[1] పౌలు దెర్బేకు, తరువాత లుస్త్రకు వెళ్ళాడు. అక్కడ తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. అతని తల్లి క్రీస్తును నమ్మిన యూదురాలు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
[2] తిమోతి లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సోదరులవల్ల మంచి పేరు పొందినవాడు.
[3] అతడు తనతో ప్రయాణం చేయాలని పౌలు కోరాడు, గనుక ఆ ప్రాంతం యూదుల కారణంగా అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని వారందరికీ తెలుసు.
[4] వారు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ప్రయాణం చేస్తూ పాటించడానికి ఏ నియమాలు జెరుసలంలో ఉన్న క్రీస్తురాయబారులూ పెద్దలూ నిర్ణయించారో వాటిని సంఘాలకు అందజేశారు.
[5] కనుక సంఘాలు విశ్వాసంలో స్థిరపడ్డాయి, ప్రతి రోజూ సంఖ్యలో వృద్ధి చెందాయి.
[6] వారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతం గుండా వెళ్ళిన తరువాత వారిని పవిత్రాత్మ ఆసియాలో వాక్కు ఉపదేశించ కుండా చేశాడు.
[7] ముసియ సరిహద్దులకు చేరినప్పుడు బితూనియలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గాని యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
[8] అందుచేత వారు ముసియను దాటిపోయి త్రోయకు వెళ్ళారు.
[9] అక్కడ రాత్రివేళ పౌలుకు స్వప్న దర్శనం కలిగింది. అందులో మాసిదోనియ దేశస్థుడొకడు నిలుచుండి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని అతణ్ణి వేడుకొంటూ పిలిచాడు.
[10] అతనికి ఆ దృశ్యం కలిగినప్పుడు, వారికి శుభవార్త ప్రకటించడానికి ప్రభువు మమ్ములను పిలిచాడని మేము నిశ్చయించుకొన్నాం. వెంటనే మాసిదోనియకు వెళ్ళడానికి పూనుకొన్నాం.
[11] త్రోయలో ఓడ ఎక్కి ప్రయాణమై తిన్నగా సమొత్రాకే దగ్గరకు వెళ్ళి మరునాడు నెయపొలి చేరుకొన్నాం.
[12] అక్కడనుంచి ఫిలిప్పీకి ప్రయాణం చేశాం. మాసిదోనియలోని ఆ ప్రాంతానికి ఫిలిప్పీ ముఖ్య పట్టణం, రోమ్ వారి వలస స్థలం కూడా. ఆ పట్టణంలో మేము కొన్ని రోజులు గడిపాం.
[13] పట్టణం బయట నది ఒడ్డున ప్రార్థన స్థలం ఉంటుందనుకొన్నాం గనుక విశ్రాంతి దినాన మేము అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ సమకూడిన స్త్రీలతో మాట్లాడడం మొదలు పెట్టాం.
[14] లూదియ అనే స్త్రీ వింటూ ఉంది. ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు పొడి అమ్మే వర్తకురాలు, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు.
[15] ఆమె తన ఇంటివారితోపాటు బాప్తిసం పొందిన తరువాత మమ్ములను ఒత్తిడి చేస్తూ “నేను ప్రభువుకు విశ్వాసపాత్రనని మీరనుకొంటే నా ఇంటికి వచ్చి బస చేయండి” అంటూ మమ్ములను ఒప్పించింది.
[16] ఒకప్పుడు మేము ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉంటే, సోదె చెప్పే దయ్యం పట్టిన బానిస పిల్ల ఒకతె మాకు ఎదురుపడింది. సోదె చెప్పడం మూలంగా ఆమె తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
[17] పౌలునూ మమ్ములనూ వెంబడిస్తూ ఆమె ఇలా అరచింది: “ఈ మనుషులు సర్వాతీతుడైన దేవుని దాసులు! ముక్తిమార్గం మనకు ప్రకటిస్తున్నారు!”
[18] ఆమె ఇలా అనేక రోజులు చేస్తూ వచ్చింది గనుక పౌలుకు చాలా బాధ అనిపించింది. అతడు ఆమె వైపు తిరిగి, ఆ దయ్యంతో “ఆమెలో నుంచి బయటికి రా! యేసు క్రీస్తు పేర నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. ఆ ఘడియలోనే అది బయటికి వచ్చింది.
[19] ఆమె యజమానులు తమ లాభసాధనం పోయిందని గ్రహించి పౌలు సైలసులను పట్టుకొని ఊరు చావడిలోకి అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయారు.
[20] న్యాయాధ్యక్షుల ఎదుటికి వారిని తీసుకుపోయి ఇలా అన్నారు: “ఈ మనుషులు మన పట్టణాన్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు.
[21] యూదులై ఉండి రోమ్వారమైన మనం అంగీకరించకూడని, పాటించకూడని ఆచారాలు ప్రకటిస్తున్నారు.”
[22] జనసమూహం ఒక్కుమ్మడిగా పౌలు సైలసులకు వ్యతిరేకంగా లేచారు. న్యాయాధ్యక్షులు వారి బట్టలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞ జారీ చేశారు.
[23] అనేక దెబ్బలు కొట్టించి వారిని చెరసాలలో వేయించారు. వారిని భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞ ఇచ్చారు.
[24] అలాంటి ఆజ్ఞ విని అతడు వారిని చెరసాల లోపలి గదిలోకి త్రోసివేసి వారి కాళ్ళు కొయ్యబొండల్లో బిగించాడు.
[25] అయితే మధ్యరాత్రి వేళ పౌలు సైలసులు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు.
[26] హఠాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరచుకొన్నాయి. అందరి సంకెళ్ళూ ఊడిపోయాయి.
[27] అప్పుడు చెరసాల అధికారి నిద్ర లేచి చెరసాల తలుపులు తీసి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి ఆత్మహత్య చేసుకోబోయాడు.
[28] అప్పుడు పౌలు “ఏ హానీ చేసుకోకు! మేమంతా ఇక్కడే ఉన్నాం” అని కేక వేశాడు.
[29] చెరసాల అధికారి దీపం తెమ్మని చెప్పి లోపలికి చొరబడి వణికిపోతూ పౌలు సైలసుల ముందు సాగిలపడ్డాడు.
[30] అప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి “అయ్యలారా! పాపవిముక్తి నాకు కలిగేలా నేనేం చేయాలి?” అని అడిగాడు.
[31] అందుకు వారు “ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం పెట్టు. అప్పుడు నీకు పాపవిముక్తి కలుగుతుంది. నీకు, నీ ఇంటివారికి కూడా కలుగుతుంది” అని చెప్పారు.
[32] అప్పుడు వారు అతనికీ అతని ఇంట్లో వారందరికీ ప్రభు వాక్కు బోధించారు.
[33] ఆ రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగాడు. ఆ తరువాతే అతడు, అతని ఇంటివారంతా బాప్తిసం పొందారు.
[34] పౌలు సైలసులను తన ఇంటికి వెంటబెట్టుకు వచ్చి వారి ఎదుట భోజనం పెట్టాడు. తనూ తన ఇంటివారంతా దేవుని మీద నమ్మకం ఉంచినందుచేత ఆనందించాడు.
[35] ఉదయమైనప్పుడు న్యాయాధ్యక్షులు “ఆ మనుషులను విడుదల చెయ్యి” అని చెప్పడానికి భటులను పంపారు.
[36] చెరసాల అధికారి “మిమ్మల్ని విడుదల చేయాలని న్యాయాధ్యక్షులు చెప్పి పంపారు గనుక మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని పౌలుతో చెప్పాడు.
[37] అయితే పౌలు వారితో అన్నాడు “రోమ్ పౌరులైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండా బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా తోసివేస్తారా? అలా కాదు. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుపోవాలి.”
[38] భటులు ఆ మాటలు న్యాయాధ్యక్షులకు తెలియజేశారు. పౌలు సైలసులు రోమ్ పౌరులని విని వారు భయపడ్డారు.
[39] వారు వచ్చి వారిని బతిమాలుకొని బయటికి తీసుకువెళ్ళి పట్టణం విడిచి వెళ్ళండని ప్రాధేయపడ్డారు.
[40] పౌలు సైలసులు చెరసాలనుంచి లూదియ ఇంటికి వెళ్ళారు. అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచిన తరువాత వెళ్ళిపోయారు.