[1] దేవుడు యాకోబుతో “నీవు సిద్ధపడి, బేతేలుకు వెళ్ళి, అక్కడ కాపురముండు. నీవు నీ అన్న ఏశావు దగ్గరనుంచి పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలివేదిక కట్టు” అన్నాడు.
[2] అప్పుడు యాకోబు తన ఇంటివారితోనూ తనదగ్గర ఉన్నవారందరితోనూ ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని, మీ దుస్తులు మార్చుకోండి.
[3] మనం సిద్ధపడి బేతేలుకు వెళ్ళిపోదాం. నా కష్ట సమయంలో దేవుడు నా మొర విని నేను వెళ్ళిన త్రోవలో నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవునికి బేతేలులో బలివేదిక నిర్మిస్తాను.”
[4] వారు తమకున్న ఇతర దేవుళ్ళ విగ్రహాలన్నిటినీ తమ చెవులకు పెట్టుకొన్న పోగులనూ యాకోబు చేతికిచ్చారు. అతడు షెకెం దగ్గర ఉన్న సిందూర వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు.
[5] వారు వెళ్ళిపోతూ ఉంటే వారి చుట్టూ ఉన్న ఊళ్ళకు దేవుడు భయం కలిగించాడు, గనుక ఆ ప్రాంతం వాళ్ళు యాకోబు కొడుకులను తరుమలేదు.
[6] యాకోబు అతనితో ఉన్నవారంతా కనానుదేశంలోని లూజుకు చేరారు. లూజు అంటే బేతేల్.
[7] అక్కడ అతడొక బలివేదిక కట్టి ఆ చోటికి ‘ఏల్‌బేతేల్’ అనే పేరు పెట్టాడు, ఎందుకంటే తాను తన అన్నదగ్గరనుంచి పారిపోయినప్పుడు అక్కడ తనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
[8] అక్కడ రిబ్కా దాది దెబోరా చనిపోయింది. బేతేలుకు దిగువ ఉన్న సిందూర వృక్షం క్రింద ఆమెను పాతిపెట్టడం వల్ల దానికి ‘అల్లోనుబాకూత్’ అనే పేరు పెట్టారు.
[9] యాకోబు పద్దన్ అరాం నుంచి వచ్చినప్పుడు అతనికి దేవుడు మరోసారి ప్రత్యక్షమై అతణ్ణి దీవించాడు. అప్పుడు దేవుడు అతనితో,
[10] “నీ పేరు యాకోబు, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు; నీకు ఇస్రాయేల్ అనే పేరు ఉంటుంది” అని చెప్పి అతనికి “ఇస్రాయేల్” అనే పేరు పెట్టాడు.
[11] దేవుడు అతనితో ఇంకా అన్నాడు, “నేను అమిత శక్తిగల దేవుణ్ణి. నీవు ఫలించి సంఖ్యలో అధికం కావాలి. నీ మూలంగా ఒక జనమూ, అనేక జనాలూ కలుగుతాయి. నీ సంతానంలో రాజులు ఉంటారు.
[12] నేను అబ్రాహాముకూ ఇస్సాకుకూ ఇచ్చిన ఈ దేశాన్ని నీకూ నీ తరువాత నీ సంతానానికీ ఇస్తాను.”
[13] దేవుడు తాను అతనితో మాట్లాడిన స్థలం నుంచి పైకి వెళ్ళిపోయాడు.
[14] యాకోబు తనతో దేవుడు మాట్లాడిన స్థలంలో జ్ఞాపకార్థమైన రాతిస్తంభాన్ని స్మృతిచిహ్నంగా నిలిపి, దానిమీద పానార్పణం చేసి, నూనె పోశాడు.
[15] తనతో దేవుడు మాట్లాడిన స్థలానికి ‘బేతేల్’ అనే పేరు పెట్టాడు యాకోబు.
[16] తరువాత వారు బేతేల్ నుంచి ప్రయాణమై ఎఫ్రాతా మార్గాన వెళ్ళిపోతున్నారు. ఆ స్థలం ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు, రాహేలుకు ప్రసవవేదన వచ్చింది. దానివల్ల ఆమెకు చాలా కష్టం కలిగింది.
[17] ఆమె చాలా కష్టంతో ప్రసవించగా మంత్రసాని ఆమెతో “భయపడకు, నీకు మరో కొడుకు పుట్టాడు” అంది.
[18] అప్పుడు రాహేలు చనిపోయింది. ప్రాణం విడిచే క్షణంలో తన కొడుకు పేరు “బెనోని” అన్నది. కాని, అతని తండ్రి అతనికి “బెన్యామీను” అనే పేరు పెట్టాడు.
[19] అలా రాహేలు చనిపోయిన తరువాత ఆమెను ఎఫ్రాతా మార్గాన పాతిపెట్టారు. ఎఫ్రాతా అంటే బేత్‌లెహేం.
[20] యాకోబు ఆమె సమాధిమీద ఒక జ్ఞాపకార్థ స్తంభం నిలిపాడు. నేటి వరకు రాహేలు సమాధి మీద ఉండే స్తంభం అదే.
[21] ఇస్రాయేల్ ప్రయాణమై వెళ్ళి మిగ్దల్ ఎదెరుకు అవతల తన గుడారం వేసుకొన్నాడు.
[22] ఇస్రాయేల్ ఆ ప్రదేశంలో కాపురమున్నప్పుడు జరిగినదేమిటంటే, రూబేను తన తండ్రి ఉంచుకున్న బిల్హాతో పోయాడు. ఆ సంగతి ఇస్రాయేల్‌కు వినవచ్చింది కూడా.
[23] యాకోబు కొడుకులు పన్నెండుమంది. లేయా కన్నవారు రూబేను (అతడు యాకోబు పెద్ద కొడుకు), షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, జెబూలూను.
[24] రాహేలు కన్నవారు యోసేపు, బెన్యామీను.
[25] రాహేలు దాసి బిల్హా కన్నవారు దాను, నఫ్తాలి.
[26] లేయా దాసి జిల్పా కన్నవారు గాదు, ఆషేరు. వీరు పద్దన్ ఆరాంలో యాకోబుకు జన్మించిన కొడుకులు.
[27] తరువాత యాకోబు మమ్రేకు తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వెళ్ళాడు. మమ్రే అంటే హెబ్రోను. అక్కడ అబ్రాహాము, ఇస్సాకు కొంత కాలం కాపురమున్నారు.
[28] ఇస్సాకు జీవించిన కాలం నూట ఎనభై ఏళ్ళు.
[29] ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి, తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.