Skip to content
Opens in a new window

[1] అప్పుడు యెహోవా నోవహుతో ఇలా అన్నాడు: “నీవూ, నీ ఇంటివారందరూ ఓడలోకి చేరుకోండి. ఈ తరంవాళ్ళలో కల్లా నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు.

[2] నీవు అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ నీతో తీసుకుపోవాలి. శుద్ధం కాని జంతువులన్నిటినీ రెండు మగవాటినీ, రెండు ఆడవాటినీ కూడా తీసుకుపోవాలి.

[3] గాలిలో ఎగిరే పక్షులను, ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ కూడా తీసుకు పోవాలి. వాటి జాతులు అంతరించకుండా, భూలోకమంతట్లో మళ్ళీ బ్రతికేలా అలా చేయాలి.

[4] ఎందుకంటే ఇంకా ఏడు రోజులకు భూమిమీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ వర్షం కురిపిస్తాను. నేను చేసిన సర్వ జీవకోటిని భూతలంనుంచి నిర్మూలం చేస్తాను.”

[5] యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు.

[6] జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.

[7] ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నోవహు అతనితోపాటు అతని భార్యా, అతని కొడుకులూ, కోడళ్ళూ ఆ ఓడలోకి చేరుకొన్నారు.

[8] దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే శుద్ధమైన, అశుద్ధమైన ప్రతి రకం జంతువూ, ప్రతి రకం పక్షీ, భూమిమీద తిరిగే ప్రతి విధమైనదీ

[9] జంట జంటలుగా మగవీ ఆడవీ నోవహుతో కూడా ఆ ఓడలోకి వెళ్ళాయి.

[10] ఏడు రోజుల తరువాత భూమిమీదికి జలప్రళయం వచ్చింది.

[11] నోవహు జీవితంలో ఆరు వందల సంవత్సరాల రెండు నెలల పదిహేడు రోజులు గడిచాయి. ఆ రోజే గొప్ప జలాగాధంలో ఉన్న ఊటలన్నీ ఒక్క పెట్టున బ్రద్దలయ్యాయి. ఆకాశ ద్వారాలు కూడా తెరచుకున్నాయి.

[12] ప్రచండ వర్షం భూమిమీద నలభై రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది.

[13] ఆ రోజే నోవహు, అతని కొడుకులు షేము, హాము, యాపెతు, అతని భార్య, అతని ముగ్గురు కోడళ్ళు ఓడలోకి వెళ్ళారు.

[14] అన్ని జాతుల జంతువులూ, పశువులూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, అన్ని జాతుల పిట్టలూ, పక్షులూ కూడా ఓడలోకి వెళ్ళాయి.

[15] ఊపిరి ఉన్న ప్రతిదీ రెండు రెండు ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్ళాయి.

[16] దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ, మగవీ, ఆడవీ ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు.

[17] జలప్రళయం భూమిమీద నలభై రోజులు ఉంది. నీళ్ళు అధికమై ఓడను పైకెత్తగా అది నేలపైనుంచి తేలుతూ ఉంది.

[18] ఆ నీళ్ళు భూమిమీద చాలా అధికమై లోతు ఎక్కువైంది. ఓడ నీళ్ళమీద తేలుతూ వెళ్ళింది.

[19] నీళ్ళ లోతు అత్యధికం కావడంచేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగి పొయ్యాయి.

[20] నీళ్ళ మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది. పర్వతాలు మునిగిపొయ్యాయి.

[21] శరీరం ఉన్న ప్రతిదీ – పక్షులూ, పశువులూ, జంతువులూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, ప్రతి మనిషీ కూడా నశించడం జరిగింది.

[22] నేలమీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది.

[23] భూతలం అంతటా జీవరాసులన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. మనుషులూ, పశువులూ, భూమిమీద తిరిగేవీ, గాలిలో ఎగిరే పక్షులూ, భూమిమీద లేకుండా నిర్మూలం అయ్యాయి. మిగిలింది నోవహు, అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే.

[24] ఆ నీళ్ళు భూమిమీద నూట యాభై రోజులు నిలిచాయి.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters