Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:46

[1] ఫేస్తస్ ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజులకు సీజరియనుంచి జెరుసలంకు వెళ్ళాడు.

[2] అక్కడ ప్రముఖయాజీ యూదులలో ముఖ్యులూ పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు విషయం అతనికి తెలియజేసి,

[3] “దయ ఉంచి అతణ్ణి జెరుసలంకు పిలవనంపించండి” అని అతణ్ణి గురించి మనవి చేసి ఫేస్తస్‌ను ప్రాధేయ పడ్డారు. త్రోవలో పౌలును చంపడానికి వారు మాటులో ఉంటారని వారి కుట్ర.

[4] అయితే ఫేస్తస్ పౌలు సీజరియలో కావలిలో ఉంచబడాలనీ తాను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నానని జవాబిచ్చాడు.

[5] “కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు. ఆ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతనిమీద నేరారోపణ చేయవచ్చు” అన్నాడు.

[6] వారి మధ్య పది రోజులకంటే ఎక్కువ కాలం గడిపి అతడు సీజరియకు వెళ్ళాడు. మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును రప్పించమని ఆజ్ఞ జారీ చేశాడు.

[7] అతడు వచ్చిన తరువాత, జెరుసలం నుంచి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలుచుండి పౌలుమీద అనేక తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేకపోయారు.

[8] అందుకు పౌలు “యూదుల ధర్మశాస్త్రానికి గానీ దేవాలయానికి గానీ చక్రవర్తికి గానీ వ్యతిరేకంగా నేను తప్పిదమేమీ చేయలేదు” అని సమాధానం చెప్పుకొన్నాడు.

[9] అయితే ఫేస్తస్ యూదులకు దయ చూపాలని పౌలుకు జవాబిస్తూ ఇలా అన్నాడు: “జెరుసలంకు వెళ్ళి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విచారణకు నిలబడడానికి సమ్మతిస్తావా?”

[10] అందుకు పౌలు ఇలా అన్నాడు: “చక్రవర్తికి చెందిన న్యాయపీఠం ముందు నిలుచున్నాను. నాకు విచారణ జరగవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని మీకు బాగా తెలుసు.

[11] ఒకవేళ నేను అక్రమస్థుణ్ణయి మరణానికి తగినదేదైనా చేసి ఉంటే మరణించడానికి వెనుకంజ వేయను. కానీ వీరు నామీద మోపే నేరాలు వట్టివైతే నన్ను వీరి చేతికి అప్పగించే అధికారం ఎవరికీ లేదు. చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటాను.”

[12] అప్పుడు ఫేస్తస్ తన సలహాదారులతో ఆలోచన చేసి “చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటాను అన్నావా? అలాగే, చక్రవర్తి దగ్గరికే వెళ్ళిపోతావు” అని జవాబిచ్చాడు.

[13] కొన్ని రోజులు గడిచిన తరువాత ఫేస్తస్‌ను దర్శించడానికి రాజైన అగ్రిప్ప బెర్నీకేతోపాటు సీజరియకు వచ్చాడు.

[14] వారు అక్కడ చాలా రోజులు ఉండిపోయారు. అప్పుడు ఫేస్తస్ పౌలు సంగతి రాజుకు ఈ విధంగా తెలియజేశాడు: “ఫేలిక్స్ విడిచి పెట్టిపోయిన ఖైదీ ఒకడు ఇక్కడ ఉన్నాడు.

[15] నేను జెరుసలంలో ఉన్నప్పుడు ప్రధానయాజులూ యూదుల పెద్దలూ అతడి విషయం తెలియజేస్తూ నేను అతడికి శిక్ష విధించాలని కోరారు.

[16] వారికి నేనిచ్చిన జవాబేమిటంటే, ‘ముద్దాయి ఎవరైనా సరే తనమీద నేరం మోపిన వారికి ముఖా ముఖిగా నిలబడి తన మీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషీ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతకుముందు అతణ్ణి నాశనానికి అప్పగించడం రోమ్వారి విధానం కాదు.’

[17] “వారు ఇక్కడ సమకూడినప్పుడు నేనేమీ ఆలస్యం చేయలేదు. మరునాడే న్యాయపీఠంమీద కూర్చుని ఆ మనిషిని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను.

[18] నేరం మోపినవారు నిలబడ్డప్పుడు నేననుకొన్న నేరాలలో ఒక్కటి కూడా అతనిమీద మోపారు కారు.

[19] అయితే తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వారికి కొన్ని వివాదాలున్నాయి. ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెప్పాడు.

[20] అలాంటి వివాదాల గురించి నాకు అనుమానంగా ఉంది గనుక జెరుసలంకు వెళ్ళి అక్కడ ఈ సంగతులను గురించి విచారణకు గురి కావడానికి అతనికి సమ్మతి ఉందో లేదో అని అతణ్ణి అడిగాను.

[21] అయితే చక్రవర్తి ఎదుట తీర్పు జరిగేంతవరకు తనను కావలిలో ఉంచాలని పౌలు చెప్పుకొన్నాడు గనుక నేనతణ్ణి సీజర్ దగ్గరికి పంపేవరకు కావలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాను.”

[22] అప్పుడు అగ్రిప్ప “ఆ మనిషి చెప్పేది నాక్కూడా వినాలని ఉంది” అని ఫేస్తస్‌తో అన్నాడు. అందుకతడు “రేపు వింటారు” అన్నాడు.

[23] ఆ మరునాడే అగ్రిప్ప, బెర్నీకే గొప్ప ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతో నగర ప్రముఖులతో సభామంటపంలో ప్రవేశించారు. ఫేస్తస్ ఆజ్ఞ ఇయ్యగా పౌలును లోపలికి తేవడం జరిగింది.

[24] అప్పుడు ఫేస్తస్ అన్నాడు “అగ్రిప్పరాజా! ఇక్కడ మాతో ఉన్నవారలారా! మీరంతా ఈ మనిషిని చూస్తూ ఉన్నారు. జెరుసలంలోనూ ఇక్కడ కూడా యూదులంతా ఇతడు ఇక బతకతగడని కేకలు వేస్తూ అతని గురించి నాతో మనవి చేశారు.

[25] అయితే ఇతడు మరణ శిక్షకు తగినది ఏదీ చేయలేదని గ్రహించాను. చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటానని ఇతడు చెప్పినందుచేత ఇతణ్ణి పంపాలని నిర్ణయానికి వచ్చాను.

[26] అయినా నేను నా ఏలినవారికి రాయడానికి ఇతని గురించి నిశ్చయమైనది ఏదీ లేదు. కాబట్టి, ఈ విచారణ ఫలితంగా రాయగలిగేదేదైనా దొరకవచ్చునని మీ అందరి ఎదుటికీ, ముఖ్యంగా, అగ్రిప్పరాజా, మీ ఎదుటికి ఇతణ్ణి రప్పించాను.

[27] ఖైదీమీద మోపిన నేరాలేవో సూచించక, అతణ్ణి అలాగే పంపడం తెలివి లేని పని అని నాకు తోస్తుంది.”

అపొస్తలుల కార్యాలు — Chapters