Skip to content
Opens in a new window

[1] నా కుమారా, నీ పొరుగువాడికి నీవు జామీనుగా ఉండే పక్షంలో, లేదా, పరాయివాడికి శపథం చేసే పక్షంలో,

[2] ఆ విధంగా నీ నోట వచ్చిన మాటలే నిన్ను చిక్కుబెట్టి ఉంటే, నీ నోటి పలుకులే నిన్ను పట్టుకొని ఉంటే,

[3] నేను చెప్పేది చెయ్యి. నా కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కిపోయినందున నిన్ను తగ్గించుకొని వెళ్ళి, విడుదలకోసం అతణ్ణి ప్రాధేయపడి అడుగు! ఈ విధంగా తప్పించుకో!

[4] నీ కండ్లకు నిద్ర గాని, నీ కంటి రెప్పలకు కునికిపాటు గాని రాకుండా చూచుకో.

[5] వేటగాడి బారినుంచి లేడి తప్పించుకొన్నట్లు, బోయవాడి చేతిలోనుంచి పక్షి తప్పించుకొన్నట్లు నీవూ తప్పించుకోవాలి!

[6] సోమరీ! చీమ దగ్గరికి వెళ్ళి దాని విధానాలను చూచి తెలివి తెచ్చుకో!

[7] వాటికి సేనాపతి ఎవడూ ఉండడు. నాయకుడు ఉండడు. అధ్యక్షుడూ లేడు.

[8] అయినా, వేసవి కాలంలో ఆహారం సేకరించుకుంటుంది చీమ. పంట కాలంలో ధాన్యం పోగు చేసుకుంటుంది.

[9] సోమరీ! ఎంత సేపు పడుకొని ఉంటావు? నిద్రనుంచి నీవు ఎప్పుడు మేల్కొంటావు?

[10] “ఇంకా కాసేపు కునుకుతా. ఇంకా కొంచెం నిద్ర కావాలి. కాసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను” అంటావా?

[11] అందుకే దోపిడీ దొంగలాగా దరిద్రం నీమీద వచ్చిపడుతుంది. ఖడ్గం ధరించిన భటుడులాగా లేమి నీమీదికి ఎగబడుతుంది.

[12] కుటిలంగా మాట్లాడుతూ, తిరుగుతూ ఉండేవాడు నిష్ ప్రయోజకుడు, దుర్మార్గుడు.

[13] కన్ను గీటుతూ జారుకుంటూ చేసైగ చేస్తూ ఉంటాడు.

[14] వాడి హృదయంలో పెంకి, మొండి. వాడు దురాలోచనలు చేస్తాడు. జగడాలు రేపుతాడు.

[15] అందుచేత వాడిమీద విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. ఉన్నట్లుండి వాడు కూలిపోతాడు. వాడి పాటుకు తిరుగు లేదు.

[16] యెహోవాకు ఈ ఆరూ అసహ్యం. ఆ మాటకొస్తే, ఆయన ఏవగించుకొనేవి ఈ ఏడు:

[17] గర్వంతో కూడిన చూపు, అబద్ధాలాడే నాలుక, నిర్దోషుల రక్తం ఒలికించే చేతులు,

[18] దురాలోచనలు చేసే హృదయం, వేగంగా పరిగెత్తి కీడు చేసే పాదాలు,

[19] అబద్ధాలు గుప్పించే కపట సాక్షి, సోదరుల మధ్య జగడాలు రేపేవాడు.

[20] నా కుమారా, నీ తండ్రి ఆజ్ఞలను పాటించు. నీ తల్లి ఉపదేశించిన వాటిని త్రోసిపుచ్చకు.

[21] వాటిని ఎప్పటికీ నీ హృదయంలో పదిలం చేసుకో. వాటిని నీ మెడకు కట్టుకో!

[22] నీవు దారిన వెళ్ళేటప్పుడు అవి మార్గదర్శిలాగా ఉంటాయి. నిద్రపోయేటప్పుడు అవి నీకు కాపల కాస్తాయి. మేల్కొని ఉన్నప్పుడు అవి నీతో మాట్లాడుతాయి.

[23] దేవుని ఆజ్ఞ దీపంలాంటిది. ఉపదేశం వెలుగులాంటిది. క్రమశిక్షణకోసం దిద్దుబాట్లు జీవానికి మార్గం.

[24] చెడ్డ స్త్రీదగ్గరికి వెళ్ళకుండా, వ్యభిచారిణి చెప్పే పొగడ్తలకు లొంగిపోకుండా అవి నిన్ను కాపాడుతాయి.

[25] నీ హృదయంలో అలాంటి స్త్రీ అందాన్ని ఆశించకు, ఆమె కంటిరెప్పలు ఆర్పుతూ ఉంటే నీవు ఆమె వశమైపోబోకు.

[26] పడుపు స్త్రీ పొందువల్ల రొట్టె ముక్క మాత్రం మిగులుతుంది. వ్యభిచారిణి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.

[27] నిప్పు కణికెలు ఒడిలో పోసుకొంటే బట్టలు కాలిపోవా?

[28] నిప్పుమీద నడిస్తే, కాళ్ళు కాలకుండా ఉంటాయా?

[29] అలాగే మరొకడి భార్యతో పోయేవాడికి హాని తప్పదు. పొరుగువాడి భార్యను ముట్టినవాడు శిక్ష తప్పించుకోలేడు.

[30] ఆకలిగొన్నవాడు ఆకలి తీర్చుకొనేందుకు దొంగతనం చేసినా, అలాంటి దొంగను ఎవరూ నీచంగా ఎంచరు.

[31] అయినా, ఆ దొంగ దొరికితే, దొంగిలించిన దానికి ఏడంతలు చెల్లించాలి, తన ఇంట్లో ఉన్న ఆస్తి అంతా ఇచ్చివేయవలసివచ్చినా అలా చెల్లించాలి.

[32] వ్యభిచారం చేసేవాడికి బుద్ధి లేదు. అలా చేసేవాడు తనను నాశనం చేసుకొంటున్నాడు.

[33] వాడు గాయానికి, అవమానానికి గురి అవుతాడు. వాడిమీదికి వచ్చిన నింద మాసిపోదు.

[34] భర్త రోషంతో మండిపడుతాడు. ప్రతీకారం చేసేటప్పుడు అతడు ఏమీ కరుణ చూపడు.

[35] నీవిచ్చే ప్రతిఫలం అతడికేమీ లక్ష్యం ఉండదు. ఎన్ని కానుకలు ఇచ్చినా అతడికి తృప్తి ఉండదు.

సామెతలు — Chapters