళ్ళు నా సలహా అంగీకరించలేదు. నేను మందలిస్తే, మరీ తృణీకరించారు.
[31] “కాబట్టి వాళ్ళు తమ ప్రవర్తనకు తగిన ఫలితం అనుభవిస్తారు. తీరా తమ విధానాలు తమకు వెగటు కలిగిస్తాయి.
[32] “తెలివితక్కువవాళ్ళు జ్ఞానంనుంచి వైదొలగి పోవడం వల్ల మృతిపాలవుతారు. మూర్ఖులు లేని క్షేమాన్ని ఊహించుకొని దానివల్ల నాశనమవుతారు.
[33] “నా మాట వినేవారు సురక్షితంగా ఉండిపోతారు. వారు కీడు వస్తుందేమో అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారు.”