Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:02

[1] ఈకొనియలో ఇలా జరిగింది. వారు కలిసి యూదుల సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఏ విధంగా మాట్లాడారంటే పెద్ద సమూహంగా ఉన్న యూదులూ గ్రీసుదేశస్థులూ యేసుప్రభువును నమ్మారు.

[2] కానీ నమ్మని యూదులు యూదేతరులను పురికొలిపి వారి మనసులో సోదరులమీద వ్యతిరేక భావం కలిగించారు.

[3] అందుచేత పౌలు బర్నబాలు ప్రభు సహాయం ద్వారా ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిచేత సూచకమైన అద్భుతాలూ వింతలూ జరిగించడం మూలంగా తన కృపమయమైన వాక్కు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు.

[4] ఆ పట్టణం జన సమూహాలమధ్య పరస్పర భేదాలు కలిగాయి. కొంతమంది యూదుల పక్షం వహించారు, మరి కొంతమంది అయితే క్రీస్తు రాయబారుల పక్షం వహించారు.

[5] యూదులూ, యూదులు కానివారూ తమ అధికారులతోపాటు వారిపై దౌర్జన్యం చేసి రాళ్ళు రువ్వి చంపడానికి పూనుకొన్నారు.

[6] ఆ సంగతి తెలిసి వారు లుకయొనియలో ఉన్న లుస్త్ర, దెర్బే అనే పట్టణాలకూ వాటి చుట్టుపట్ల ఉన్న ప్రాంతానికీ తప్పించుకు వెళ్ళారు.

[7] అక్కడ కూడా వారు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నారు.

[8] లుస్త్రలో పుట్టు కుంటివాడొకడు కూర్చుని ఉన్నాడు. కాళ్ళలో సత్తువ లేక అతడు ఎన్నడూ నడవలేదు.

[9] పౌలు మాట్లాడుతూ ఉంటే అతడు విన్నాడు. పౌలు అతనివైపు తేరి చూచి స్వస్థత పొందడానికి అతనికి నమ్మకం ఉందని గ్రహించి

[10] “లేచి చక్కగా నిలబడు!” అని బిగ్గరగా చెప్పాడు. అతడు తటాలున లేచి నడవడం మొదలు పెట్టాడు.

[11] పౌలు చేసినది ప్రజా సమూహాలు చూచి కంఠమెత్తి లుకయొనియ భాషలో ఇలా అన్నారు: “దేవుళ్ళు మానవ రూపం దాల్చి మనదగ్గరికి దిగివచ్చారు.”

[12] వారు బర్నబాను “జూస్” అన్నారు, పౌలు ముఖ్య ప్రసంగికుడు కావడంచేత అతణ్ణి “హెర్మిస్” అన్నారు.

[13] జూస్ గుడి ఒకటి ఆ పట్టణానికి ముందుగా ఉంది. దాని పూజారి ఎద్దులనూ పూదండలనూ నగర ద్వారాలకు తీసుకువచ్చాడు. అతడు ప్రజల గుంపులతో కూడా వారికి బలి అర్పించాలని కోరాడు.

[14] ఈ సంగతి విని రాయబారులైన పౌలు బర్నబాలు తమ బట్టలు చింపుకొని గుంపులలోకి చొరబడి బిగ్గరగా ఇలా అన్నారు:

[15] “అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం.

[16] గత కాలాలలో ఆయన అన్ని జాతులవారిని తమ తమ మార్గాలలో నడవనిచ్చాడు.

[17] అయినా ఆయన తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎలాగంటే మనకు ఆకాశంనుంచి వానలూ ఫలవంతమైన రుతువులూ ప్రసాదిస్తూ ఆహారంతోనూ ఉల్లాసంతోనూ మన హృదయాలను తృప్తిపరుస్తూ మంచి చేస్తూ వచ్చాడు.”

[18] వారు ఇలా చెప్పినా తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం కష్టసాధ్యమైంది.

[19] తరువాత అంతియొకయ నుంచీ ఈకొనియ నుంచీ కొంతమంది యూదులు వచ్చి ఆ గుంపులను ప్రేరేపించారు. పౌలుమీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకొని అతణ్ణి పట్టణం వెలుపలికి ఈడ్చుకుపోయారు.

[20] అయితే అతని చుట్టూరా శిష్యులు గుమికూడినప్పుడు అతడు లేచి పట్టణంలో ప్రవేశించాడు. మర్నాడు బర్నబాతో దెర్బేకు వెళ్ళాడు.

[21] ఆ పట్టణంలో వారు శుభవార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు. ఆ తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వెళ్ళి,

[22] శిష్యులను స్థిరపరచి విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రోత్సహించారు. “అనేక బాధలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి” అన్నారు.

[23] వారు ప్రతి సంఘంలో వారికోసం పెద్దలను నియమించారు, ఉపవాసముండి ప్రార్థన చేస్తూ వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.

[24] తరువాత పిసిదియ గుండా ప్రయాణం చేసి పంఫూలియ చేరారు.

[25] పెర్గేలో వాక్కు ప్రకటించిన తరువాత అత్తాలియకు వెళ్ళారు.

[26] అక్కడ ఓడ ఎక్కి తాము ఇప్పుడు నెరవేర్చిన పనికోసం ఏ అంతియొకయలో దేవుని కృపకు తమను అప్పగించడం జరిగిందో ఆ అంతియొకయకు తిరిగి వెళ్ళారు.

[27] అక్కడ చేరినప్పుడు వారు క్రీస్తు సంఘాన్ని సమకూర్చి దేవుడు తమచేత జరిగించినదంతటినీ ఇతర ప్రజలకు ఆయన విశ్వాస ద్వారం తెరిచిన సంగతినీ వివరించి చెప్పారు.

[28] తరువాత వారు శిష్యుల దగ్గర చాలా కాలం గడిపారు.

అపొస్తలుల కార్యాలు — Chapters