Skip to content
Opens in a new window

[1] మృధువైన జవాబు అవతలివాడి కోపాగ్నిని చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాగ్ని రేపుతుంది.

[2] జ్ఞానం మనోహరమని జ్ఞానుల మాటలవల్ల తెలుస్తుంది. మూర్ఖుల నోరు తెలివితక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.

[3] యెహోవా కండ్లు ప్రతి చోటా ప్రసరిస్తాయి. మంచివారినీ, చెడ్డవారినీ ఆయన కండ్లు బాగా చూస్తూ ఉంటాయి.

[4] ఆరోగ్యాన్ని చేకూర్చే మాటలు జీవవృక్షం. కుటిలమైన మాటలు మనసును కుంగదీస్తాయి.

[5] మూర్ఖుడు తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. దిద్దుబాటుకు లోబడేవాడు బుద్ధిమంతుడు.

[6] సన్మార్గుల ఇల్లు గొప్ప ధననిధిలాంటిది. దుర్మార్గుల రాబడిలో చిక్కులున్నాయి.

[7] జ్ఞానుల నాలుక జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తుంది. మూర్ఖుల హృదయం అలాంటిదేమీ కాదు.

[8] దుర్మార్గుల బలులు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరుల ప్రార్థన అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

[9] దుర్మార్గుల ప్రవర్తన యెహోవా చీదరించుకుంటాడు, సన్మార్గులను ఆయన ప్రేమిస్తాడు.

[10] దారి తప్పినవాడికి కఠినమైన క్రమశిక్షణ కావాలి. దిద్దుబాటును అసహ్యించుకొనేవాడు చస్తాడు.

[11] మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవా ఎదుట తెరచుకొని ఉన్నాయి. అలాంటప్పుడు మనుషుల హృదయాలు ఆయనకు తేటతెల్లమే.

[12] పరిహాసకుడు తనను మందలించేవాణ్ణి ప్రేమించడు. అతడు జ్ఞానుల దగ్గరికి వెళ్ళడు.

[13] ఆనందమయమైన మనసువల్ల ముఖం ప్రకాశిస్తుంది. మనోవేదన ఆత్మను కుంగదీస్తుంది.

[14] తెలివైన వారి మనసు జ్ఞానాన్వేషణ చేస్తుంది. మూర్ఖులు పలికేది మూఢత్వమే.

[15] దుర్దశలో ఉన్నవారి రోజులన్నీ కష్టతరం. మానసిక ఉల్లాసం ఎడతెగని విందు.

[16] ధనవృద్ధి ఉండి, కలవరంలో మునిగిపోయిన వారి స్థితికంటే, కొంచెమే ఉండి, యెహోవా పట్ల భయభక్తులున్న వారి స్థితి మంచిది.

[17] ద్వేషంతో వడ్డించిన మంచి మాంసం కంటే ప్రేమతో పెట్టిన పట్టెడు శాకాహారం శ్రేష్ఠం.

[18] ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పుగలవాడు వివాదాన్ని శాంతపరుస్తాడు.

[19] సోమరిపోతుల దారి ముళ్ళకంచెలాంటిది. నిజాయితీపరుల త్రోవ రాజమార్గం.

[20] జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం చేకూరుస్తాడు. మూర్ఖుడు తల్లిని తిరస్కరిస్తాడు.

[21] బుద్ధిలేని వారికి మూర్ఖత్వం సంతోషాన్ని కలిగిస్తుంది. వివేకవంతుల ప్రవర్తన చక్కనిది.

[22] ఆలోచన లేకుండా రూపొందించిన ప్రణాళికలు భగ్నమైపోతాయి. చాలామంది సలహాదారులు ఉంటే, అవి సఫలమవుతాయి.

[23] మనిషి సరైన జవాబు చెపితే అతడికి సంతోషం. సమయోచితమైన మాట ఎంత మంచిది!

[24] క్రింద ఉన్న మృత్యులోకంనుంచి తప్పించుకొనేలా వివేకవంతులు పైకి పోయే జీవ మార్గంలో నడుస్తారు.

[25] గర్విష్ఠుల ఇండ్లను యెహోవా పీకివేస్తాడు. విధవరాలి పొలిమేరలను ఆయన సుస్థిరం చేస్తాడు.

[26] చెడ్డ తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి శుద్ధం.

[27] అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంటిల్లిపాదికీ కడగండ్లు కలిగిస్తాడు. లంచాలంటే అసహ్యించుకొనేవాడు జీవిస్తాడు.

[28] సన్మార్గుల హృదయం ఎలా జవాబివ్వాలా అని ఆలోచిస్తుంది. దుర్మార్గుల నోరు చెడు మాటలు కుమ్మరిస్తుంది.

[29] దుర్మార్గులకు యెహోవా దూరంగా ఉంటాడు. సన్మార్గుల ప్రార్థన ఆయన వింటాడు.

[30] కన్నుల్లో కాంతి చూచి, హృదయం సంతోషిస్తుంది. శుభవార్త ఎముకలకు పుష్టి.

[31] జీవప్రదమైన మందలింపులు చెవిని బెట్టేవాడు జ్ఞానుల సహవాసంలో ఉండిపోతాడు.

[32] క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవారు తమను తృణీకరించుకొంటున్నారన్న మాట. మందలింపును చెవినిబెట్టేవారు బుద్ధిమంతులవుతారు.

[33] యెహోవామీది భయభక్తులు జ్ఞానాన్ని ఉపదేశిస్తాయి. వినయం గౌరవానికి దారి.

సామెతలు — Chapters