[1] ఇష్మాయేల్ జాతివాళ్ళు, యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళారు. ఈజిప్ట్ దేశస్థుడు పోతీఫరు అతణ్ణి అక్కడికి తీసుకువచ్చినవాళ్ళ దగ్గర కొనుక్కొన్నాడు. ఫరోదగ్గర ఈ పోతీఫరు ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి.
[2] యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, గనుక అతడు పనులన్నీ సఫలంగా చేస్తూ తన యజమాని అయిన ఆ ఈజిప్ట్‌వాడి ఇంట్లో ఉన్నాడు.
[3] యెహోవా అతనికి తోడుగా ఉన్న సంగతినీ, అతడు చేసే పనులన్నీ అతని చేతిలో యెహోవా సఫలం చేయడమూ అతని యజమాని చూశాడు.
[4] కనుక అతడు యోసేపు పట్ల దయ చూపాడు. ఇలా యోసేపు అతడికి సన్నిహిత పరిచారకుడయ్యాడు. ఆ మనిషి తన ఇంటిమీద యోసేపును నిర్వాహకుడిగా నియమించి, తనకు కలిగినదంతా అతని చేతికి అప్పచెప్పాడు.
[5] తన ఇంటిమీదా తనకు కలిగినదానంతటిమీదా నిర్వాహకుడుగా యోసేపును నియమించిన నాటినుంచి యోసేపు కారణంగా యెహోవా ఆ ఈజిప్ట్ వాడి ఇంటికి ఆశీస్సులు అనుగ్రహిస్తూ వచ్చాడు. యెహోవా ఆశీస్సులు అతని ఇంట్లో, పొలాల్లో అతడికి కలిగినదానంతటిమీదా ఉండేవి.
[6] ఈ విధంగా తన ఆస్తినంతా యోసేపు చేతికి అప్పచెప్పి “యోసేపు ఉన్నాడు గదా” అనుకొని తాను తినే ఆహారం తప్ప మిగతా విషయాలు ఏమీ చూచుకొనేవాడు కాదు.
[7] యోసేపు రూపవంతుడు, సుందరుడు. కనుక కొంతకాలం గడిచాక అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి “నన్ను పొందు” అంది.
[8] అతడు ఒప్పుకోలేదు. “నేను ఈ పాపిష్ఠి కార్యం జరిగించి దేవునికి విరోధంగా పాపం చేయడం ఎట్లా? నా యజమాని తన ఆస్తినంతా నా చేతిలో పెట్టి, నేను ఇక్కడ ఉండడంచేత ఇంట్లో ఏ విషయాన్ని చూచుకోవడం లేదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడెవడూ లేడు.
[9] ఆయన మిమ్ములను తప్ప సమస్తాన్నీ నాకప్పగించాడు – మీరు ఆయన భార్య గదా?” అన్నాడు
[10] రోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నా అతడు ఆమెను పొందడానికీ, ఆమెతో ఉండడానికీ ఆమెకు లొంగలేదు.
[11] ఒక రోజు అతడు తన పనిమీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో పనివాళ్ళెవరూ లేరు.
[12] ఆమె అతని పై వస్త్రం పట్టుకొని “నన్ను పొందు” అంది. అతడు తన వస్త్రం అలాగే ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపొయ్యాడు.
[13] అతడు వస్త్రం తన చేతిలో విడిచి తప్పించుకు వెళ్ళడం ఆమె చూచి, తన ఇంటి మనుషులను పిలిచి, వాళ్ళతో ఇలా అంది:
[14] “చూడు, నా భర్త మనల్ని అవమానపరచడానికి ఒక హీబ్రూవాణ్ణి మనదగ్గరికి తెచ్చాడు. నన్ను పొందడానికి వాడు వచ్చాడు. అంచేత నేను పెద్ద కేకలు వేశాను.
[15] నేను గట్టిగా కేకలు పెట్టడం వాడు విని నా దగ్గర తన వస్త్రాన్ని వదిలేసి తప్పుకొని బయటికి పారిపొయ్యాడు.”
[16] యోసేపు యజమాని ఇంటికి వచ్చేదాకా ఆమె అతని వస్త్రం తన దగ్గర ఉంచుకొంది.
[17] అప్పుడామె తన భర్తతో ఆ కథంతా చెప్పింది – “మీరు మనదగ్గరికి తెచ్చిన ఆ హీబ్రూవాడు నన్ను అవమానపరచడానికి నాదగ్గరికి వచ్చాడు.
[18] నేను గట్టిగా కేకలు వేస్తూంటే వాడు తన వస్త్రం నాదగ్గర వదిలేసి తప్పుకొని బయటికి పారిపొయ్యాడు.”
[19] “మీ దాసుడు నన్ను ఇలా చేశాడ”ని భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు యోసేపుమీద అతని యజమాని కోపాగ్ని రగులుకొంది.
[20] అతడు యోసేపును పట్టుకొని రాజుగారి ఖైదీలు ఉంచబడే చెరసాలలో పెట్టాడు. ఆ చెరసాలలోనే యోసేపు ఉండిపొయ్యాడు.
[21] అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉండి అతనిపై కటాక్షం చూపి ఆ చెరసాల అధిపతి అతణ్ణి దయ చూచేలా చేశాడు.
[22] చెరసాల అధిపతి ఆ ఖైదులో ఉన్న బందీలందిరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వాళ్ళక్కడ చేసేదంతా యోసేపే చేయించేవాడు.
[23] యెహోవా అతనికి తోడుగా ఉండడంచేత అతని చేతిలో ఉన్న దేనినీ చెరసాల అధిపతి చూచుకొనేవాడు కాదు. యోసేపు చేసే పనులన్నీ యెహోవా సఫలం చేశాడు.