[1] రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నది దగ్గర నిలబడి ఉన్నాడు.
[2] నదిలోనుంచి బలిసిన నున్నని ఆవులు ఏడు పైకి వచ్చి, జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
[3] వాటి తరువాత చిక్కిపోయిన నీరసమైన మరో ఏడు ఆవులు నదిలోనుంచి పైకి వచ్చి, ఆ ఆవులదగ్గర నది ఒడ్డున నిలుచున్నాయి.
[4] అప్పుడు చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన నున్నని ఆ ఏడు ఆవులను మ్రింగివేశాయి. దానితో ఫరో మేల్కొన్నాడు.
[5] కాసేపటికి అతడు నిద్రపోయి రెండోసారి కల కన్నాడు. అందులో ఏడు పుష్టిగల మంచి వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది.
[6] వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి. అవి పీలవి, తూర్పుగాలికి ఎండిపోయినవి.
[7] అప్పుడా పీల వెన్నులు పుష్టిగల మంచి వెన్నులను మ్రింగివేశాయి. దానితో ఫరో మేల్కొని అది కల అని గ్రహించాడు.
[8] ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది. కనుక అతడు ఈజిప్ట్‌దేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడానికి ఎవరిచేతా కాలేదు.
[9] అప్పుడు పానపాత్ర అందించేవాడు ఫరోతో ఇలా చెప్పాడు: “ఈవేళ నా తప్పులు గుర్తుకు వస్తున్నాయి.
[10] ఫరో తన సేవకులమీద కోప్పడి, నన్ను, రొట్టెలు చేసే మనిషిని, మా ఇద్దరినీ రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచాడు.
[11] నేనూ అతడూ ఇద్దరమూ ఒకే రాత్రిలో వేరు వేరు భావాలు గల కలలు కన్నాం.
[12] అప్పుడు అక్కడ మాతోపాటు ఒక యువకుడు ఉన్నాడు. అతడు హీబ్రూవాడు, రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు. మేము ఆ కలలు చెప్పినప్పుడు అతడు వాటి భావాలు తెలియజేశాడు.
[13] అతడు మాకు తెలిపిన భావాల ప్రకారమే అంతా జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించడమూ, రొట్టెలు చేసే మనిషిని ఉరిదీయడమూ జరిగింది.”
[14] అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలోనుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు.
[15] చక్రవర్తి యోసేపుతో, “నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు.
[16] యోసేపు చక్రవర్తితో “అది నాచేత అయ్యేది కాదు – దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు.
[17] అప్పుడు చక్రవర్తి యోసేపుతో ఇలా చెప్పాడు: “నా కలలో నేను నది ఒడ్డున నిలబడ్డాను.
[18] హఠాత్తుగా నదిలోనుంచి బలిసిన నున్నని ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
[19] వాటి తరువాత మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అవేమో చిక్కిపోయినవి, నీరసంగా, చాలా వికారంగా ఉన్నాయి. అంత వికారమైనవి ఈజిప్ట్‌దేశమంతట్లో నాకు ఎన్నడూ కనిపించలేదు.
[20] చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన ఆ మొదటి ఏడు ఆవుల్ని మ్రింగివేశాయి.
[21] అవి కడుపులో పడ్డాక అవి కడుపులో పడ్డట్టు కనిపించలేదు. అంటే, మొదట అవి ఎంత నీరసంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.
[22] తరువాత నా కలలో నేను చూస్తుండగా ఏడు పుష్టిగల వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది.
[23] వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి. అవి పీలవి, వాడిపోయినవి, తూర్పుగాలికి ఎండిపోయినవి.
[24] ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నుల్ని మ్రింగివేశాయి. ఇదంతా మాంత్రికులకు తెలియజేశాను. గానీ దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాలేదు.”
[25] యోసేపు చక్రవర్తితో ఇలా అన్నాడు: “ఫరోకు వచ్చిన కలల భావం ఒకటే. దేవుడు తాను జరిగించనై ఉన్నది ఫరోకు తెలిపాడు.
[26] ఆ ఏడు మంచి ఆవులు ఏడేళ్ళు. ఆ ఏడు మంచి వెన్నులూ ఏడేళ్ళు. కల ఒకటే.
[27] వాటి తరువాత పైకి వచ్చిన, చిక్కిపోయిన నీరసమైన ఏడు ఆవులూ, తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు పీల వెన్నులూ కూడా ఏడేళ్ళు. అవి ఏడేళ్ళ కరవును సూచిస్తాయి.
[28] నేను ఫరోతో చెప్పినట్టే దేవుడు తాను జరిగించనై ఉన్నది ఫరోకు తెలిపాడు.
[29] వినండి, ఈజిప్ట్‌దేశం అంతా విస్తారమైన పంటలు పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.
[30] ఆ తరువాత ఏడేళ్ళ కరవు వస్తుంది. ఆ విస్తారమైన పంటలను అప్పుడు ఈజిప్ట్‌దేశం మరచిపోతుంది. ఆ కరవు దేశాన్ని పాడు చేస్తుంది.
[31] తరువాత రాబొయ్యే కరవు కారణంగా దేశంలో ఆ పంటల సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ కరువు చాలా తీవ్రంగా ఉంటుంది.
[32] దేవుడు ఇలా జరిగించడానికి నిశ్చయించుకొన్నాడు. ఆయన సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది. ఈ కల ఫరోకు రెండు సార్లు రావడంలో భావం ఇదే.
[33] “అందుచేత ఇప్పుడు ఫరో తెలివితేటలు గలవాణ్ణి వెదికి అతణ్ణి ఈజిప్ట్‌దేశంపై నియమిస్తే బాగుంటుంది.
[34] ఫరో అలా చేసి పైవిచారణకర్తలను కూడా ఈ దేశంమీద నియమించి, పంటలు సమృద్ధిగా పండే ఏడేళ్ళలో ఈజిప్ట్ అంతటా అయిదో భాగం తీసుకొంటే బాగుంటుంది.
[35] వారు రాబొయ్యే ఈ మంచి ఏళ్ళలో పండే ఆహారమంతా సేకరించి ఆ ధాన్యం ఫరో ఆధీనంలో కూడబెట్టి, పట్టణాల్లో ఆ ఆహారం భద్రం చెయ్యాలి.
[36] కరవుచేత ఈ దేశం నాశనం కాకుండా ఈజిప్ట్‌లో రాబొయ్యే ఏడు కరవు సంవత్సరాలలో దేశంలో కూడబెట్టిన ఆహారం ఉంటుంది.”
[37] ఆ మాట ఫరోకు అతడి పరివారంలో అందరికీ నచ్చింది.
[38] అప్పుడు ఫరో తన పరివారంతో “ఇతడిలాగా దైవాత్మ గలవాడు మరొకడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.
[39] యోసేపుతో ఫరో అన్నాడు, “దేవుడు ఇదంతా నీకు తెలిపాడు, గనుక నీకున్నంత తెలివితేటలు ఇంకెవరికీ లేవు.
[40] నీవు నా భవనంలో పై అధికారివై ఉంటావు. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణిగా ఉంటాను.”
[41] ఫరో ఇంకా యోసేపుతో “విను, ఈజిప్ట్ దేశ మంతటి మీదా ఇప్పుడు నీకు అధికారమిస్తున్నాను” అని చెప్పి,
[42] తన చేతికి ఉన్న రాజ ముద్రగల ఉంగరం తీసి, యోసేపు చేతికి పెట్టి, శ్రేష్ఠమైన దుస్తులు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
[43] అప్పుడు చక్రవర్తి తన రెండో రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు. రథం సాగుతూ ఉంటే అతని ముందర జనం “తోవ ఇవ్వండి” అని కేకలువేస్తూ ఉన్నారు. ఇలా చక్రవర్తి యోసేపుకు ఈజిప్ట్ దేశంమంతటిమీదా అధికారం ఇచ్చాడు.
[44] చక్రవర్తి యోసేపుతో “నేను ఫరోను. నీ సెలవు లేకుండా ఈజిప్ట్ అంతటా ఎవ్వరూ ఏమీ చేయకూడదు” అన్నాడు.
[45] చక్రవర్తి యోసేపుకు “జప్‌నత్‌పనేహు” అనే మారుపేరు పెట్టాడు. అంతేగాక ఓను అనే పట్టణం యాజియైన పోతీఫెర కూతురిని యోసేపుకు ఇప్పించి పెళ్ళి చేశాడు. ఆమె పేరు ఆసెనతు. తరువాత యోసేపు ఈజిప్ట్‌దేశ సంచారం చేశాడు.
[46] ఫరో ఎదుట నిలబడ్డప్పుడు యోసేపు ముప్ఫయి ఏళ్ళవాడు. యోసేపు ఫరో సముఖంనుంచి వెళ్ళి ఈజిప్ట్ దేశంలో నలుదిక్కుల ప్రయాణాలు చేశాడు.
[47] సమృద్ధిగా పండిన ఆ ఏడేళ్ళలో భూమి చాలా ఫలవంతంగా ఉంది.
[48] ఈజిప్ట్‌దేశంలో ఉన్న ఏడేళ్ళ ఆహారమంతా యోసేపు సేకరించి దానిని పట్టణాలలో నిలువ చేశాడు. ఏ పట్టణం చుట్టు ఉన్న పొలాల పంట ఆ పట్టణంలో నిలువ చేశాడు.
[49] యోసేపు చాలా ధాన్యం పోగు చేశాడు. అసలు అది సముద్రం ఇసుకంత సమృద్ధిగా ఉంది. కొలవడానికి వీలులేనంతగా ఉండడంచేత వాళ్ళు కొలవడం మానివేశారు.
[50] కరవు ఆరంభించిన సంవత్సరానికి ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అతనికి వారిని ఓను అనే పట్టణం యాజి పోతీఫెర కూతురు ఆసెనతు కన్నది.
[51] యోసేపు మొదట పుట్టినవాడికి “మనష్షే” అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “దేవుడు నా కష్టాన్నంతా, నా తండ్రి ఇంటినీ, నేను మరచిపోయేలా చేశాడు” అనుకొన్నాడు.
[52] రెండో కొడుకుకు “ఎఫ్రాయిం” అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అనుకొన్నాడు.
[53] తరువాత ఈజిప్ట్‌దేశంలో సమృద్ధిగా పండిన ఏడు ఏళ్ళు గడిచిపొయ్యాయి.
[54] యోసేపు చెప్పినట్టే, ఏడు కరువు ఏళ్ళు ఆరంభమయ్యాయి. అన్ని దేశాల్లో కరవు వచ్చింది. అయితే ఈజిప్ట్‌దేశం అంతటా ఆహారం ఉంది.
[55] ఈజిప్ట్‌లో అన్ని చోట్లకు కరువు వ్యాపించాక ప్రజలు ఆహారంకోసం చక్రవర్తితో మొరపెట్టుకొన్నారు. ఫరో ఈజిప్ట్ వాళ్ళందరికీ “మీరు యోసేపు దగ్గరకి వెళ్ళి, అతడు మీతో చెప్పేదేదో అది చెయ్యాలి” అని చెప్పాడు.
[56] ఆ కరవు లోకమంతటికీ వచ్చింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఈజిప్ట్‌వాళ్ళకు ధాన్యం అమ్మాడు. ఈజిప్ట్‌దేశంలో కరువు తీవ్రంగా ఉంది.
[57] అంతేగాక, ఆ కరువు లోకంలో అంతటా తీవ్రంగా ఉండడంచేత యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనడానికి లోకమంతా ఈజిప్ట్‌కు వచ్చింది.