[1] పౌలు ఆ సమాలోచన సభవైపు తేరి చూస్తూ “అయ్యలారా, సోదరులారా, నేను నేటివరకు దేవుని ఎదుట పూర్తిగా మంచి అంతర్వాణితో బ్రతికాను” అన్నాడు.
[2] అందుకు ప్రముఖయాజి అననీయ “వాడి నోటిమీద కొట్టండి” అని అతని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు.
[3] పౌలు అతనితో “వెల్ల వేసిన గోడా! దేవుడే నిన్ను కొడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని ఉండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టాలని ఆజ్ఞ ఇస్తున్నావా?” అన్నాడు.
[4] దగ్గర నిలుచున్నవారు “దేవుని ప్రముఖయాజిని దూషిస్తున్నావేమిటి!” అన్నారు.
[5] అందుకు పౌలు “సోదరులారా, అతడు ఉన్నతయాజి అని నాకు తెలియలేదు. ‘మీ ప్రజల అధికారులలో ఎవరినీ నిందించకూడదు’ అని రాసి ఉంది” అన్నాడు.
[6] వారిలో కొందరు సద్దూకయ్యులు, మరికొందరు పరిసయ్యులు అని పౌలు తెలుసుకొన్నప్పుడు సభలో ఇలా బిగ్గరగా చెప్పాడు: “అయ్యలారా, సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుడి కొడుకును. చనిపోయినవారు సజీవంగా లేస్తారనే దాని గురించి, వారి ఆశాభావాన్ని గురించి ఈ విచారణకు గురి అయ్యాను.”
[7] అతడా మాట చెప్పినప్పుడు పరిసయ్యులకూ సద్దూకయ్యులకూ మధ్య కలహం పుట్టింది. సమావేశం రెండు పక్షాలయింది.
[8] ఎందుకంటే చనిపోయినవారు లేవడం, దేవదూత, ఆత్మ అనేవి లేవనీ సద్దూకయ్యులంటారు. ఇవన్నీ ఉన్నాయని పరిసయ్యులంటారు.
[9] కనుక పెద్ద అలజడి రేగింది. పరిసయ్యుల శాఖలో ధర్మశాస్త్ర పండితులు నిలబడి గట్టిగా వాదిస్తూ ఇలా అన్నారు: “ఈ మనిషిలో దుర్మార్గత అంటూ మాకు ఏమీ కనిపించడం లేదు. ఒక వేళ అతనితో ఏదైనా ఆత్మ గానీ, ఒక దేవదూత గానీ మాట్లాడి ఉంటే, మనం దేవునికి విరుద్ధంగా పోట్లాడకూడదు.”
[10] జగడం అధికంగా పెరిగిపోయింది. వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి “వెళ్ళి వాళ్ళ మధ్యనుంచి అతణ్ణి బలవంతంగా తీసుకొని కోటలోకి తేవాలి” అని అతడు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
[11] ఆ రాత్రి పౌలు దగ్గర ప్రభువు నిలుచుండి “పౌలు, ధైర్యంగా ఉండు. జెరుసలంలో నన్ను గురించి నీవెలా సాక్ష్యం చెప్పావో అలాగే రోమ్‌లో కూడా సాక్ష్యం చెప్పాలి” అన్నాడు.
[12] ఉదయమైనప్పుడు యూదులు కొందరు కుట్ర పన్ని తాము పౌలును చంపేవరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టు పెట్టుకొన్నారు.
[13] కుట్రలో చేరినవారి సంఖ్య నలభై కంటే ఎక్కువ.
[14] వారు ప్రధాన యాజుల దగ్గరకు, పెద్దలదగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: “పౌలును చంపేవరకు దేనినీ తినమని గంబీరంగా ఒట్టు పెట్టుకొన్నాం.
[15] గనుక మీరూ సమాలోచన సభవారూ అతడి గురించి ఇంకా ఖచ్చితంగా విచారణ చేయవలసి ఉన్నట్టు రేపు అతణ్ణి మీ దగ్గరికి తీసుకురమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. వాడు ఈ స్థలం దగ్గరికి రాకముందే అతణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నాం.”
[16] అయితే వారు అలా పొంచి ఉంటారని పౌలు మేనల్లుడు విని కోటలోకి వచ్చి పౌలుకు తెలియజేశాడు.
[17] పౌలు శతాధిపతులలో ఒకణ్ణి తన దగ్గరకు పిలిచి “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు తీసుకువెళ్ళండి. ఇతడు అతనితో చెప్పుకోవలసినది ఒకటి ఉంది” అన్నాడు.
[18] అలాగే శతాధిపతి ఆ పై అధిపతి దగ్గరకు అతణ్ణి తీసుకువెళ్ళి “ఖైదీ పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరికి తీసుకువెళ్ళమని అడిగాడు. మీతో ఇతడు ఏదో చెప్పుకోవాలని ఉన్నాడు” అన్నాడు.
[19] సహస్రాధిపతి యువకుడి చేయి పట్టుకొని అవతలకు తీసుకువెళ్ళి “నీవు నాతో చెప్పాలి అనుకొన్నదేమిటి?” అని ఏకాంతంగా అడిగాడు.
[20] అందుకతడు “యూదులు పౌలును గురించి ఇంకా ఖచ్చితంగా విచారించవలసి ఉన్నట్టు రేపు అతణ్ణి తమ సమాలోచన సభ దగ్గరికి తీసుకురమ్మని మిమ్ముల్ని అడగడానికి సమ్మతించారు.
[21] వారి మాటకు లొంగిపోకండి! ఎందుకంటే, వారిలో నలభైకంటే ఎక్కువమంది అతనికోసం పొంచి ఉన్నారు. ఆ మనుషులు కుట్రపన్ని అతణ్ణి చంపేవరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టుపెట్టుకొన్నారు. ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి మీ మాటకోసం ఎదురుచూస్తూ ఉన్నారు” అన్నాడు.
[22] అందుకు సహస్రాధిపతి “ఈ సంగతి నాకు తెలియజేశావని ఎవరితో అనకు” అని ఆదేశించి ఆ యువకుణ్ణి పంపివేశాడు.
[23] తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని పిలిచి “సీజరియకు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళడానికి రెండు వందలమంది సైనికులను, డెబ్భైమంది రౌతులను, రెండు వందలమంది ఈటెలవారిని సిద్ధం చేయండి.
[24] పౌలును పాలకుడైన ఫేలిక్స్ దగ్గరకు భద్రంగా తీసుకుపోయేందుకు అతణ్ణి ఎక్కించడానికి గుర్రాలను కూడా సిద్ధం చేయండి” అన్నాడు.
[25] అప్పుడతడు ఈ లేఖ వ్రాశాడు:
[26] “మహా ఘనులైన పాలకుడు ఫేలిక్స్‌కు క్లౌదియస్ లూసియస్ అభివందనాలు.
[27] ఈ మనిషిని యూదులు పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమ్ పౌరుడని విని నేను సైనికులతో వచ్చి అతణ్ణి తప్పించాను.
[28] వారు అతనిమీద మోపిన నేరమేమో తెలుసుకోవాలని వారి సమాలోచన సభ దగ్గరికి అతణ్ణి తీసుకువెళ్ళాను.
[29] నేను కనుగొన్నదేమిటంటే, తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి వారు అతని మీద నేరారోపణ చేసినా మరణశిక్షకు గానీ ఖైదుకు గానీ తగిన నేరం మోపలేదు.
[30] ఈ మనిషి కోసం యూదులు పొంచి ఉన్నారని నాకు తెలియవచ్చింది గనుక వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. అతని మీద నేరం మోపినవారు మీ ఎదుటే అతనిమీద నేరారోపణ చేయాలని ఆజ్ఞ జారీ చేశాను. ఇంతే సంగతులు.”
[31] అందుచేత తమకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సైనికులు రాత్రివేళ పౌలును అంతిపత్రిస్‌కు తీసుకువెళ్ళారు.
[32] మరునాడు అతనితోకూడా వెళ్ళడానికి రౌతులను వదిలివేసి వారు కోటకు తిరిగి వెళ్ళారు.
[33] రౌతులు సీజరియకు వెళ్ళి పాలకుడికి ఆ లేఖ అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టారు.
[34] పాలకుడు ఆ లేఖ చదివి “ఇతడు ఏ ప్రదేశంవాడు?” అని అడిగి, కిలికియ ప్రదేశమని తెలుసుకొన్నాడు.
[35] అప్పుడతడు “నీమీద నేరం మోపేవారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి విచారణ చేస్తాను” అని చెప్పి హేరోదు భవనంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాడు.