[1] అప్పుడు అగ్రిప్ప పౌలుతో “సంజాయిషీ చెప్పుకోవడానికి నీకు సెలవైంది” అన్నాడు. అప్పుడు చేయి చాచి పౌలు ఇలా సమాధానం చెప్పసాగాడు:
[2] “అగ్రిప్పరాజా, యూదులలో ఉన్న ఆచారాలూ వివాదాలూ అన్నిటిలో మీరు నిపుణులు.
[3] కనుక యూదులు నా మీద మోపిన నేరాలన్నిటిని గురించి ఈవేళ విశేషంగా మీ ఎదుట సమాధానం చెప్పుకోబోతూ ఉన్నందుచేత భాగ్యశాలిని అనుకొంటున్నాను. నేను చెప్పేది ఓపికతో వినాలని మిమ్ములను వేడుకొంటున్నాను.
[4] “నా స్వప్రజల మధ్య, జెరుసలంలో, నా యువదశ నుంచి నా జీవిత విధానం ఎలాంటిదో యూదులందరికీ తెలుసు.
[5] మొదటినుంచి నన్ను ఎరిగినవారు కావడంచేత వారు సాక్ష్యం చెప్పాలనుకొంటే, మన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్ఠానియమాలున్న తెగప్రకారం నేను పరిసయ్యుడుగా జీవించానని చెప్పగలరు.
[6] ఇప్పుడైతే దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం మీద నాకున్న ఆశాభావాన్ని బట్టి నేనిక్కడ నిలుచుండి ఈ విచారణకు గురి అయ్యాను.
[7] ఈ వాగ్దానం నెరవేర్పు అనుభవించాలని మన పన్నెండు గోత్రాలవారు ఆశతో ఎదురు చూస్తూ మనస్ఫూర్తిగా రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అగ్రిప్ప రాజా! యూదులు నా మీద నేరం మోపేది ఈ ఆశాభావం విషయమే!
[8] దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే సంగతి నమ్మరానిదని మీరు ఎందుకు భావించుకొంటున్నారు?
[9] “ఒకప్పుడు నజరేతువాడైన యేసు పేరుకు వ్యతిరేకంగా నేను అనేక క్రియాకలాపాలు చేయాలి అనుకొన్నాను.
[10] జెరుసలంలో అలాగే చేశాను కూడా. ప్రధాన యాజులు నాకిచ్చిన అధికారంతో చాలామంది పవిత్రులను చెరసాలలో వేయించాను, వారిని చంపడం జరిగితే దానికి కూడా సమ్మతించాను.
[11] యూద సమాజ కేంద్రాలన్నిటిలో తరచుగా వారిని దండిస్తూ వారిచేత బలవంతంగా దూషణ చేయించాను. వారిమీద ఎంతో ఆగ్రహంతో మండిపడుతూ విదేశీ పట్టణాలకు కూడా వెళ్ళి వారిని హింసిస్తూ వచ్చాను.
[12] “ఈ పనిమీద నేను ప్రధానయాజుల చేత అధికారం, ఆజ్ఞ పొంది దమస్కుకు ప్రయాణం కట్టాను.
[13] రాజా, మధ్యాహ్న కాలంలో నేను దారిన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా చుట్టూ, నాతోకూడా ఉన్నవారి చుట్టూ సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూశాను.
[14] మేమంతా నేలమీద పడ్డాం. అప్పుడు హీబ్రూ భాషలో ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం నాకు వినిపించింది: ‘సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు? ములుకోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం.’
[15] “నేను, ‘ప్రభూ! మీరెవరు!’ అని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు: ‘నీవు హింసిస్తూ ఉన్న యేసునే నేను.
[16] లేచి నిలబడు. నేను నీకు కనబడే కారణమేమంటే, నీవు చూచిన సంగతులను గురించీ, నేనింకా నీకు వెల్లడి చేయబోయే సంగతులను గురించీ నిన్ను పరిచారకుడుగా సాక్షిగా నియమిస్తున్నాను.
[17] నిన్ను యూదప్రజల చేతినుంచీ ఇతర ప్రజల చేతినుంచీ విడిపిస్తాను.
[18] వారు చీకటిలోనుంచి వెలుగులోకీ, సైతాను అధికారం క్రిందనుంచి దేవునివైపుకు తిరిగేలా వారి కళ్ళు తెరవడానికీ ఇప్పుడు నిన్ను వారి దగ్గరకు పంపుతున్నాను. వారికి పాపక్షమాపణ కలగాలనీ, నామీద ఉంచిన నమ్మకంచేత పవిత్రం అయినవారిలో వారికి వారసత్వం లభించాలనీ నా ఉద్దేశం.’
[19] “అందుచేత, అగ్రిప్పరాజా, పరలోక సంబంధమైన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు.
[20] మొదట దమస్కులో ఉన్నవారికి, తరువాత జెరుసలంలో, యూదయ ప్రాంత మంతటిలో ఉన్నవారికి, యూదేతరులకు కూడా ప్రకటిస్తూ వారు పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనీ, పశ్చాత్తాపానికి తగిన పనులు చేయాలనీ చెపుతూ ఉన్నాను.
[21] ఈ కారణాలనుబట్టి యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు.
[22] “అయినా దేవుని తోడ్పాటు పొంది నేటివరకూ నిలుచుండి అల్పులకూ ఘనులకూ సాక్ష్యం చెపుతూ ఉన్నాను. మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెప్పారో అవి గాక నేను మరేమీ చెప్పడం లేదు.
[23] అవేమిటంటే, క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుంచి లేచినవారిలో మొదటివాడై ఈ ప్రజకూ ఇతర ప్రజలకూ వెలుగును ప్రకటిస్తాడని.”
[24] అతడు ఇలా సమాధానం చెప్పుకొంటూ ఉన్నప్పుడే ఫేస్తస్ “పౌలు! నీకు మతి తప్పింది! అతి విద్య నిన్ను వెర్రివాణ్ణిగా చేస్తున్నది” అని పెద్ద స్వరంతో చెప్పాడు.
[25] అందుకు పౌలు “మహా ఘనులైన ఫేస్తస్‌గారు, వెర్రివాణ్ణి కాను. నేను చెప్పే మాటలు స్థిర బుద్ధికి అనుగుణమైన సత్యాలే.
[26] రాజుకు ఈ సంగతులు తెలుసు గనుక వారి ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ విషయాలలో వారు గుర్తించనిది ఏదీ లేదని నమ్ముతున్నాను. ఇదంతా మారుమూలలో జరిగినది కాదు.
[27] అగ్రిప్పరాజా! ప్రవక్తల మాటల మీద మీకు నమ్మకం ఉన్నదా? మీకున్నదని నాకు తెలుసు” అన్నాడు.
[28] అందుకు అగ్రిప్ప “నేను క్రైస్తవుడుగా అయ్యేందుకు కొద్ది కాలంలో నన్ను నచ్చచెపుతున్నావు” అని పౌలుతో చెప్పాడు.
[29] పౌలు “కొద్ది కాలంలోనో చాలా కాలంలోనో మీరే కాదు, ఈవేళ నా మాటలు వింటున్నవారంతా, ఈ సంకెళ్ళు తప్ప, నాలాగే కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నాడు.
[30] అతడు ఈ మాటలు చెప్పిన తరువాత రాజు, పాలకుడు, బెర్నీకే, వారితో కూర్చుని ఉన్నవారు లేచి అవతలకు వెళ్ళి
[31] తమలో తాము మాట్లాడుకొంటూ “ఆ మనిషి మరణానికి గానీ ఖైదుకు గానీ తగిన పని ఏదీ చేయడంలేదు” అన్నారు.
[32] అగ్రిప్ప ఫేస్తస్‌తో “చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే ఈ మనిషిని విడుదల చేయడం వీలై ఉండేది” అన్నాడు.