Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:44

[1] యూదులు కానివారు కూడా దేవుని వాక్కు అంగీకరించారని క్రీస్తు రాయబారులూ యూదయలో ఉన్న సోదరులూ విన్నారు.

[2] పేతురు జెరుసలంకు వచ్చినప్పుడు సున్నతి గలవారు అతనితో వాదం పెట్టుకొని,

[3] “సున్నతి పొందనివారి దగ్గరికి వెళ్ళి వారితో భోజనం చేశావు!” అన్నారు.

[4] అందుకు పేతురు మొదటినుంచి జరిగిన విషయమంతా వరుసగా వారికిలా వివరించి చెప్పాడు:

[5] “నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉంటే పారవశ్యంలో నాకు దర్శనం కలిగింది. పెద్ద దుప్పటి లాంటిదానిని దాని నాలుగు చెంగులు పట్టి ఆకాశం నుంచి దించడం చూశాను. అది నా దగ్గరికే వచ్చింది.

[6] నేను దానిలోకి పరిశీలనగా తేరిచూస్తూ ఉంటే నాలుగు కాళ్ళున్న భూజంతువులూ అడవి మృగాలూ ప్రాకే ప్రాణులూ గాలిలో ఎగిరే పక్షులూ కనిపించాయి.

[7] “అప్పుడు ‘పేతురూ! లే! చంపుకొని తిను!’ అని నాతో చెప్పిన స్వరం వినిపించింది.

[8] అందుకు నేను అన్నాను, ‘అలా కాదు, ప్రభూ! నిషిద్ధమైనది, అశుద్ధమైనది ఏదీ నా నోట ఎన్నడూ పడలేదు’.

[9] రెండోసారి పరలోకంనుంచి ఆ వాణి వినిపించింది, ‘దేవుడు శుద్ధం చేసినవాటిని నీవు నిషిద్ధం అనకూడదు’.

[10] ముమ్మారు ఈ విధంగా సంభవించింది. అప్పుడు అదంతా ఆకాశానికి ఎత్తడం జరిగింది.

[11] “వెంటనే సీజరియనుంచి నా దగ్గరకు పంపిన ముగ్గురు మనుషులు నేనున్న ఇంటి ఎదుట చేరి నిలిచారు.

[12] సందేహించక వారితో వెళ్ళిపొమ్మని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. ఈ ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేము ఆ మనిషి ఇంట్లో ప్రవేశించాం.

[13] అతడు మాకు తెలియజేసినది ఏమిటంటే, తన ఇంట్లో నిలుచున్న ఒక దేవదూతను చూశాడు. దేవదూత ఇలా అన్నాడు: ‘యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరుగల సీమోనును పిలిపించుకో.

[14] అతడు మీతో చెప్పే మాటలద్వారా నీకూ నీ ఇంటివారికీ పాపవిముక్తి కలుగుతుంది.’

[15] “నేను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు పవిత్రాత్మ ఆరంభంలో మనమీదికి దిగివచ్చినట్లే వారిమీదికి దిగివచ్చాడు.

[16] ‘యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు గాని మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది.

[17] ప్రభువైన యేసు క్రీస్తుమీద నమ్మకం ఉంచిన మనకు అనుగ్రహించిన ఉచిత వరమే దేవుడు వారికి కూడా అనుగ్రహించాడంటే దేవుణ్ణి అడ్డగించడానికి నేనేపాటివాణ్ణి?”

[18] ఈ మాటలు విని వారు మరేమీ అభ్యంతరం చెప్పక “అలాగైతే జీవానికి దారితీసే పశ్చాత్తాపం దేవుడు ఇతర ప్రజలకు కూడా దయ చేశాడు” అంటూ దేవుణ్ణి స్తుతించారు.

[19] స్తెఫను విషయంలో కలిగిన హింస కారణంగా చెదరిపోయినవారు ఫీనీకే, సైప్రస్, అంతియొకయ ప్రదేశాలవరకు వెళ్ళిపోతూ వాక్కు యూదులకు మాత్రమే చెపుతూ ఉన్నారు.

[20] అయితే వారిలో కొంతమంది సైప్రస్ పౌరులు, కురేనె పౌరులు. వారు అంతియొకయకు వెళ్ళి గ్రీసు దేశస్తులతో కూడా మాట్లాడుతూ యేసుప్రభువును ప్రకటించారు.

[21] ప్రభు హస్తం వారికి తోడై ఉంది గనుక అనేకులు నమ్మి ప్రభువు వైపుకు మళ్ళారు.

[22] ఈ విషయాల గురించిన మాట జెరుసలంలోని సంఘానికి వినవచ్చింది. వారు బర్నబాను అంతియొకయ వరకు వెళ్ళాలని పంపారు.

[23] అతడు వచ్చి దేవుని కృపను చూచి ఆనందించాడు, ప్రభువుతో హృదయపూర్వకంగా స్థిరంగా నిలిచివుండాలని వారందరినీ ప్రోత్సహించాడు.

[24] అతడు మంచివాడు. పవిత్రాత్మతోను విశ్వాసంతోను నిండి ఉన్నవాడు గనుక చాలామంది ప్రభువు పక్షం చేరారు.

[25] తరువాత బర్నబా పౌలును వెదకడానికి తార్సుకు వెళ్ళాడు.

[26] అతణ్ణి కనుగొని అతణ్ణి అంతియొకయకు తీసుకువచ్చాడు. ఒక సంవత్సరమంతా వారు సంఘంతో కలుసుకొంటూ అనేకులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అంతియొకయలోనే మొదటిసారిగా శిష్యులను “క్రైస్తవులు” అనడం జరిగింది.

[27] ఆ రోజులలో ప్రవక్తలు కొందరు జెరుసలంనుంచి అంతియొకయకు వచ్చారు.

[28] వారిలో ఒకడైన అగబు అనేవాడు నిలబడి లోకమంతటికీ గొప్ప కరవు వస్తుందని దేవుని ఆత్మమూలంగా సూచించాడు. అది క్లౌదియ సీజర్ పరిపాలన కాలంలో జరిగింది.

[29] అప్పుడు శిష్యులు తమలో ప్రతి ఒక్కరూ శక్తికొలది ఇచ్చి యూదయలో కాపురమున్న సోదరుల సహాయంకోసం పంపాలని నిశ్చయించుకొన్నారు.

[30] వారు అలా చేసి బర్నబా సౌలుల చేతుల్లో ఉంచి ఆ సొమ్మును అక్కడి పెద్దల దగ్గరకు పంపించారు.

అపొస్తలుల కార్యాలు — Chapters