Skip to content
Opens in a new window

[1] నా కుమారులారా, తండ్రి ఉపదేశం వినండి. ఆలకించి, వివేకం అంటే ఏమిటో తెలుసుకోండి.

[2] నేను మీకు సద్బోధ చేస్తాను. నా ఉపదేశం త్రోసిపుచ్చకండి.

[3] మునుపు నేను కూడా నా తండ్రితో ఉన్న కొడుకును. మా అమ్మకు నేనొక్కణ్ణే కొడుకును, సుకుమారుణ్ణి.

[4] అప్పుడు నా తండ్రి నాకు ఇలా నేర్పాడు: “నా మాటలను నీ హృదయం గట్టిగా చేపట్టాలి. నా ఆజ్ఞలను పాటిస్తే నీవు బ్రతుకుతావు.

[5] “నా నోటి మాటలను మరచిపోకు. వాటి నుంచి తొలగిపోకు. జ్ఞానం, వివేకం సంపాదించుకో.

[6] “జ్ఞానాన్ని విడిచిపెట్టకు. అప్పుడు అది నిన్ను సంరక్షిస్తుంది. దాన్ని ప్రేమిస్తే అది నీకు కాపుదల!

[7] “జ్ఞానం ప్రధానం. జ్ఞానాన్ని సంపాదించుకో. ఎంత ఇవ్వవలసివచ్చినా వివేకాన్ని సంపాదించుకో.

[8] “నీవు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. జ్ఞానాన్ని కావిలించుకో. అది నిన్ను ఘనపరస్తుంది.

[9] “పై నీ తలపై అందమైన దండ ఉంచుతుంది. దివ్య కిరీటం నీకిస్తుంది.”

[10] నా కుమారా, విను! నీవు నా మాటలు స్వీకరిస్తే నీవు చిరంజీవి అవుతావు.

[11] నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. తిన్నని త్రోవలో నీకు మార్గదర్శిగా ఉన్నాను.

[12] నీవు నడిచేటప్పుడు నీ కాళ్ళు చిక్కు పడవు. నీవు పరిగెత్తేటప్పుడు నీ అడుగులు తడబడవు.

[13] ఉపదేశాన్ని జారవిడవకు. దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని పదిలంగా ఉంచుకో. అది నీకు జీవమే.

[14] దుర్మార్గుల దారిన అడుగు పెట్టకు. చెడ్డవాళ్ళ మార్గంలో నడవకు.

[15] అందులోకి వెళ్ళకు. తప్పించుకు తిరుగు. దాని నుంచి వైదొలగి సాగిపో.

[16] ఏదో చెడుగు చేయకపోతే, వాళ్ళకు నిద్ర పట్టదు. ఎవణ్ణయినా కూలద్రోయకపోతే, వాళ్ళకు నిద్ర దూరం అవుతుంది.

[17] చెడుగు చేసి సంపాదించిన ఆహారం తింటారు వాళ్ళు. దౌర్జన్యంవల్ల దొరికిన ద్రాక్షరసం త్రాగుతారు.

[18] ఉదయంలో కాంతి రేఖ పగటివరకు అంతకంతకు వృద్ధి అవుతుంది. న్యాయవంతుల మార్గం అలాగే ఉంటుంది.

[19] దుర్మార్గుల మార్గం కటిక చీకటిలాంటిది. ఏది తట్టుకొని పడతారో వాళ్ళకే తెలియదు.

[20] నా కుమారా, నా మాటలు సావధానంగా విను. నేను చెప్పేది చెవిని బెట్టు.

[21] నీ చూపునుంచి వాటిని తొలగిపోనియ్యకు. నీ హృదయంలో వాటిని పదిలం చేసుకో.

[22] అవి లభించిన వారికి జీవమే. వారికి అవి శరీరారోగ్యం.

[23] అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకో! ఎందుకంటే జీవిత విధానాలకు అదే మూలాధారం.

[24] కుటిల మాటలు నీ నోట ఉండనియ్యకు. నీ పెదవులకు మోసకరమైన పదాలు దూరం చేసుకో.

[25] నీ కంటి చూపు సూటిగా ముందుకే సారించు. నీ దృక్పథం తిన్నగా ఉండేలా చెయ్యి.

[26] నీవు నడిచే దారిని చదునుగా చెయ్యి. అప్పుడే నీ మార్గాలన్నీ సుస్థిరంగా ఉంటాయి.

[27] కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకు. దుర్మార్గం నుంచి నీ పాదాలను మరల్చుకో.

సామెతలు — Chapters