Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:49

[1] మేము వారిని విడవలేక విడిచి ఓడ ఎక్కి ప్రయాణమై తిన్నగా కోస్ ద్వీపం వెళ్ళాం. మరునాడు రోద్స్ ద్వీపం చేరి అక్కడనుంచి పతర రేవుకు వెళ్ళాం.

[2] అక్కడ ఫీనీకే దేశం వెళ్ళే ఓడను చూచి దానిని ఎక్కి ప్రయాణమయ్యాం.

[3] సైప్రస్ కనబడ్డప్పుడు ఎడమ వైపున దానిని దాటిపోయి సిరియాకు వెళ్ళాం. తూరు నగరం ఓడ సరకులు దించవలసిన స్థలం గనుక అక్కడ దిగాం.

[4] శిష్యులను కనుక్కొని ఏడు రోజులు అక్కడ గడిపాం. వారు పౌలును జెరుసలం వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు.

[5] ఆ రోజులు గడిపిన తరువాత మేము ప్రయాణమై బయలుదేరినప్పుడు వారంతా భార్యలతో పిల్లలతో కూడా పట్టణం బయటికి మమ్ములను సాగనంపడానికి వచ్చారు. సముద్రం ఒడ్డున మేమంతా మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరినొకరం విడిపోయాం.

[6] మేము ఓడ ఎక్కాం, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళారు.

[7] మేము తూరునుంచి ప్రయాణం ముగించి తొలెమాయి చేరుకొన్నాం. అక్కడి సోదరులను కుశలం అడిగి వారి దగ్గర ఒక రోజు గడిపాం.

[8] మరునాడు పౌలు సహచరులైన మేము బయలుదేరి సీజరియకు చేరి శుభవార్త ప్రచారకుడైన ఫిలిప్పు ఇంటికి వెళ్ళి అతనిదగ్గర ఉండిపోయాం. అతడు ఆ ఏడుగురిలో ఒకడు.

[9] అతనికి నలుగురు కూతుళ్ళు ఉన్నారు. వారు కన్యలు, దేవునిమూలంగా పలికేవారు.

[10] మేము అక్కడ కొన్ని రోజులున్న తరువాత ఒక ప్రవక్త యూదయ నుంచి వచ్చాడు. అతని పేరు అగబు.

[11] అతడు మాదగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన కాళ్ళుచేతులు కట్టి ఇలా అన్నాడు: “ఈ నడికట్టు ఎవరిదో ఆ మనిషిని జెరుసలంలోని యూదులు ఈ విధంగా కట్టి ఇతర ప్రజ చేతికి అప్పగిస్తారని పవిత్రాత్మ చెపుతున్నాడు.”

[12] ఇది విని మేము, అక్కడివారు కూడా జెరుసలం వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం.

[13] అయితే పౌలు ఇలా జవాబిచ్చాడు: “మీరు ఇలా ఏడుస్తూ నా గుండె బ్రద్దలు చేస్తున్నారెందుకు? ప్రభువైన యేసు పేరుకోసం జెరుసలంలో బంధకాలపాలు కావడానికి మాత్రమే గాక, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.”

[14] అతడు ఒప్పించబడలేదు గనుక “ప్రభు చిత్తం జరుగుతుంది గాక” అని చెప్పి మేము ఊరుకొన్నాం.

[15] ఆ రోజులైన తరువాత సామాను సర్దుకొని జెరుసలం వెళ్ళాం.

[16] సీజరియనుంచి కొందరు శిష్యులు మాతో వచ్చి సైప్రస్‌వాడైన మనాసోన్‌ను తమతోకూడా తీసుకువచ్చారు. అతని ఇంట్లో మేము బస చేయాలని ఏర్పాటైంది. మొదటి నుంచి అతడు శిష్యుడు.

[17] మేము జెరుసలం చేరినప్పుడు సోదరులు ఆనందంతో మమ్ములను చేర్చుకొన్నారు.

[18] మరునాడు పౌలు, మేము యాకోబు దగ్గరకు వెళ్ళాం. పెద్దలందరూ అక్కడ ఉన్నారు.

[19] అతడు వారిని కుశలమడిగి తన సేవద్వారా ఇతర ప్రజలలో దేవుడు చేసినవాటిని వివరంగా చెప్పాడు.

[20] అది విని వారు ప్రభువును స్తుతించారు, అప్పుడు అతనితో ఇలా అన్నారు: “సోదరుడా! యూదులలో ఎన్ని వేలమంది విశ్వాసులయ్యారో నీకు కనిపిస్తూ ఉంది గదా. ధర్మశాస్త్రం అంటే వారందరికీ ఆసక్తి.

[21] వారు నిన్ను గురించి విన్న కబురేమిటంటే, ఇతర ప్రజలలో ఉన్న యూదులందరికీ మోషే ఉపదేశాన్ని విడిచి తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాల ప్రకారం నడుచుకోకూడదనీ నేర్పుతున్నావట.

[22] అయితే ఏం? సంఘం తప్పక సమావేశం అవుతుంది. ఎందుకంటే నీవు వచ్చిన సంగతి వారు వింటారు.

[23] అందుచేత మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి చెల్లించవలసిన పురుషులు నలుగురు మా దగ్గర ఉన్నారు.

[24] నీవు వారిని తీసుకువెళ్ళి వారితోకూడా శుద్ధి కార్యంలో పాల్గొను. వారి తలవెంట్రుకలు గొరిగించుకొనే ఖర్చులు పెట్టుకో. అప్పుడు నీ గురించి వారు విన్న వదంతులలో సత్యమేమీ లేదనీ నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యథాక్రమంగా నడుచుకొంటున్నావనీ అందరూ తెలుసుకొంటారు.

[25] ఇతర ప్రజలలో నమ్ముకొన్నవారి విషయం చెప్పాలంటే, వారు అలాంటి దాన్ని ఆచరించకూడదనీ విగ్రహాలకు అర్పితమైన వాటినుంచి రక్తంనుంచి గొంతు పిసికి చంపిన దానినుంచి వ్యభిచారం నుంచి తమను దూరంగా ఉంచుకోవాలని మాత్రం మేము నిర్ణయించి వారికి రాశాం.”

[26] మరునాడు పౌలు ఆ మనుషులను తీసుకువెళ్ళి వారితోపాటు శుద్ధికార్యంలో పాల్గొని దేవాలయంలోకి వెళ్ళి శుద్ధి గడువు తీరి వారిలో ఒక్కొక్కరికోసం కానుక అర్పించబోయే రోజు తెలియజేశాడు.

[27] ఆ ఏడు రోజులు కావచ్చినప్పుడు ఆసియా రాష్ట్రం నుంచి వచ్చిన యూదులు అతణ్ణి దేవాలయంలో చూశారు. అక్కడి సమూహమంతటినీ వారు పురికొలిపి అతణ్ణి పట్టుకొని ఇలా కేకలు పెట్టారు:

[28] “ఇస్రాయేల్ మనుషులారా, సహాయం చేయండి! మన ప్రజలకూ ధర్మశాస్త్రానికీ ఈ స్థలానికీ వ్యతిరేకంగా అందరికీ అంతటా బోధించేవాడు ఈ మనిషే! అంతేగాక, గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకువచ్చి ఈ పవిత్ర స్థానాన్ని అశుద్ధం చేశాడు!”

[29] అంతకుముందు ఎఫెసు నివాసి త్రోఫిమస్ అతనితో నగరంలో ఉండడం వారు చూచినందుచేత పౌలు అతణ్ణి దేవాలయంలోకి తీసుకువచ్చాడని అనుకొన్నారు.

[30] నగర మంతా రెచ్చిపోయింది. ప్రజలు ఒకటిగా పరుగెత్తుకువచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలోనుంచి బయటికి ఈడ్చుకుపోయారు. వెంటనే తలుపులు మూయడం జరిగింది.

[31] వారు అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటే జెరుసలమంతా అల్లరిగా ఉందని రోమ్ పటాలం అధిపతికి కబురు అందింది.

[32] తక్షణమే అతడు సైనికులనూ శతాధిపతులనూ వెంటబెట్టుకొని వారి దగ్గరకు పరుగెత్తుకువచ్చాడు. ఆ సహస్రాధిపతినీ సైనికులనూ చూచి వారు పౌలును కొట్టడం మానారు.

[33] సహస్రాధిపతి దగ్గరకు వచ్చి అతణ్ణి పట్టుకొని రెండు సంకెళ్ళతో బంధించాలని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు “వీడెవడు? ఏం చేశాడు?” అని అడిగాడు.

[34] గుంపులో కొంతమంది అలా, కొంతమంది ఇలా కేకలు పెట్టారు. అల్లరిగా ఉండడంచేత నిజం తెలుసుకోలేక అతడు పౌలును కోటలోకి తీసుకుపోవాలని ఆజ్ఞ జారీ చేశాడు.

[35] మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు అల్లరిమూక బలాత్కారం కారణంగా సైనికులు పౌలును మోసుకుపోవలసి వచ్చింది.

[36] ఎందుకంటే “వాణ్ణి చంపెయ్యండి” అని అరుస్తూ జనసమూహం వెంటబడుతూ ఉంది.

[37] పౌలును కోటలోకి తీసుకుపోతూ ఉంటే అతడు “మీతో ఒక మాట చెప్పవచ్చా?” అని సహస్రాధిపతిని అడిగాడు.

[38] అతడు “గ్రీకు భాష నీకు వస్తుందా? కొంతకాలం కిందట తిరుగుబాటు రేపి నాలుగు వేలమంది హంతకులను ఎడారికి తీసుకుపోయిన ఈజిప్ట్ మనిషివి కావా నీవు?” అని అడిగాడు.

[39] అందుకు పౌలు “నేను యూదుణ్ణి, కిలికియలోని తార్సువాణ్ణి, ఆ అసాధారణమైన పట్టణం పౌరుణ్ణి. ప్రజలతో మాట్లాడడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి” అన్నాడు.

[40] అతడు అనుమతి ఇచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలుచుండి ప్రజలకు చేసైగ చేశాడు. అంతటా గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడతడు వారితో హీబ్రూ భాషలో ఇలా అన్నాడు:

అపొస్తలుల కార్యాలు — Chapters