Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:10

[1] అయిదు రోజులైన తరువాత ప్రముఖయాజి అననీయ, పెద్దలు, తెర్తుల్లస్ అనే వక్త సీజరియకు వచ్చి పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు పాలకుడికి తెలియజేశారు.

[2] తెర్తుల్లస్‌ను మాట్లాడమని పిలవగా అతడు నిందారోపణ చేయడం మొదలుపెట్టి ఇలా అన్నాడు: “మహా ఘనులైన ఫేలిక్స్‌గారు, మీవల్ల మేము ఎంతో నెమ్మది అనుభవిస్తూ ఉన్నామనీ మీ దూరదృష్టివల్ల ఈ దేశ ప్రజలకు సౌభాగ్యం కలుగుతూ ఉందనీ

[3] మేము అన్ని విధాలుగా అన్ని స్థలాలలో సంపూర్ణ కృతజ్ఞతతో ఒప్పుకొంటూ ఉన్నాం.

[4] మీకు ఎక్కువ ఆయాసం కలిగించకుండా మేము చెప్పే కొన్ని మాటలు మీరు దయ చూపి వినాలని మిమ్ములను ప్రాధేయపడుతున్నాను.

[5] “మేము కనిపెట్టినదేమిటంటే, ఈ మనిషి చీడ పురుగులాంటివాడు, లోకమంతటా యూదులందరినీ కలహానికి రేపేవాడు, నజరేయుల మతశాఖకు నాయకుడు.

[6] ఇంతేగాక, దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకొన్నాడు. మేము వాణ్ణి పట్టుకొన్నాం.

[7] మా ధర్మశాస్త్రం ప్రకారం వాడికి తీర్పు తీర్చాలని ఆశించాం గాని సహస్రాధిపతి లూసియస్ వచ్చి చాలా బలాత్కారంతో మా చేతులలోనుంచి వాణ్ణి తీసుకుపోయి

[8] వాడిమీద నేరం మోపేవారిని మీ దగ్గరకు రావాలని ఆజ్ఞ జారీ చేశాడు. మీరు వాణ్ణి విచారణ చేయడం మూలాన మేము వాడిమీద మోపే నేరాలన్నీ మీకే తెలుస్తాయి.”

[9] అతనితో యూదులు సమ్మతిస్తూ ఈ మాటలు నిజమే అన్నారు.

[10] అప్పుడు మాట్లాడుమని పాలకుడు పౌలుకు సైగ చేశాడు గనుక అతడు ఇలా జవాబిచ్చాడు: “అనేక సంవత్సరాలనుంచి మీరు ఈ దేశ ప్రజలకు న్యాయమూర్తులని నాకు తెలుసు గనుక నేను మరెక్కువ సంతోషంతో సంజాయిషీ చెప్పుకొంటున్నాను.

[11] ఆరాధనకోసం నేను జెరుసలం వెళ్ళి పన్నెండు రోజులు మాత్రమే అయిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.

[12] దేవాలయంలో గానీ యూద సమాజకేంద్రాలలో గానీ నగరంలో గానీ ఎవరితోనైనా నేను వాదించడం, ప్రజలమధ్య అల్లరి రేపడం వీరు చూడలేదు.

[13] వీరు ఇప్పుడు నా మీద మోపే నేరాలను రుజువు చేయలేరు.

[14] “అయితే మీ ఎదుట ఒక సంగతి ఒప్పుకొంటున్నాను – వీరు మతశాఖ అని చెప్పే ఈ మార్గం ప్రకారం మా పూర్వీకుల దేవునికి సేవ చేస్తున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల లేఖనాలలో రాసి ఉన్నదంతా నమ్ముతూ ఉన్నాను.

[15] చనిపోయిన న్యాయవంతులేమీ దుర్మార్గులేమీ లేస్తారని వీరికి ఆశాభావం ఉన్నట్టే దేవుని మూలంగా నాకూ ఉంది.

[16] ఇందుచేత దేవుని ఎదుట, మనుషుల ఎదుట నాకు నిందారహితమైన అంతర్వాణి ఎప్పుడూ ఉండేలా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాను.

[17] “నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలయిన తరువాత నా స్వప్రజలకు దానధర్మాలు, కానుకలు తేవడానికి వచ్చాను.

[18] ఈ సందర్భంలో శుద్ధి చేసుకొని దేవాలయంలో ఉంటే ఆసియానుంచి వచ్చిన యూదులు కొందరు నన్ను చూశారు. నాతో గుంపు లేదు, అల్లరీ లేదు.

[19] నన్ను గురించి ప్రతికూలమైనది ఏదైనా వారికి ఉంటే వారే నా మీద నేరం మోపడానికి మీ ఎదుట ఉండి ఉండాలి.

[20] పోనీ, నేను యూద సమాలోచన సభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏమైన నేరం వారికి కనిపించి ఉంటే ఇక్కడున్న వీరైనా చెప్పాలి.

[21] వీరికి నేరంగా అనిపించినది ఈ ఒకే విషయం కావచ్చు: నేను వారిమధ్య నిలుచుండి బిగ్గరగా ఇలా అన్నాను: ‘చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఈవేళ మీ ఎదుట విచారణకు గురి అయ్యాను’.”

[22] ఈ మార్గాన్ని గురించి ఫేలిక్స్‌కు బాగా తెలుసు గనుక “సహస్రాధిపతి అయిన లూసియస్ వచ్చాక మీ సంగతిని నిర్ణయిస్తాను” అని చెప్పి తీర్పు వాయిదా వేశాడు.

[23] పౌలుకు కొంత స్వేచ్ఛ ఇస్తూ అతణ్ణి కావలిలో ఉంచాలనీ స్నేహితులెవరైనా అతని అక్కరలను తీర్చకుండా అతణ్ణి దర్శించకుండా అడ్డగించకూడదనీ శతాధిపతికి ఆజ్ఞ జారీ చేశాడు.

[24] కొన్ని రోజులయిన తరువాత ఫేలిక్స్ ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చాడు. ఆమె యూదురాలు. ఫేలిక్స్ పౌలును పిలిపించి అతడు క్రీస్తు మీది నమ్మకాన్ని గురించి చెప్పినది విన్నాడు.

[25] అతడు న్యాయం, ఆశానిగ్రహం, భవిష్యత్తులో జరిగే దేవుని తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటే, ఫేలిక్స్ భయకంపితుడై, “ఇప్పటికి వెళ్ళు. నాకు వీలైనప్పుడు నిన్ను పిలవనంపిస్తాను” అన్నాడు.

[26] తాను పౌలును విడుదల చేయడానికి అతడు తనకు డబ్బు ఇస్తాడేమో అని ఆశిస్తూ పదేపదే అతణ్ణి పిలిపించి అతనితో సంభాషించాడు.

[27] రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఫేలిక్స్ స్థానానికి పోర్కియస్ ఫేస్తస్ వచ్చాడు. అప్పుడు ఫేలిక్స్ యూదులకు దయ చూపాలని పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు.

అపొస్తలుల కార్యాలు — Chapters