Skip to content
Opens in a new window

[1] దుర్మార్గులు తమకు తామే పారిపోతారు. వారిని ఎవరూ తరమనక్కరలేదు. సన్మార్గులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు.

[2] దేశప్రజల తిరుగుబాటుకు ఫలితంగా దాని పాలకులు అనేకులవుతారు. తెలివి, జ్ఞానం గల నాయకుడివల్ల దేశాధికారం సుస్థిరం అవుతుంది.

[3] బీదసాదలను బాధించే దరిద్రగొట్టు మనిషి పైరుపంట లేకుండా చేసే గాలివానలాంటివాడు.

[4] ఉపదేశం విసర్జించేవారు దుర్మార్గులను స్తుతిస్తారు. ఉపదేశం పాటించేవారు దుర్మార్గులను ఎదిరిస్తారు.

[5] దుర్మార్గులకు న్యాయం ఎలాంటిదో తెలియదు. యెహోవాను వెదకుతూ ఉండేవారు దాన్నంతా గ్రహించ గలుగుతారు.

[6] కుటిల విధానాలు అనుసరించే ధనికులకంటే, నిజాయితీగా ప్రవర్తించే బీదవారు మేలు.

[7] ఉపదేశం ప్రకారం ప్రవర్తించే కొడుకు తెలివైనవాడు. నీచుల స్నేహం పట్టిన కొడుకు తండ్రికి చెడ్డ పేరు తెస్తాడు.

[8] అన్యాయంగా అధిక వడ్డీలతో ఆస్తి వృద్ధి చేసుకొనేవారు తుదకు బీదలపట్ల దాతృత్వం గలవారి కోసం కూడబెడు తున్నారు.

[9] ఉపదేశానికి చెవులు మూసుకొనే వ్యక్తి ప్రార్థన కూడా అసహ్యకరం.

[10] నిజాయితీపరులను దుర్మార్గంలోకి పడలాగేవారు తాము త్రవ్వుకొన్న గోతిలో తామే పడుతారు. నిర్దోషులకు మంచి వారసత్వం లభిస్తుంది.

[11] బాగా డబ్బున్న వాడు తనకు తానే జ్ఞానిని అనుకోవచ్చు. వివేకి అయిన దరిద్రుడు అతణ్ణి పసిగడతాడు.

[12] సన్మార్గులకు విషయం చేకూరిందంటే అది చాలా గౌరవనీయం. దుర్మార్గులు అధికారంలోకి వస్తే ప్రజలు దాగుకోవలసిందే.

[13] తన అపరాధాలను కప్పిపుచ్చేవారికి క్షేమం అంటూ ఉండదు. వాటిని ఒప్పుకొని, విసర్జించేవారికే కరుణ దొరుకుతుంది.

[14] ఎప్పుడూ భయభక్తులతో మెలిగేవారే ధన్యజీవులు. హృదయాన్ని కఠినం చేసుకొనేవారికి తిప్పలు తప్పవు.

[15] దిక్కులేని ప్రజలమీద ప్రభుత్వం చేసే దుర్మార్గుడు గర్జించే సింహంలాంటివాడు, తీక్షణమైన ఆకలితో తిరిగే ఎలుగుబంటిలాంటివాడు.

[16] ప్రజలను విపరీతంగా బాధించే అధికారి తెలివి తక్కువవాడు. అన్యాయ లాభాన్ని ద్వేషించడం వల్ల మనిషి తన జీవిత కాలాన్ని పొడిగించుకుంటాడు.

[17] రక్తపాతం విషయంలో అపరాధి సమాధిలోకి పోయేవరకూ పారిపోతూ ఉండేవాడవుతాడు. అలాంటివాడికి ఎవరూ సహాయం చేయకూడదు.

[18] నిజాయితీపరులకు సంరక్షణ ఉంది. కుటిలంగా ప్రవర్తించేవారు హఠాత్తుగా కూలిపోతారు.

[19] తమ పొలం దున్నుకొనేవారికి కడుపునిండా తిండి. వెర్రి పోకడలు పోయేవారికి కటిక దరిద్రం వస్తుంది.

[20] నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి. ధనికుణ్ణి కావాలని ఆతురపడే వారికి శిక్ష వస్తుంది.

[21] పక్షపాతంతో వ్యవహరించడం మంచిది కాదు. రొట్టెముక్క కోసం ఒకరు ద్రోహం చేస్తారు.

[22] చూచిన ప్రతిదీ కావాలనే వ్యక్తులు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి తాపత్రయపడుతారు. తమకు దరిద్రం కలగబోతుందని వారికి తెలియదు.

[23] నాలుకతో ముఖస్తుతి చేసే వాడికంటే ఎదుటి మనిషిని మందలించేవాడికి చివరికి అనుగ్రహం ప్రాప్తిస్తుంది.

[24] తల్లిదండ్రుల సొత్తు దోచుకువచ్చి, “ఇదేమీ ద్రోహం కాదులే” అనేవాడు నాశనగొట్టు మనిషికి చెలికాడు.

[25] పేరాశగలవారు జగడాలు రేపుతారు. యెహోవామీద నమ్మకం పెట్టేవారికి అభివృద్ధి కలుగుతుంది.

[26] తమ మనసును తామే నమ్ముకొనేవారు తెలివితక్కువ వారు. జ్ఞానంగా మసులుకొనేవారికి విడుదల కలుగుతుంది.

[27] బీదలకు దానం చేసేవారికి కొదువ అంటూ ఉండదు. బీదల విషయం కండ్లు మూసుకుపోయినవారి మీదికి శాపాలెన్నో వస్తాయి.

[28] దుర్మార్గులు అధికారంలోకి వస్తే ప్రజలు దాగుకోవలసిందే. దుర్మార్గులు నాశనమైతే సన్మార్గుల సంఖ్య పెరుగుతుంది.

సామెతలు — Chapters