Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:10

[1] ఓ తియొఫిలస్, యేసు ఏమేమి చేయడానికీ ఉపదేశించడానికీ మొదలుపెట్డాడో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకం వ్రాశాను.

[2] ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళడం జరిగేవరకూ ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు. చివరికి తాను ఎన్నుకొన్న రాయబారులకు పవిత్రాత్మ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు.

[3] ఆయన బాధల తరువాత అనేక రుజువులచేత తనను సజీవంగా వారికి కనపరచుకొన్నాడు. నలభై రోజులపాటు ఆయన వారికి కనబడుతూ దేవుని రాజ్యానికి చెందే విషయాలను గురించి ఉపదేశించాడు.

[4] ఆయన వారితో సమావేశమై వారు జెరుసలం విడిచి వెళ్ళకూడదనీ తండ్రి వాగ్దానం చేసినదాని కోసం చూస్తూ ఉండాలనీ వారికి ఆజ్ఞాపించాడు, “దాని గురించి నా వల్ల మీరు విన్నారు.

[5] యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు” అన్నాడు.

[6] వారు అలా సమకూడినప్పుడు “ప్రభూ, నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని ఆయనను అడిగారు.

[7] అందుకు ఆయన వారితో అన్నాడు “తండ్రి తన అధికారంచేత కాలాలూ సమయాలూ నిర్ణయించాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.

[8] అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బలప్రభావాలు పొందుతారు. జెరుసలంలో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు, భూమి కొనలవరకూ కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు.”

[9] ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వారు చూస్తూ ఉండగానే ఆయనను పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన వారి కండ్లకు కనిపించకుండా మేఘం ఒకటి ఆయనను ఎత్తుకు పోయింది.

[10] ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశంవైపు తేరి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఇలా అన్నారు:

[11] “గలలీ మనుషులారా! మీరెందుకు నిలుచుండి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు? మీ దగ్గరనుంచి యేసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది. ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు.”

[12] అప్పుడు శిష్యులు ఆలీవ్ కొండ నుంచి జెరుసలంకు తిరిగి వచ్చారు. ఆ కొండ జెరుసలంకు దగ్గరగా విశ్రాంతి దినాన నడవతగినంత దూరాన ఉంది.

[13] పట్టణం చేరి వారు బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్‌తొలొమయి, మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తీవ్రవాది సీమోను, యాకోబు కొడుకు యూదా.

[14] వీరంతా, వీరితోకూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళు ఏక మనసుతో నిలకడగా ప్రార్థన, విన్నపాలు చేస్తూ ఉన్నారు.

[15] సమకూడినవారి పేర్ల సంఖ్య సుమారు నూట ఇరవైమంది. ఆ కాలంలో ఆ శిష్యుల మధ్య పేతురు నిలబడి ఇలా అన్నాడు:

[16] “సోదరులారా, యేసును పట్టుకొన్నవారికి దారి చూపిన యూదాను గురించి పవిత్రాత్మ దావీదు ద్వారా పూర్వం పలికించిన లేఖనం నెరవేరవలసి వచ్చింది.

[17] అతడు మనలో ఒకడుగా ఎంచబడి ఈ సేవలో భాగస్థుడయ్యాడు.

[18] (దుర్మార్గంవల్ల లభించిన డబ్బుచేత ఈ మనిషి ఒక పొలం కొన్నాడు. వాడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలయ్యాడు. వాడి పేగులన్నీ బయటికి వచ్చాయి.

[19] ఈ సంగతి జెరుసలంలో కాపురమున్న వారంతా తెలుసుకొన్నారు గనుక వారి భాషలో ఆ పొలానికి “అకెల్ దామ” అనే పేరు వచ్చింది. ఆ మాటకు రక్తభూమి అని అర్థం).

[20] “కీర్తనల గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది: వాడి నివాసం పాడైపోతుంది గాక! దానిలో ఎవడూ బతకకుండా పోతాడు గాక! అతడి ఉద్యోగం మరొకరి పాలవుతుంది గాక.

[21] అందువల్ల ఒక విషయం తప్పనిసరి – యోహాను బాప్తిసం ఇచ్చిన కాలం మొదలుకొని యేసుప్రభువును మన దగ్గరనుంచి పైకి చేర్చడం జరిగేరోజు వరకూ – ఆయన మనమధ్య సంచారం చేస్తూ ఉన్న కాలమంతా –

[22] మనతో కూడా ఉన్న పురుషులలో ఒకడు మనతోపాటు ఆయన పునర్జీవితానికి సాక్షి అయి ఉండాలి” అన్నాడు.

[23] అప్పుడు వారు యోసేపు, మత్తీయ అనే ఇద్దరిని నిలబెట్టారు (యోసేపుకు “యూస్తస్” అనే ఇంటి పేరు ఉంది. అతణ్ణి “బర్సబ్బా” అని కూడా పిలుస్తారు).

[24] అప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు: “ప్రభూ! అందరి హృదయాలు నీకు తెలుసు.

[25] యూదా తన చోటికి వెళ్ళేందుకు అతిక్రమంవల్ల విడిచిపెట్టిన రాయబారి పదవిలో సేవలో పాల్గొనడానికి ఈ ఇద్దరిలో నీవు ఎన్నుకొన్నవాణ్ణి చూపించు.”

[26] అప్పుడు వారిని గురించి చీట్లు వేశారు. మత్తీయ పేర చీటి వచ్చింది గనుక అతణ్ణి పదకొండుమంది రాయబారులలో ఒకడుగా ఎంచడం జరిగింది.

అపొస్తలుల కార్యాలు — Chapters